ఆంధ్ర చేజారిన అవకాశం

Match draw with Andhra and Baroda - Sakshi

బరోడాతో మ్యాచ్‌ ‘డ్రా’

వడోదర: రంజీ ట్రోఫీలో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆంధ్ర జట్టు ప్రత్యర్థిని పడగొట్టి మ్యాచ్‌ను గెలుచుకోవడంలో విఫలమైంది. బరోడాతో మంగళవారం ముగిసిన గ్రూప్‌ ‘సి’ మ్యాచ్‌ను ఆంధ్ర ‘డ్రా’తో సరిపెట్టుకుంది. చివరి రోజు ఆట ముగిసే సమయానికి బరోడా తమ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఆ సమయంలో ఓవరాల్‌గా బరోడా కేవలం 12 పరుగులు మాత్రమే ముందంజలో ఉంది. ఒక దశలో 136 పరుగుల వద్దే బరోడా తమ ఆరో వికెట్‌ కోల్పోయింది. ఆ సమయంలో ఆంధ్ర ఒత్తిడి పెంచలేకపోవడంతో బరోడా ఆ తర్వాత మరో 16.2 ఓవర్ల పాటు పోరాడి మ్యాచ్‌ను కాపాడుకుంది. స్వప్నిల్‌ సింగ్‌ (50 నాటౌట్‌), పీనాల్‌ షా (9 నాటౌట్‌) ఏడో వికెట్‌కు 59 పరుగులు జత చేశారు.

ఇతర బ్యాట్స్‌మెన్‌లో సోలంకి (68), వాఘ్‌మోడ్‌ (56) రాణించారు. అశ్విన్‌ హెబర్, అయ్యప్ప చెరో 2 వికెట్లతో బరోడాను దెబ్బ తీశారు. అంతకు ముందు ఓవర్‌నైట్‌ స్కోరు 505/9తో ఆట కొనసాగించిన ఆంధ్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో మరో 10.1 ఓవర్లు ఆడి 554 పరుగులకు ఆలౌటైంది. బోడపాటి సుమంత్‌ (144 బంతుల్లో 86; 11 ఫోర్లు, 1 సిక్స్‌) ఆకట్టుకున్నాడు. ఆంధ్రకు 3 పాయింట్లు దక్కగా...హనుమ విహారి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. మరోవైపు హైదరాబాద్‌లో వరుసగా నాలుగో రోజు కూడా ఆట సాధ్యం కాక హైదరాబాద్, ఉత్తరప్రదేశ్‌ మ్యాచ్‌ ఒక బంతి కూడా పడకుండానే రద్దయింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top