ఆంధ్ర 132 ఆలౌట్‌

Andhra cricket team 132 all out - Sakshi

మధ్యప్రదేశ్‌ 24/3

ఇండోర్‌: మధ్యప్రదేశ్‌తో రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఆంధ్ర తడబడింది. ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’లో సోమవారం మొదలైన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేపట్టిన ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగులకే కుప్పకూలింది. క్రీజులో దిగిన వాళ్లెవరూ 30 పరుగులైనా చేయలేకపోయారు. ఓపెనర్‌ ప్రశాంత్‌ చేసిన 29 పరుగులే ఇన్నింగ్స్‌ టాప్‌ స్కోర్‌. కరణ్‌ శర్మ 23 పరుగులు చేశాడు. మధ్యప్రదేశ్‌ పేసర్లు ఈశ్వర్‌ పాండే (4/43), గౌరవ్‌ యాదవ్‌ (3/21), స్పిన్నర్‌ కార్తికేయ (3/23) ఆంధ్ర బ్యాట్స్‌మెన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన మధ్యప్రదేశ్‌ కూడా ఆదిలోనే తడబడింది. ఓపెనర్లు ఆర్యమాన్‌ బిర్లా (3), అజయ్‌ రొహెరా (1)లతో పాటు కార్తికేయ (0) కూడా ఔట్‌ కావడంతో ఆట నిలిచే సమయానికి 13 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది. ఆంధ్ర బౌలర్లలో విజయ్, గిరినాథ్, మనీశ్‌ తలా ఒక వికెట్‌ తీశారు.  

త్రిపుర 35... 
రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో త్రిపుర పేకమేడలా 35 పరుగులకే కూలింది. ఇందులో ఆరుగురు బ్యాట్స్‌మెన్‌ కౌశల్‌ (0), బోస్‌ (0), మురాసింగ్‌ (0), రాజిబ్‌ (0), హర్మీత్‌ (0), సౌరభ్‌ (0) డకౌట్‌ కాగా, నీలంబుజ్‌వత్స్‌ (11) రెండంకెల స్కోరు చేశాడు. లేదంటే ఇదే రాజస్తాన్‌ చేతిలో ‘హైదరాబాద్‌ 21 ఆలౌట్‌’ చెత్త రికార్డును త్రిపుర చెరిపేసేది. రాజస్తాన్‌ బౌలర్లలో అనికేత్‌ చౌదరి 5, తన్వీరుల్‌ హక్‌ 1 పరుగుకే 3 వికెట్లు తీశారు. తర్వాత రాజస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగుల వద్ద ఆలౌటైంది. మురాసింగ్‌కు 4 వికెట్లు దక్కాయి. మొత్తానికి తొలిరోజే 20 వికెట్లు పడ్డాయి. 

జాఫర్‌ రికార్డు... 
రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లాడిన ఆటగాడిగా వసీమ్‌ జాఫర్‌ (విదర్భ) రికార్డులకెక్కాడు. తాజాగా సౌరాష్ట్ర, విదర్భ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ అతని రంజీ కెరీర్‌లో 146వ మ్యాచ్‌. దీంతో గతంలో దేవేంద్ర బుండేలా ఆడిన 145 మ్యాచ్‌ల రికార్డు కనుమరుగైంది. 146 మ్యాచ్‌ల్లో జాఫర్‌ 11,403 పరుగులు చేశాడు. ఇందులో 39 సెంచరీలు, 84 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఈ చురుకైన ఫీల్డర్‌ 191 క్యాచ్‌లు కూడా అందుకున్నాడు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top