ఆఖరి ఇన్నింగ్స్ ఆడేశాడు | final innings match Brendan Mekallam is Played | Sakshi
Sakshi News home page

ఆఖరి ఇన్నింగ్స్ ఆడేశాడు

Feb 23 2016 12:22 AM | Updated on Sep 3 2017 6:11 PM

ఆఖరి ఇన్నింగ్స్ ఆడేశాడు

ఆఖరి ఇన్నింగ్స్ ఆడేశాడు

న్యూజిలాండ్ డాషింగ్ బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెకల్లమ్ కెరీర్‌లో ఆఖరి అంతర్జాతీయ ఇన్నింగ్స్ ఆడేశాడు.

25 పరుగులు చేసిన మెకల్లమ్
రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 121/4
ఆసీస్‌తో రెండో టెస్టు

  
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ డాషింగ్ బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెకల్లమ్ కెరీర్‌లో ఆఖరి అంతర్జాతీయ ఇన్నింగ్స్ ఆడేశాడు. తొలి ఇన్నింగ్స్ స్థాయిలో కాకపోయినా రెండో ఇన్నింగ్స్‌లో ఓ మోస్తరు ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో.... సోమవారం మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన మెకల్లమ్  (27 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి జోరును చూపెట్టే ప్రయత్నం చేశాడు. హాజెల్‌వుడ్ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌ను బాదిన బ్రెండన్ తర్వాతి బంతిని కూడా అదే స్థాయిలో గాల్లోకి లేపాడు. అయితే వార్నర్ చక్కని క్యాచ్ అందుకోవడంతో మెకల్లమ్ ఆఖరి అంతర్జాతీయ ఇన్నింగ్స్‌కు తెరపడింది. టాప్ ఆర్డర్ వైఫల్యంతో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 44 ఓవర్లలో 4 వికెట్లకు 121 పరుగులు చేసింది. ఆట ముగిసే సమయానికి విలియమ్సన్ (45 బ్యాటింగ్), అండర్సన్ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. లాథమ్ (39) ఫర్వాలేదనిపించాడు.

ప్రస్తుతం కివీస్ ఇంకా 14 పరుగులు వెనుకబడి ఉంది. ప్యాటిన్సన్ 3 వికెట్లు తీశాడు. అంతకుముందు 363/4 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 153.1 ఓవర్లలో 505 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆసీస్‌కు 135 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ వోజెస్ (60), లయోన్ (33) నిలకడగా ఆడారు. మిచెల్ మార్ష్ (18), నీవెల్ (13), హాజెల్‌వుడ్ (13) వరుస విరామాల్లో అవుటయ్యారు. వాగ్నేర్ 6, బౌల్ట్ 2 వికెట్లు పడగొట్టారు.

Advertisement

పోల్

Advertisement