పెద్దన్నా? ప‌సి కూనా?

fifa world cup 2018:Today is the final of Football World Cup - Sakshi

నేడు ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌

క్రొయేషియాతో ఫ్రాన్స్‌ ‘ఢీ’

జర్మనీ తరం కాలేదు... స్పెయిన్‌ సత్తా సరిపోలేదు... అర్జెంటీనాకు వశపడలేదు...బ్రెజిల్‌ బేజారైపోయింది...బెల్జియం–ఇంగ్లండ్‌లది ‘మూడో’ ముచ్చటే!... ఫేవరెట్లన్నీ ఫట్‌ ఫట్‌మని తేలిపోయాయి!...‘ఫైనల్‌’గా ఫ్రాన్స్‌   ఒక్కటే మిగిలింది!

పోర్చుగల్‌ పనైపోయింది...ఉరుగ్వే పరుగు ఆగింది...మెక్సికోకు కళ్లెం పడింది...కొలంబియా ఇంటికెళ్లిపోయింది......‘అండర్‌ డాగ్స్‌’ సంచలనం సమాప్తమైంది!...క్రొయేషియా ఒక్కటే     కొరకరానిదిగా తేలింది!  

మాస్కో: అభిమానులను ఉర్రూతలూపి... ప్రేక్షకులను రంజింపజేసిన నెల రోజుల మహా సంరంభంలో ఆఖరి అంకం! ఫుట్‌బాల్‌ జగజ్జేతను తేల్చే సంగ్రామం! సరిగ్గా ముప్ఫై రోజుల క్రితం ఊహకైనా అందని రెండు జట్లు నేడు తుది సమరానికి నిలిచాయి. నవ యువకులతో కళకళలాడుతున్న ఫ్రాన్స్‌... అనుభవజ్ఞులతో రాటుదేలిన క్రొయేషియా! కప్పు నీదా నాదా అనేలా తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. లియోనల్‌ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, నెమార్‌ల గొప్పదనం కాదు.. మా ప్రతిభ చూడండి అంటు దూసుకొచ్చారు ఫ్రాన్స్‌ ఆశాకిరణాలు గ్రీజ్‌మన్, ఎంబాపె, క్రొయేషియా మొనగాళ్లు మోడ్రిచ్, పెరిసిచ్‌. నరాలు తెగే ఉత్కంఠను అధిగమించి వీరిలో మెరిసేదెవరో? తమ దేశానికి కప్‌ అందించేదెవరో? తేలేందుకు మరొక్క రోజే సమయం.  

చరిత్రకు ఎదురీది... 
ప్రపంచ కప్‌ ప్రారంభానికి ముందు ఫేవరెట్లలో ఒకటిగా ఫ్రాన్స్‌ పేరు వినిపించినా ఏ మూలనో సందేహం! మెరికల్లాంటి ఆటగాళ్లున్నా కొన్నేళ్లుగా జట్టు తడబడుతుండటమే ఇందుకు కారణం. ఆతిథ్య దేశ హోదాలో, 1998లో ప్రస్తుత కోచ్‌ డైడర్‌ డెచాంప్స్‌ సారథ్యంలో, థియరీ హెన్రీ, జినెదిన్‌ జిదాన్‌ జోరుతో తొలిసారి టైటిల్‌ గెలిచిన ఫ్రాన్స్‌... 2002 కప్‌లో గ్రూప్‌ దశలోనే వెనుదిరిగింది. 2006లో రన్నరప్‌గా నిలిచినా, 2010లో గ్రూప్, 2014లో క్వార్టర్స్‌ అధిగమించలేకపోయింది. వీటన్నింటిని మించి సొంతగడ్డపై 2016 యూరో కప్‌ను పోర్చుగల్‌కు చేజార్చుకుంది. ఇంతటి అనిశ్చితి ఆట తీరుతోనే ఏమో... డెచాంప్స్‌ కూడా జట్టును సెమీస్‌ చేర్చితే చాలనుకున్నాడు. కానీ, దానిని మించి ముందుకెళ్లారు. యువతరంతో తొణికిసలాడుతున్న జట్టుకు, కెప్టెన్‌గా, కోచ్‌గా దేశానికి రెండుసార్లు కప్‌ అందించిన వాడిగా చరిత్రలో నిలిచేందుకు డెచాంప్స్‌కు ఇది సువర్ణావకాశమే. ఫ్రాన్స్‌ టైటిల్‌ కొట్టిన 1998లోనే... ఒక దేశం హోదాతో కప్‌లో ప్రవేశించిన క్రొయేషియా సెమీస్‌ చేరి పెను సంచలనం సృష్టించింది. క్వార్టర్స్‌లో దిగ్గజ జర్మనీని 3–0తో ఓడించినా, సెమీస్‌లో ఫ్రాన్స్‌కు 2–1తో తలొగ్గింది. అయితే, నెదర్లాండ్స్‌పై 2–1తో నెగ్గి మూడో స్థానంలో నిలిచింది. తర్వాతంతా పేలవ ప్రదర్శనే. మూడు కప్‌లలో (మధ్యలో 2010లో అర్హత పొందలేదు) గ్రూప్‌ దశ దాటలేదు. ప్రస్తుతం మాత్రం పదునైన ఆటతో ఫైనల్‌కు చేరింది. ఓ విధంగా జట్టు ఇప్పటికే చరిత్ర సృష్టించింది. మరో విధంగా రికార్డులకు ఎక్కే మహదావకాశం ముందుంది. 

పడుతూ లేస్తూ... లేచి పడుతూ! 
టోర్నీలో రెండు జట్లది పూర్తి భిన్న ప్రయాణం. లీగ్‌ దశలో ఆస్ట్రేలియా సెల్ఫ్‌ గోల్‌ చేసుకోవడంతో గెలవగలిగిన ఫ్రాన్స్‌... తర్వాత పెరూపై 1–0తో బయట పడింది. డెన్మార్క్‌తో స్కోరేమీ లేకుండా ‘డ్రా’ చేసుకుంది. నాకౌట్‌లో మాత్రం జూలు విదిల్చింది. ప్రిక్వార్టర్స్‌లో 4–3తో అర్జెంటీనాను చిత్తు చేసి, క్వార్టర్స్‌లో ఉరుగ్వేను 2–0తో సునాయాసంగా ఇంటికి పంపింది. సెమీస్‌లో ప్రమాదకర బెల్జియంకు పుంజుకునే అవకాశమే ఇవ్వకుండా 1–0తో ముగించింది. క్రొయేషియా మాత్రం నైజీరియాను 2–0తో, అర్జెంటీనాను 3–0తో, ఐస్‌లాండ్‌ను 2–1తో కొట్టేసి లీగ్‌లో అజేయంగా నిలిచింది. అయితే, నాకౌట్‌లో కిందామీదా పడింది. డెన్మార్క్, రష్యాలపై పెనాల్టీ షూటౌట్‌లలో, సెమీస్‌లో మాజీ చాంపియన్‌ ఇంగ్లండ్‌పై అదనపు సమయంలో గోల్‌తో ఊపిరి పీల్చుకుంది. ఈ మూడు సార్లూ మ్యాచ్‌లో వెనుకబడినా... పుంజుకుని గెలుపొందడం క్రొయేషియా పోరాటం తీవ్రతను చాటుతోంది. 

రక్షణ శ్రేణి–మిడ్‌ ఫీల్డర్స్‌ 
మొండి రక్షణ శ్రేణితో ప్రత్యర్థికి పట్టు చిక్కనివ్వదు ఫ్రాన్స్‌. మిడ్‌ ఫీల్డర్ల దన్నుతో కడవరకు పోరాడుతుంది క్రొయేషియా. ఈ రెండింటి మధ్య మ్యాచ్, అదీ ఫైనల్‌ అంటే రసవత్తరంగా సాగడం ఖాయం. ఫ్రెంచ్‌ డిఫెండర్లు పవార్డ్, వరానె, ఉమ్‌టిటిలు కీలక సమయంలో కొట్టిన గోల్స్‌ టోర్నీలో ఆ జట్టుకు విజయాలు అందించాయి. క్రొయేషియా మిడ్‌ ఫీల్డర్లు ఇవాన్‌ రాకిటిచ్,  కెప్టెన్‌ లూకా మోడ్రిచ్, బడెల్జ్‌లు ఎలాంటి పరిస్థితినైనా సమన్వయం చేయగల సమర్థులు. అయితే, ఆంటోన్‌ గ్రీజ్‌మన్, కిలియాన్‌ ఎంబాపె, గిరౌడ్, ఉస్మాన్‌ డంబెల్, ఫెకిర్‌ వంటి మెరికల కలయికతో స్ట్రయికర్ల బలంలో మాజీ చాంపియన్‌దే కొంత పైచేయిగా ఉంది. ప్రత్యర్థి జట్టు స్ట్రయికర్లు ఇవాన్‌ పెరిసిచ్, మాన్‌జుకిచ్‌ సెమీస్‌లో గోల్స్‌ కొట్టి తామెంత ప్రమాదకారులమో చాటారు. వీరు తప్ప  క్రమారిచ్, కలినిచ్, రెబిచ్‌లు పెద్దగా మెరవకపోవడం లోటు. ఫ్రాన్స్‌ మిడ్‌ఫీల్డ్‌లోని పోగ్బా, కాంటె, మటౌడి, క్రొయేషియా డిఫెండర్లలోని పివారిచ్, విదా, లొవ్రెన్‌ కూడా మ్యాచ్‌ను మలుపుతిప్పే సత్తా ఉన్నవారే.  

మా ‘ఆకలి‘ తీరాలి... 
ఫ్రాన్స్‌ జట్టులోని యువ ఆటగాళ్లు ట్రోఫీని తాకాలని తహతహలాడుతున్నారు. 1998లో తమ దేశం కప్‌ గెలిచినపుడు వీరిలో చాలామంది ఐదేళ్లలోపు చిన్నారులే. అందుకేనేమో, ‘ఫైనల్లో ఆడటం చిన్ననాటి కల. అదిప్పుడు నెరవేరుతోంది. మేం టైటిల్‌కు దగ్గరగా వచ్చాం. ఈ మ్యాచ్‌ మాకు జీవితంతో సమానం’ అని మిడ్‌ ఫీల్డర్‌ మట్యుడి అంటున్నాడు. 2016 యూరో కప్‌ ఫైనల్లో ఓడిన అనుభవం పాఠాలు నేర్పిందని చెబుతున్నాడు. 

ఫ్రాన్స్‌ 
గోల్‌ కీపర్లు: లోరిస్, స్టీవ్‌ మండాండా, ఎరోలా 
డిఫెండర్లు: పవార్డ్, కింపెంబె, వరానె, ఉమ్‌టిటి, అదిల్, సిడిబి, హెర్నాండెజ్, మెండి. 
మిడ్‌ ఫీల్డర్లు: పోగ్బా, కాంటె, టొలిస్సొ, మట్యుడి, ఎంజొన్‌జి. 
ఫార్వర్డ్స్‌: గ్రీజ్‌మన్, లెమర్, గిరౌడ్, ఎంబాపె, డంబెల్, ఫెకిర్, థయువిన్‌. 

క్రొయేషియా 
గోల్‌ కీపర్లు: సుబాసిచ్, లివకోవిచ్, కలినిచ్‌. 
డిఫెండర్లు: వ్రసాల్కొ, స్టిరినిచ్, కొర్లుకా, లొవ్రెన్, జెడ్వాజ్, కలెట్‌ కార్, విదా, పివారిచ్‌. 
మిడ్‌ ఫీల్డర్లు: రకిటిచ్, కొవాసిచ్, మోడ్రిచ్, బ్రొజొవిచ్, బ్రడారిచ్, బడెల్జ్‌. 
ఫార్వర్డ్స్‌: పెరిసిచ్, క్రమారిచ్, కలినిచ్, మన్‌జుకిచ్, రెబిచ్, మార్కో జాకా. 

బలాన్నే నమ్ముకున్నాం 
మేం కఠిన మార్గంలో వచ్చాం. ఆడిన నిమిషాలను లెక్కిస్తే టోర్నీలో మొత్తం 8 మ్యాచ్‌లు ఆడినట్లు లెక్క. బహుశా ఏ ప్రపంచ కప్‌లో ఏ జట్టుకూ ఇలా జరిగి ఉండకపోవచ్చు. కష్టమైనదే అయినా ఇది జీవితంలో ఒక్కసారే వచ్చే అవకాశం. మేం బలాన్ని, ప్రేరణను నమ్ముకుని ముందుకెళ్తున్నాం. 
– క్రొయేషియా కోచ్‌ జాల్టొ

ఇదో గొప్ప గౌరవం 
ఓ ఫుట్‌బాలర్‌కు ఇంతకంటే మించిన గొప్ప గౌరవం ఏమీ ఉండదు. మేం మొదటినుంచి నమ్ముకున్న నిశబ్దం, ఆత్మవిశ్వాసం, ఏకాగ్రతలతోనే ఫైనల్‌కు శక్తి మేర సన్నద్ధమయ్యాం. క్రొయేషియా అనుభవం ఉన్న జట్టే. కానీ మేం ఇలాంటి అనుభవం ఉన్నవాటిని చాలా ఎదుర్కొన్నాం. ఆటగాడిగా శారీరక శ్రమ మాత్రమే ఉంటుంది. కోచ్‌గా మానసిక ఒత్తిడిని భరించాల్సి వస్తుంది. 
–ఫ్రాన్స్‌ కోచ్‌ డెచాంప్స్‌   

►ఇటలీ, బ్రెజిల్, జర్మనీ, అర్జెంటీనాలలో ఏ ఒక్క జట్టూ లేకుండా జరుగుతున్న రెండో ఫైనల్‌ ఇది. 2010లో స్పెయిన్‌–నెదర్లాండ్స్‌ మధ్య జరిగిన ఫైనల్‌ మొదటిది. 
►ఫ్రాన్స్‌ కప్‌ గెలిస్తే రెండుసార్లు టైటిల్‌ కొట్టిన మూడో దేశంగా నిలుస్తుంది. ఉరుగ్వే (1930, 50), అర్జెంటీనా (1978, 86) రెండేసి సార్లు కప్‌ అందుకున్నాయి. 
►ఫ్రాన్స్‌ టైటిల్‌ అందుకుంటే కెప్టెన్‌గా, కోచ్‌గా దేశానికి కప్‌ సాధించి పెట్టిన మూడో వ్యక్తిగా డెడర్‌ చాంప్స్‌ రికార్డులకెక్కుతాడు. ఇప్పటి వరకు మారియో జగాలో (బ్రెజిల్‌), ఫ్రాంజ్‌ బెకెన్‌బాయర్‌ (జర్మనీ) మాత్రమే ఈ అరుదైన ఘనత సాధించారు. 
►ఈసారి మొత్తం టోర్నీలో ఒకే ఒక్క మ్యాచ్‌ గోల్స్‌ లేకుండా ముగిసింది. అది గ్రూప్‌ ‘సి’లో ప్రస్తుత ఫైనలిస్టు ఫ్రాన్స్‌... డెన్మార్క్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ కావడం గమనార్హం. 
►1998 కప్‌లో ఫ్రాన్స్‌... అరంగేట్ర క్రొయేషియా సెమీఫైనల్లో తలపడ్డాయి. నాడు లిలియన్‌ థురామ్‌ రెండు గోల్స్‌ కొట్టి ఫ్రాన్స్‌ను గెలిపించాడు. తర్వాత ఫ్రెంచ్‌ జట్టు కప్‌నూ కైవసం చేసుకుంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top