
నెల్లూరు(బారకాసు): ప్రధాని నరేంద్రమోదీని కలిసి సంతోషాన్ని వ్యక్తం చేసి తిరిగి అమరావతిలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఏపీ విభజన చట్టంలో పొందుపర్చిన హామీలను కేంద్రం అమలు చేయడం లేదని.. ఈ విషయమై సుప్రీంకోర్టుకు వెళ్తానని సీఎం చంద్రబాబు పేర్కొనడం రెండు నాల్కల ధోరణిని అవలంబించడమేనని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి ఆరోపించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అధికార పార్టీ నేతల తప్పులు, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ, కేంద్రంపై నిందలు మోపుతున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్టను దిగజార్చేందుకు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని, ఇది తగదని హితవు పలికారు.
ఏపీ అభివృద్ధికి కేంద్రం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామనే విషయం ఎక్కడా లేదని, రాష్ట్రాభివృద్ధికి అవసరమైన నిధులను ప్రత్యేక ప్యాకేజీ ద్వారా మాత్రమే కేంద్రం ఇస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధికి రూ.22 వేల కోట్లను ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని, ఇప్పటికే రూ.ఏడు వేల కోట్లను ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులపై కేంద్రానికి స్పష్టమైన నివేదికలివ్వకుండా కేంద్రం నిధులను మంజూరు చేయడంలేదని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నేరాలు తగ్గాలి, శిక్షలు పెరగాలని కలెక్టర్ల సదస్సులో సీఎం చెప్పారని, అయితే రాష్ట్రంలో ఎక్కడ చూసినా కుంభకోణాలు, అవినీతి, అక్రమాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మిడతల రమేష్, నాయకులు కరణం భాస్కర్, కోసూరు భాస్కర్‌గౌడ్, మొద్దు శ్రీను, ముడియాల శ్రీనివాసులురెడ్డి, తదితరులు పాల్గొన్నారు.