25 మంది ఎంపీలను ఇవ్వండి హోదా తీసుకొస్తా

YS Jaganmohan Reddy comments at Machilipatnam - Sakshi

మచిలీపట్నం సభలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ పిలుపు

వైఎస్సార్‌సీపీని గెలిపించి.. ఢిల్లీని శాసించే బలం ఇవ్వండి 

పొత్తుల ప్రచారం నమ్మకండి..  అందరినీ నమ్మి నమ్మి అలసిపోయాం.. ఇక చాలు 

నాలుగేళ్లుగా కేంద్రంతో కలసి ఉండి హోదా తేకుండా బాబు మోసం చేశాడు 

తన స్వార్థం కోసం ఇక్కడ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాడు.. 

మనందరి ప్రభుత్వం రాగానే 4,800 ఎకరాల్లోనే బందరు పోర్టును కడతాం 

రాష్ట్రంలో 1.50 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని జననేత హామీ 

నాన్నగారు మచిలీపట్నంలో పోర్టుకు శంకుస్థాపన చేసి గొప్ప పని చేశారు. ఇందుకు 4,800 ఎకరాలు అవసరమవుతాయని భావించారు. కానీ ఆరోజు ఇక్కడున్న టీడీపీ నేతలు, చంద్రబాబు.. అందుకు అభ్యంతరం తెలిపారు. 4,800 ఎకరాల భూమి పోర్టుకు చాలా ఎక్కువ అని, 1,800 ఎకరాలు సరిపోతుందని వారంతా గొడవ చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక 4,800 ఎకరాల్లో బంగారం లాంటి పోర్టు నిర్మించాల్సింది పోయి, అవసరం లేకున్నా.. ఎవరితోనూ చర్చించకుండా.. రాత్రికి రాత్రే బందరు పట్టణం పక్కనే పోర్టు, దానికి ఆనుకుని 33 వేల ఎకరాలకు నోటిఫికేషన్‌ను జారీ చేశారు. చీకట్లో దొంగల మాదిరిగా నోటిఫికేషన్‌ పత్రాలను గ్రామాల్లో వెదజల్లి పోయారు.      
– వైఎస్‌ జగన్‌

మచిలీపట్నం ప్రజాసంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘నాలుగేళ్లుగా కేంద్రంతో కలిసి ఉండి కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాకుండా చంద్రబాబు మోసం చేశాడు.. అందరినీ నమ్మి నమ్మి అలసిపోయాం.. ఇక చాలు.. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీని గెలిపించడంతో పాటు ఢిల్లీని శాసించే బలం ఇవ్వండి.. 25 మందికి 25 మంది ఎంపీలను ఇవ్వండి.. ప్రత్యేక హోదా తీసుకొస్తా.. పొత్తుల ప్రచారం నమ్మొద్దు’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 150వ రోజు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బాబు తీరు వల్లే ఇవాళ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదని మండిపడ్డారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

 ఈ దుస్థితికి కారణం ఎవరు? 
‘‘ఎన్నికలప్పుడు హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ పనైపోయాక మాట నిలుపుకోలేదు. రాష్ట్రాన్ని విడగొట్టాకండని మొత్తుకున్నా కాంగ్రెస్‌ వినిపించుకోలేదు. ఇవాళ రాష్ట్రం దారుణ స్థితిలో ఉండడానికి కారణం కాంగ్రెస్‌ కాదా? ఈ పెద్దమనిషి చంద్రబాబు తెలంగాణకు వెళ్లి.. తన వల్లే తెలంగాణ వచ్చిందని చెబుతాడు. ఇక్కడ తన స్వార్థం కోసం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాడు. చంద్రబాబే దగ్గరుండి మరీ రాష్ట్రాన్ని విడగొట్టారు. హోదా రాకుండా చేయాల్సిందంతా చేసి డ్రామాలాడుతున్నారు. అందరినీ నమ్మి మోసపోయింది చాలు. 25 మంది ఎంపీలను ఏకతాటిపై మాకిస్తే.. ప్రత్యేక హోదా ఎవరు ఇస్తామని చెబుతారో.. ఆ మేరకు ఎవరైతే సంతకం చేస్తారో వారికే మద్దతు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్ల రాష్ట్రంలో చదువుకున్న ప్రతి ఒక్కరూ ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. హోదా వస్తే ఇన్‌కంటాక్స్, జీఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు. వాటిని కట్టాల్సిన అవసరం లేకపోతే పరిశ్రమలు నెలకొల్పేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తారు. పరిశ్రమలు వస్తే లక్షల్లో ఉద్యోగాలు వస్తాయి.
 
నాన్నగారి స్వప్నం సాకారం చేస్తాం 
టీడీపీ ప్రభుత్వం చెబుతున్నట్లుగా 33 వేల ఎకరాల్లో కాకుండా నాన్నగారు వైఎస్‌ రాజశేఖరరెడ్డి తొలుత రూపకల్పన చేసిన విధంగా 4,800 ఎకరాలను మాత్రమే రైతుల నుంచి తీసుకుని బందరు పోర్టును కడతాం. 1,870లోనే బందరులో 36 వేల మంది ప్రజలు నివాసం ఉండే వారు. అలాంటి బందరులో నేడు పేదరికం తాండవిస్తూ ఉంది. ఇవాళ ఇక్కడ ఉద్యోగాలు లేక, ఉపాధి లభించక ప్రజలు వలస పోతున్నారు. 2001, 2011 జనాభా లెక్కల ప్రకారం వ్యత్యాసం చూస్తే బందరు పట్టణంలో దాదాపుగా పది వేల ఓట్లు తగ్గాయంటే ప్రజలు ఏ స్థాయిలో వలస పోతున్నారో అర్థమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నాన్నగారు బందరు కోసం ఒక స్వప్నాన్ని చూశారు. ఈ పట్టణాన్ని బాగు చేయాలి.. ఇక్కడి ప్రజలు బాగు పడాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇమిటేషన్‌ జువెలరీ పార్కును నెలకొల్పారు.

రోల్డ్‌గోల్డ్‌ ఆభరణాల తయారీ రంగంపై ఆధారపడి జీవిస్తున్న సుమారు 50 వేల మందికి మేలు జరగాలని చెప్పి ఆ రోజుల్లోనే 42 ఎకరాల్లో ఇమిటేషన్‌ పార్కును స్థాపించి మేలు చేయాలని చూశారు. పోతేపల్లిలో పెట్టిన ఆ ఇమిటేషన్‌ పార్కుకు నాన్నగారి హయాంలో కరెంటు ఒక యూనిట్‌కు రూ.3.75 ఉంటే ఇపుడు నాలుగేళ్లుగా చంద్రబాబు పాలనలో అది రూ.8.75కు పెరిగింది. ఇలాగైతే ఎలా ఉద్యోగాలు వస్తాయి? వాటిపై ఆధారపడిన వారు ఎలా బతుకుతారు? ఆ పార్కుకు లక్ష లీటర్ల నీరు కావాల్సి ఉంటే ఇపుడు 20 వేల లీటర్లు కూడా ఇవ్వకుండా చంద్రబాబు వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. పోర్టు నిర్మాణానికి 33 వేల ఎకరాలు ఎందుకు? 4,800 ఎకరాలే చాలా ఎక్కువ అని రైతులు చెబుతున్నారు. చంద్రబాబు మాత్రం పోలీసులను ఉపయోగించి పశుబలంతో రైతులను అణగదొక్కే కార్యక్రమం చేశారు. రెండు సార్లు నేను ఆ రైతులకు ప్రతిపక్ష నేతగా తోడు నిలబడ్డానికి బందరుకు రావాల్సి వచ్చింది. పాలకుడనే వాడికి మానవత్వం ఉండాలి. తాను చేసే అభివృద్ధి వల్ల మేలు జరగాలి. అభివృద్ధికి ఎన్ని ఎకరాల భూమి అవసరమో అంతే తీసుకోవాలి. ఉన్న రేటుకన్నా భూమికి రెండు రూపాయలు ఎక్కువే ఇచ్చి తీసుకోవాలి. కానీ చంద్రబాబు ఆ దిశగా అడుగులు వేయడం లేదు.  

వ్యవస్థలను నాశనం చేస్తున్నారు.. 
మచిలీపట్నం నియోజకవర్గంలో అడుగు పెట్టగానే చాలా మంది రైతన్నలు నాదగ్గరకు వచ్చి ప్రకాశం బ్యారేజీ నుంచి బందరు దాకా రావాల్సిన నీళ్లు రావడం లేదని చెప్పారు. మీ నాన్న ఉన్నపుడు రెండు పంటలకూ నీరు వచ్చేది అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక వరుసగా నాలుగో ఏడాదీ రబీ పంటకు నీళ్లు రావడం లేదని వాపోయారు.  వరి వేసుకుంటే గిట్టుబాటు ధర లేదు. మినుము పండిస్తే కొనే నాధుడు కూడా లేడని రైతులు వాపోతున్నారు. కొందరు అక్క చెల్లెమ్మలు నా వద్దకు వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేటపుడు నాలుగు సంతకాలు పెట్టాడన్నా.. అప్పుడు పెద్ద బిల్డప్‌ ఇచ్చాడన్నా అన్నారు. ఆ నాలుగు సంతకాల్లో బెల్ట్‌ షాపుల రద్దు ఒకటి. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో బెల్ట్‌ షాపులు అడ్డుకోవాల్సిన ఇక్కడి.. ఆనాటి ఎక్సైజ్‌ మంత్రే సాక్షాత్తూ గ్రామాల్లో బెల్ట్‌ షాపులకు వేలం వేయించారని వాపోయారు. వ్యవస్థలను కాపాడాల్సిన వారే వాటిని ఖూనీ చేస్తూ దగ్గరుండి ప్రజల చేత తాగిస్తూ ఆదాయాలు వెతుక్కుంటుంటే ఏం చెప్పాలి? పింఛన్, రేషన్‌ కార్డు కావాలని దరఖాస్తు చేసుకుంటే లంచాలు ఇవ్వనిదే జన్మభూమి కమిటీ సభ్యులు మంజూరు చేయని పరిస్థితి నెలకొంది.   

శ్మశానాలు, టాయిలెట్లు కూడా కబ్జా  
అక్క చెల్లెళ్ల బాధ అలా ఉంటే కొంత మంది అన్నదమ్ములు నావద్దకు వచ్చి... అన్నా మా నియోజకవర్గంలో నాయకులకు, మంత్రులకు భూ కబ్జాలు చేయడంలో పట్టాలు ఇవ్వవచ్చన్నా.. అన్నారు. పార్కులు, శ్మశానాలను, బహిరంగ టాయిలెట్లను కూడా వదలకుండా అన్నింటినీ ఆక్రమించుకుంటున్నారని చెప్పారు. గతంలో కేటాయించిన స్థలాలన్నీ కూడా వీళ్లు ఆక్రమించుకుని అమ్ముకుంటుంటే.. నిజంగా ఇంకా వ్యవస్థలున్నాయా? అని ప్రశ్నిస్తున్నారు. బైపాస్‌ రోడ్డు శ్మశానం, దేశాయిపేట బహిరంగ టాయిలెట్ల స్థలం, బందరు కోట శ్మశానం, కబేళా స్థలం, విశ్వ బ్రాహ్మణ కాలనీ పార్కు ఏదీ వదలకుండా దగ్గరుండి మంత్రులుగా ఉన్న వ్యక్తులు ఆక్రమించుకుంటూ స్థలాలను అమ్ముకుంటున్నారని బాధపడ్డారు.

వారు ఇలా చెబుతుంటే నాకు నిజంగా బాధ కలిగింది. ఈ నియోజకవర్గంలో భూకబ్జాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయంటే.. నిన్న నావద్దకు శివలీలమ్మ అనే పెద్దామె వచ్చింది. ఆమె ఎన్టీ రామారావు మొదటి భార్య బసవతారకం గారి బంధువు. ఆమె ఈ బందరులోనే నివాసం ఉంటుందట. ఆమెకు చెందిన భూముల అమ్మకాలు, కొనుగోలు విషయంలో తగాదాలు వచ్చాయట. తక్కువ రేటుకు కొనుగోలు చేయాలని కొందరు ప్రయత్నిస్తుంటే ఆమె అంగీకరించనందుకు పోలీసులు వాళ్ల వాళ్లను తీసుకెళ్లి నాలుగు రోజుల పాటు పోలీసు స్టేషన్లు, లాడ్జీలు, వేరే ఇళ్లలోనూ పెట్టి వేధించారని వాపోయారు. తన కుమారుడిని, భార్యను, పిల్లలను తీసుకెళ్లి పోలీసు స్టేషన్‌లో నాలుగు రోజులుగా పెట్టారట. పొద్దున పూట స్టేషన్‌కు తీసుకెళ్లి రాత్రి పూట ఒక ఇంటికి మారుస్తారు. మళ్లీ తెల్లవారాక స్టేషన్‌కు తీసుకు వస్తారు. మళ్లీ రాత్రికి వారి చేతనే హోటళ్లలో రూం బుక్‌ చేయించి అక్కడ పెట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఆడవాళ్లు అని కూడా చూడకుండా పోలీసులే వేధిస్తున్నారని బసవతారకం గారి బంధువే చెబుతుంటే పోలీసులు, మంత్రులు, ఎంపీలు ఏ స్థాయిలో ఉన్నారు?

పేదల ఇళ్ల నిర్మాణంలోనూ కుంభకోణం 
నాన్నగారి హయాంలో ప్రతి పేద వాడికీ ఇల్లు వచ్చే పరిస్థితి ఉండేది. ఈ నాలుగేళ్లుగా చంద్రబాబు ఒక్క ఇల్లు అయినా కట్టాడా? కొత్తగా వచ్చిన బెల్‌ కంపెనీని ఇక్కడి నుంచి మార్చేసి ఆ స్థలాన్ని చంద్రబాబు ప్రభుత్వం పెద్ద కుంభకోణంగా చేయబోతోంది. ఆ స్థలంలో పేదవారికి ఇళ్లు కట్టిస్తామని చెప్పి కొత్త కథ చెబుతున్నారు. ఒక్కొక్కరికి 300 అడుగుల ఫ్లాటును పేద వాడికి అడుగుకు రూ.2 వేలు చొప్పున రూ.6లక్షలకు అమ్ముతారట. లిఫ్టు, గ్రానైట్, మార్బుల్‌ ఫ్లోరింగ్‌ లేని భవనంలో చెక్క సామగ్రి ఏమీ లేకుండా అడుగు ధర ఎంత ఉంటుందని ఏ బిల్డర్‌ను అడిగినా రూ.1000 మించదని చెబుతున్నారు. ఆ ప్రకారం రూ.3 లక్షలకే ఫ్లాటు మీ చేతికి రావాలి. కానీ చంద్రబాబు  అడుగు 2 వేలు చొప్పున 300 అడుగుల ఫ్లాటును రూ.6 లక్షలకు అమ్మే కార్యక్రమం చేస్తున్నాడు. ఈ ఆరు లక్షల్లో 1.5 లక్షలు కేంద్రం, 1.5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇదీ బాగానే ఉంది. ఇక మిగిలిన రూ 3 లక్షలు ఆ పేదవాడి తరఫున అప్పుగా రాసుకుంటారట. ఆ పేదవాడు 20 ఏళ్ల పాటు నెలకు రూ.3 వేలు చొప్పున బ్యాంకులకు చెల్లించాలట. లంచాలు చంద్రబాబు తింటే.. పేదవాడు మాత్రం నెల నెలా రూ.3 వేలు బ్యాంకులకు కట్టుకుంటూ పోవాలట. ఇదెంత దారుణం? రేపు మనందరి ప్రభుత్వం రాగానే ప్రతి పేదవాడికీ రూపాయి ఖర్చు లేకుండా ఇల్లు కట్టిస్తాను. ఆ ఇంటిని అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్టర్‌ కూడా చేసిస్తాం. ఎపుడైనా డబ్బు అవసరమైతే ఆ ఇంటిని కుదువ పెట్టి పావలా వడ్డీకే రుణం వచ్చేలా  చేస్తాం.  

ఇలాంటి నాయకుడు అవసరమా? 
నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో రైతులకు గిట్టుబాటు ధర లేదు. ఆయన ఇచ్చిన హామీ మేరకు పంట రుణాలు, డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం సరిగా అమలు చేయలేదు. ఆరోగ్యశ్రీ పూర్తిగా పడకేసింది. అవినీతి, మోసం, అరాచకం, అధర్మ పాలన కొనసాగుతోంది. ఇంతగా అధర్మ పాలన సాగిస్తూ ధర్మపోరాటం పేరుతో తిరుపతిలో సభ నిర్వహించడమా? ఇలాంటి చంద్రబాబును ఇక పొరపాటున కూడా క్షమించకండి. ప్రతి ఇంటికి కేజీ బంగారంతో పాటు బోనస్‌గా బెంజి కారు ఇస్తానంటాడు. అది మీరు నమ్మరని తన మనుషులను పంపించి రూ.3 వేలు చేతిలో పెడతాడు. రూ.5 వేలు కావాలని గుంజండి. అదంతా మన డబ్బే. మన జేబులోంచి దోచుకున్న సొమ్మే. మీ మనస్సాక్షి ప్రకారం ఓట్లేయండి. ఈ వ్యవస్థను మార్చడం జగన్‌ ఒక్కడి వల్లే కాదు. మీ అందరి తోడు, మద్దతు, ఆశీర్వాదం కావాలి’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.   

మనందరి ప్రభుత్వం రాగానే ఇలా చేస్తాం.. 
- కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా అసెంబ్లీ మొదటి సమావేశంలోనే చట్టం తెస్తాం.  
ఉద్యోగులకు సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తాం. 
రాష్ట్రం విడిపోయినప్పుడు 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని లెక్కలు కట్టారు. నాలుగేళ్లలో ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన పాపాన పోలేదు. అధకారంలోకి వచ్చిన వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తాం. ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్న 10 మంది నిరుద్యోగులకు అందులో ఉద్యోగాలు ఇచ్చి గ్రామ పాలన కొనసాగిస్తాం. ఒక్కో గ్రామ సచివాలయంలో స్థానికంగా ఉన్న వారికి 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే రాష్ట్ర వ్యాప్తంగా 1.50 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు అవుతుంది. 
కులం, మతం, పార్టీలు చూడకుండా అర్హులైన వారు పెన్షన్, రేషన్‌ కార్డు, మరుగుదొడ్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లో మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటాం. 

జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం 
సాక్షి, అమరావతి బ్యూరో/రాప్తాడు:   అశోక్, స్రవంతి దంపతులకు ఆదిత్య, అలేఖ్య ఇద్దరు సంతానం. వీరిది అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం కందుకూరు గ్రామం. పెద్ద కుమారుడు ఆదిత్య చిన్నప్పటి నుంచి వినికిడి లోపంతో బాధపడుతున్నాడు. మాటలు కూడా రావు. ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందలేదు. ఆరేళ్లు గడిచాయి. ఆపరేషన్‌ చేయించాలంటే రూ.9 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పడంతో కూలీ పని చేసే ఆ దంపతులకు గుండె ఆగినంత పనైంది. ఈ నేపథ్యంలో ప్రజా సంకల్ప యాత్ర ద్వారా గత ఏడాది డిసెంబర్‌లో కందుకూరుకు వచ్చిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ను రాప్తాడు పార్టీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ద్వారా కలిశారు. వెంటనే స్పందించిన జగన్‌.. చిన్నారికి కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్‌ చేయించేందుకు ఏర్పాట్లు చేయాలని తన చిన్నాన్న కుమారుడు వైఎస్‌ కొండారెడ్డిని ఆదేశించారు. ఆయన ఆ మరుసటి రోజే చిన్నారిని హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు.  ఏప్రిల్‌ 6న  రూ.9 లక్షల ఖర్చుతో ఆపరేషన్‌ విజయవంతమైంది. ప్రస్తుతం చిన్నారికి మాటలు వినిపిస్తున్నాయి. మాటలు వచ్చేందుకు ఫిజియోథెరపీ చేస్తున్నారు. దీంతో చిన్నారి ఆదిత్య, తండ్రి అశోక్‌.. కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు.  జీవితాంతం రుణపడి ఉంటామన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top