వార్నర్‌ 335 నాటౌట్‌

David Warner Hits 4th Fastest Test Triple Hundred - Sakshi

అజేయ ట్రిపుల్‌ సెంచరీతో అదరగొట్టిన ఆసీస్‌ ఓపెనర్‌

ఆస్ట్రేలియా 589/3 డిక్లేర్డ్‌

స్మిత్‌ 7 వేల పరుగులు పూర్తి

పాకిస్తాన్‌ 96/6  

అడిలైడ్‌: విధ్వంసక ఆటతీరుకు పెట్టింది పేరైన ఆ్రస్టేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (418 బంతుల్లో 335 నాటౌట్‌; 39 ఫోర్లు, సిక్స్‌) పాకిస్తాన్‌పై విశ్వరూపం ప్రదర్శించాడు. తొలి రోజు కనబరిచిన జోరును రెండో రోజూ కొనసాగించి తన కెరీర్‌లో తొలి ‘ట్రిపుల్‌ సెంచరీ’ నమోదు చేశాడు. ఫలితంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న డే అండ్‌ నైట్‌ టెస్టులో ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 302/1తో రెండో రోజు ఆట కొనసాగించిన ఆ్రస్టేలియా 127 ఓవర్లలో 3 వికెట్లకు 589 పరుగులవద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. అనంతరం ఆసీస్‌ బౌలర్లు కూడా విజృంభించడంతో... ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 96 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. మిషెల్‌ స్టార్క్‌ (4/22) నాలుగు వికెట్లు తీయగా... కమిన్స్, హేజల్‌వుడ్‌లకు ఒక్కో వికెట్‌ లభించింది.

బాబర్‌ ఆజమ్‌ (43 బ్యాటింగ్‌; 6 ఫోర్లు), యాసిర్‌ షా (4 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు పాక్‌ ఇంకా 493 పరుగుల దూరంలో ఉంది. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌ వార్నర్, లబ్‌õÙన్‌ (238 బంతుల్లో 162; 22 ఫోర్లు) రెండో రోజు తొలి సెషన్‌లోనూ అలవోకగా పరుగులు చేశారు. షాహిన్‌ అఫ్రిది బౌలింగ్‌లో లబ్‌õÙన్‌ అవుట్‌ కావడంతో వార్నర్‌తో రెండో వికెట్‌కు 361 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. లబ్ షేన్ అవుటైనా... వార్నర్‌ ఏమాత్రం దూకుడు తగ్గించకుండా ఆడాడు. షాహిన్‌ బౌలింగ్‌లో సింగిల్‌ తీసి 260 బంతుల్లో డబుల్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వార్నర్‌ వ్యక్తిగత స్కోరు 226 వద్ద మూసా బౌలింగ్‌లో అవుటైనా అది నోబాల్‌ కావడంతో ఊపిరి పీల్చుకున్నాడు.

మరోవైపు నింపాదిగా ఆడిన స్టీవ్‌ స్మిత్‌ వ్యక్తిగత స్కోరు 22 వద్ద మూసా బౌలింగ్‌లో సింగిల్‌ తీసి తన కెరీర్‌లో 7 వేల పరుగుల మైలురాయిని దాటాడు. ఈ క్రమంలో టెస్టుల్లో వేగవంతంగా 7 వేల పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మన్‌గా స్మిత్‌ (126 ఇన్నింగ్స్‌) రికార్డు నెలకొల్పాడు. 73 ఏళ్లుగా వ్యాలీ హ్యామండ్‌ (ఇంగ్లండ్‌–131 ఇన్నింగ్స్‌; 1946లో) పేరిట చెక్కు చెదరకుండా ఉన్న రికార్డును ఎట్టకేలకు స్మిత్‌ బద్దలు కొట్టాడు. అంతేకాకుండా డాన్‌ బ్రాడ్‌మన్‌ (6,996 పరుగులు)ను కూడా స్మిత్‌ దాటేశాడు.

క్రీజులో నిలదొక్కుకున్న తరుణంలో స్మిత్‌ను షాహిన్‌ అఫ్రిది అవుట్‌ చేశాడు. అనంతరం మాథ్యూ వేడ్‌ (40 బంతుల్లో 38 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌)తో కలిసి వార్నర్‌ పరుగుల వేట కొనసాగించాడు. అబ్బాస్‌ బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టిన వార్నర్‌ 389 బంతుల్లో ట్రిపుల్‌ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత వార్నర్‌ మరింత జోరు పెంచి... టెస్టుల్లో ఆసీస్‌ తరఫున రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించాడు. ఇప్పటివరకు డాన్‌ బ్రాడ్‌మన్‌ (334; ఇంగ్లండ్‌పై 1930లో), మార్క్‌ టేలర్‌ (334 నాటౌట్‌; పాక్‌పై 1998లో) పేరిట ఉన్న ఈ ఘనతను వార్నర్‌ తన సొంతం చేసుకున్నాడు. ఆ వెంటనే ఆసీస్‌ కెపె్టన్‌ టిమ్‌ పైన్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు.

►2 డే అండ్‌ నైట్‌ టెస్టుల్లో అజహర్‌ అలీ (302 నాటౌట్‌; విండీస్‌పై దుబాయ్‌లో 2016లో) తర్వాత ట్రిపుల్‌ సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మన్‌ వార్నర్‌.  

►2 మాథ్యూ హేడెన్‌ (380; జింబాబ్వేపై 2003లో పెర్త్‌లో) తర్వాత ఆసీస్‌ తరఫున టెస్టుల్లో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాట్స్‌మన్‌గా వార్నర్‌ నిలిచాడు.

►7 ఆసీస్‌ తరఫున టెస్టుల్లో ‘ట్రిపుల్‌ సెంచరీ’ చేసిన ఏడో క్రికెటర్‌ వార్నర్‌.

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top