
సాక్షి, పశ్చిమ గోదావరి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వ తీరుతో మోసపోయిన పశ్చిమ ప్రజలంతా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పాదయాత్రలో కలిసి తమ సమస్యలు చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మే 13న(ఆదివారం) సాయంత్రం పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుందని తెలిపారు.
‘మే 14న వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర ఏలూరు సమీపంలో వెంకటాపురం వద్ద 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంటుంది. ఈ సందర్భంగా అక్కడ 40 అడుగుల పైలాన్‌ను వైఎస్ జగన్ ఆవిష్కరిస్తారు. 14వ తేదీ సాయంత్రం ఏలూరు పాతబస్టాండ్ సెంటర్‌లో భారీ బహిరంగ సభ ఉంటుంది. పశ్చిమలో 13 నియోజకవర్గాల్లో దాదాపుగా 250 కిలోమీటర్ల మేర వైఎస్ జగన్ పాదయాత్ర ఉంటుంది.బీమవరానికి చెందిన గాదిరాజు సుబ్బరాజు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరుతారు’ అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.