
అనపర్తి: ప్రజల సమస్యలను, కష్టనష్టాలను తెలుసుకునేందుకై ప్రజా సంకల్ప పాదయాత్ర పేరుతో అడుగులు వేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తోడుగా ప్రజలు అనుసరిస్తున్నారని వెఎస్సార్‌సీపీ ఉభయగోదావరి జిల్లాల రీజినల్ కోర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యాలయం ప్రారంభోత్సవానికి అనపర్తి విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ప్రవేశించిన జగన్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఇప్పటికే నాలుగు నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి చేసుకుందని తెలిపారు.
జిల్లాలో పాదయాత్ర పూర్తయ్యేనాటికి అన్ని నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం అవుతుందన్నారు. ఆది నుంచీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకోసం పోరాడుతున్నది ఒక్క వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటం, విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు కర్మాగారం పోర్టు నిర్మాణం, లోటు బడ్జెట్‌కు నిధులు అందించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా గత నాలుగేళ్లుగా వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తోందన్నారు.
కేపీఆర్‌తో సంబంధం లేదు...
కేపీఆర్ పరిశ్రమల్లో తనకు ఎటువంటి వ్యాపార భాగస్వామ్యం లేదని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని రంగంపేట మండలానికి చెందిన కొందరు పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీకి ఓటు వేస్తే కేపీఆర్ పరిశ్రమ ఏర్పాటుకు మద్దతును ఇచ్చినట్లే అన్న ప్రచారం తమ మండలంలో జరుగుతున్న విషయాన్ని వైవీ సుబ్బారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ కేపీఆర్ పరిశ్రమల్లో తనకు ఎటువంటి వాటాలు లేవని, ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ పరిశ్రమల్లోను తనకు ఎటువంటి వాటాలు లేవని, తనపై ఆరోపణలు చేసిన వ్యక్తులే దానిని రుజువుచేస్తే నా వాటాను ఉచితంగా వారికే రాసి ఇస్తానన్నారు.