విశాఖకు మెట్రో రైలు.. సైన్స్‌ సిటీ కనిపించాయా: వైఎస్‌ జగన్‌

YS Jagan Slams AP CM Chandrababu Naidu At Kanchara Palem - Sakshi

జనసంద్రమైన విశాఖ నగరం

సాక్షి, కంచెరపాలెం (విశాఖ): ‘సీఎం చంద్రబాబు విశాఖ నగరానికి రైల్వే జోన్‌ తీసుకొస్తా అన్నారు. తెచ్చారా?  గిరిజన యూనివర్సిటీ అని హామీ ఇచ్చారు. ఎక్కడైనా కనిపిస్తుందా ? ఐటీ సిగ్నేచర్‌ టవర్స్‌ అని గ్రాఫిక్స్‌తో మనందరికి సినిమా చూపించారు. ఎక్కడైన కనిపించాయా?. విశాఖకు మెట్రోరైలంటా... సైన్స్‌ సిటీ అంటా కనిపించాయా’  అని ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విశాఖ ప్రజలను ప్రశ్నించారు. 258వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కంచెరపాలెంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అశేష జనవాహిని ఉద్దేశించిన ఆయన ప్రసంగించారు. ఇంకా ఈ సభలో వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..

వైఎస్‌ హయాంలో టాప్‌ గేర్‌లో అభివృద్ధి..
‘పాదయాత్ర సందర్భంగా నగరంలో నడుస్తున్నప్పుడు నా దగ్గరికి వచ్చిన ప్రజలు నాతో అన్న మాట .. ఆ దివంగతనేత రాజశేఖర్‌ రెడ్డి అందరికి గుర్తున్నారన్నా.. ఈ విశాఖనగర అభివృ‍ద్ధిని టాప్‌ గేర్లో నడిపించారన్నా.. ఆయన హయాంలో చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయన్నా.. ఐటీ వచ్చిందన్నా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిందన్నా అని నాకు గుర్తు చేశారు.  ఆ మహానేత రాజశేఖర్‌ రెడ్డి హయాంలోనే అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ తీసుకొచ్చారని, రూ. 1500 కోట్లతో ఈ నగరంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారన్నారు. ర్యాపిడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్స్‌ కోసం రెండు బీఆర్‌టీఎస్‌ రోడ్లకు అప్పట్లోనే రూ. 450 కోట్లు ఖర్చు చేశారని, కంచెరపాలెం నుంచి పెందూర్తి వరకు రోడ్లను ఆరునెలల్లో నిర్మించిన ఘనత వైఎస్సార్‌దేనన్నా అని చెప్పారు. ఆ రోడ్లలో 1.3 కిలోమీటర్ల రోడ్డు మాత్రమే మిగిలిపోయిందని, ఇప్పటికి అది ఇంకా పూర్తి కాలేదన్నా అని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత నేత వైఎస్సార్‌ హయాంలో 14 చోట్ల 14 కాలనీలు వచ్చాయని, 35వేల ఇళ్లు కట్టించారన్నా అని చెప్పారు. ఆయన మరణానంతరం వచ్చిన ఈ చంద్రబాబు పాలనలో నగర అభివృద్ధి మళ్లీ రివర్స్‌ గేర్‌లో నడుస్తుందన్నా అని బాధపడ్డారు. 

విశాఖ ఉక్కు ఆయన చలవే..
విశాఖ ఉక్కు కష్టాల్లో ఉంటే ఆ దివంగత నేత కేంద్రంతో పోరాడి నిలబెట్టారన్నా అని, ఈ రోజు రెట్టింపు కెపాసిటీతో పనిచేస్తుందంటే దానికి వైఎస్‌ చలువేనని చెప్తున్నారు. ఇవన్నీ మరిచిపోలేని విషయాలన్నా అని ఆయన పాలనను గుర్తు చేశారు. మూతపడ్డ బీహెచ్‌బీల్‌ను బీహెచ్‌ఎల్‌లో వీలినం చేసి వందల కుటుంబాలను రోడ్డున పడకుండా చేశాడన్నా అని చెబుతున్నారు. విశాఖలో ఐటీకారిడర్‌, బ్రాండిక్స్‌ నుంచి ఏసీ జెడ్‌లలో పరిశ్రమలు, వేల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చాయంటే ఆ ప్రియతమ నేత చూపిన చలువేనని చెప్పుకొచ్చారు. విశాఖ ఎయిర్‌ పోర్ట్‌లో వర్షం వస్తే విమానాలు ఎగురుతాయా అని అనుమానం ఉండేదని, వైఎస్సార్‌ ఆ ఎయిర్‌పోర్ట్‌ను కాపాడారని చెప్పారు. వంద కోట్లతో టర్మినల్‌ నిర్మించి.. ప్రస్తుత ఎయిర్‌ పోర్ట్‌ను అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌గా తీర్చిదిద్దారని ఇక్కడి ప్రజలు నాతో చెప్పారు. చంద్రబాబు పాలనను చూపిస్తూ.. ఎన్నికల్లోనే కాదన్నా ముఖ్యమంత్రిగా బాధ్యతలుగా చేపట్టిన తరువాత ఇచ్చిన హామీలకు కూడా దిక్కులేదని ఆవేదన చెందారు. 

అప్పుడు రైల్వే జోన్‌ గుర్తుకు రాలే..
విశాఖకు రైల్వేజోన్‌ అని ఊదరగొట్టారు. కేంద్రంలో బీజేపీతో నాలుగున్నరేళ్లు సంసారం చేస్తాడు. అప్పుడు ఈ రైల్వేజోన్‌ గుర్తుకురాలేదు. తొలి భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు మొదటి భార్య చెడ్డది అయింది. ఇప్పుడెలా చెడ్డదయిందో చెప్పాలని అడుగుతున్నా.. ఈ ప్రాంతానికి గిరిజన యూనివర్సిటీ అని హామీ ఇచ్చారు. ఎక్కడైనా కనిపిస్తుందా అని అడుగుతున్నా? ఐటీ సిగ్నేచర్‌ టవర్స్‌ అని గ్రాఫిక్స్‌తో మనందరికి సినిమా చూపించారు. . ఎక్కడైన కనిపించాయా?. విశాకు మెట్రోరైలంటా.. సైన్స్‌ సిటీ అంటా కనిపించాయా? మరో డిపోర్డర్‌ బోర్డ్‌ కడతాడంటా.. ఉన్నదాంట్లోనే ఉద్యోగాలు పోతున్నాయి. మరోకటి కడతాననడం విడ్డూరంగా ఉంది. సుముద్ర తీరం నుంచి రహదారన్నాడు.. కనిపించిందా..? సబ్బవరంలో భారీ పరిశ్రమ అంట కనిపించిందా? విశాఖ పట్టణంలో కూచుపుడి కళాక్షేత్రం ఎక్కైడన కనిపించిందా.. విశాఖ నగరానికి స్పోర్ట్స్‌ యూనివర్సిటీ అంటా కనిపించిందా? అని అడుగుతున్నా?. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ఇచ్చిన హామీలకు దిక్కుదివాన లేని పరిస్థితుల్లో ఈ మాటలు ఉన్నాయి. 

చంద్రబాబు చేసిందేంటో తెలుసా..
ఈ నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనలో మనం చూసిందేంటో తెలుసా? ఎక్కడైనా భూమిని చూస్తే దోచేయడం కనిపించింది. ఈ నాలుగున్నరేళ్లలో.. ఏ స్థాయిలో ఉందంటే.. పేదలకోసం ఆ దివంగత నేత వైఎస్సార్‌.. రాజీవ్‌ గృహాల కోసం కేటాయించిన భూములను లాక్కోని గీతం యూనివర్సిటీ, తన బినామీ ఎంవీవీస్‌ మూర్తిలకు కట్టబెట్టారు. రాష్ట్రంలో విశాఖతో సహా ఎక్కడైన విలువైన భూములు కనిపిస్తే వెంటనే క్యాబినేట్‌ సమావేశం పెడుతారు. అక్కడ పేదలు, రైతుల గురించి చర్చలు జరగవు. వారి బినామీలకు శనక్కాయలకు, బిస్కెట్లకు ఎలా కట్టబెట్టాలనే చర్చ జరుగుతోంది. లూలూ గ్రూప్‌కు విశాఖ నగరంలోని 9.12 ఎకరాలను దాదాపు వేల కోట్లు పలికే ఈ భూమిని దారాదత్తం చేశారు. 100ల కోట్లు విలువ చేసే భూములను అప్పనంగా కట్టిపెట్టారు. విశాఖలో ఏకంగా 1200 కోట్లు విలువ చేసే భూములను శనక్కాయలకు బిస్కెట్లకు కట్టబెట్టాడు. భూరికార్డులను మార్చేస్తారు. తమది కానీ ప్రభుత్వ భూములను తమ పేర్లతోనే పత్రాలను సృష్టించి ఆ పేపర్లను బ్యాంకుల్లో పెట్టి డబ్బులు తెచ్చుకుంటారు. అలా తెచ్చుకున్న మంత్రి ఎవరో చెప్పాల్సిన పని లేదు కదా.. ఆ మంత్రిని గంటా అంటారు. విశాఖ పట్టణంలో భోగాపురం ఎయిర్‌ పోర్ట్‌ కడతామంటారు. అక్కడ పక్కనే ఉన్న అయ్యన్నపాత్రుడి భూములు ముట్టుకోరు. టీడీపీ నేత భూములు ముట్టుకోరు కానీ పేదల భూములు మాత్రం లాక్కొంటారు.

40 లక్షల ఉద్యోగాలంటా వచ్చాయా?
విశాఖలో భాగస్వాముల సదస్సులు పెట్టి, 20 లక్షల కోట్ల పెట్టుబడులొచ్చాయని, 20 లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు. మీకేమైనా వచ్చాయా అని అడుగుతున్నా?  ఎన్ని వచ్చాయో​ తెలుసుకోవాలంటే.. కేంద్ర ప్రభుత్వం డిప్‌ చెబుతోంది. ఏ రాష్ట్రం అయిన పరిశ్రమలు పెట్టాలంటే దానిని సంప్రదించాల్సిందే. లేకుంటే ఏ బ్యాంక్‌ లోన్స్‌ ఇవ్వవు.  ఏ అనుమతులు కావాలన్నా ఇక్కడ దరఖాస్తు చేసుకోవాల్సిందే. వాళ్లు డిక్లెర్‌ చేసిన ప్రకారం ఏడాదికి రూ. 5వేల కోట్ల పెట్టు బడులు కూడా రాలేదు. మొత్తం రూ. 80 వేల కోట్ల పెట్టుబడులు కూడా రాలేదు. ఈయన మాత్రం 20 లక్షల కోట్ల పెట్టుబడులొచ్చాయని మనందరి చెవులో పూలు పెడ్తున్నారు. విశాఖ పట్టణంలో మూడు రోజులు మీటింగ్‌లు పెట్టి అక్షరాల రూ. 150 కోట్లు ఖర్చు చేశారు. మూడు రోజుల తిండి కోసం పెట్టిన బిల్లు ఎంత తెలుసా.. 53 కోట్లు. ఏ స్థాయిలో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారో అర్థం అవుతుంది కదా?

కంప్యూటర్లకు కూడా అబద్దాలు నేర్పగలుగుతాడు.. 
విశాఖలో ఐటీ రంగం ఎలా ఉందంటే.. 10 ఏళ్ల కిందంటే రాజశేఖర్‌ రెడ్డి హయాంలో 18 వేల మందికి ఉద్యోగాలొచ్చాయి. రెండు వేల కోట్ల ఎగుమతులుంటే.. ప్రస్తుత పాలనలో ఉద్యోగాలు పెరగాల్సింది పోయి 16వేలకు తగ్గాయి. ఐటీ ఎగుమతులు పెరగాల్సింది పోయి ఏకంగా 11 వందల వేల ఐదు కోట్లకు తగ్గిపోయింది.  5 వేల మంది కోసం కట్టిన విప్రో బిల్డింగ్‌లో 500 మంది కూడా పనిచేయడం లేదు. ఐటీ స్పేస్‌ కోసం కట్టిన బిల్డింగ్‌లో నాలుగు లక్షల వేల చదరపు అడుగులు ఖాళీగా ఉంది. ఇంతటి దారుణంగా ఐటీ రంగం ఉందంటే.. ఈ పెద్దమనిషి మాత్రం కళ్లార్పకుండా అబద్దాలు చెప్పగలుగుతున్నాడు. కంప్యూటర్లకు కూడా అబద్దాలు నేర్పగలుగుతాడు ఈ పెద్దమనిషి. అబద్దాలు చెప్పడం, మోసం చేయడంలో డిగ్రీ, పిహెచ్‌డీ ఉందంటే అది చంద్రబాబు ఒక్కరికే.. 

విశాఖ ఉక్కు కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు. కేంద్రంతో పోరాడి విశాఖ ఉక్కును వైఎస్సార్‌ విస్తరించారు. చంద్రబాబు అడుగుపెట్టారు. విశాఖ ఉక్కుకు మళ్లీ వరుసగా నష్టాలే మిగిలాయి. ఆయన అడుగు పెడితే ఏదైనా ధ్వంసం కావాల్సిందే. విశాఖ పోర్ట్‌లో12 బెర్త్‌లు ప్రయివేట్‌ పరమయ్యాయి. అప్పుడు 24 వేల మంది పనిచేస్తే ప్రస్తుతం 4 వేల మంది పనిచేస్తున్నారు. కార్గో హ్యాండ్లింగ్‌లో విశాఖ పోర్టు దేశంలో నంబర్‌వన్‌లో ఉండేది. పోర్టు అధ్వర్యంలో నడుస్తున్న స్కూళ్లు కూడా మూతపడ్డాయి. పోర్టు ఉద్యోగుల క్వార్టర్లు శిథిలావ్థకు చేరుకున్నాయి. ఈ భూములను లాక్కోవాలని చంద్రబాబు స్కెచ్‌ వేస్తున్నారు.

విశాఖ విమ్స్‌ పరిస్థితి..
పక్కనే విమ్స్‌ కనిపిస్తోంది.  ఇక్కడ ఒకటే కేజీహెచ్‌ ఉందని, ఇంకో ఆసుపత్రి కావాలని హైదరాబాద్‌ నిమ్స్‌ తరహాలో 100 ఏకరాల విస్తీరణంలో 1100 పడకలతో రూ. 250 కోట్లు కేటాయించి ఆ దివంగత నేత విమ్స్‌ను మొదలు పెట్టారు. ప్రస్తుత చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఆ విమ్స్‌ పరిస్థితేంటో తెలుసా 6 బ్లాగ్‌లనుంచి 2కు కుదించారు. కనీసం డాక్టర్లను కూడా తీసుకోని ఈ దిక్కుమాలిన ప్రభుత్వం. ఆసుపత్రిలోని ప్రతీ సర్వీస్‌ను లంచాలను ఎలా తీసుకోవాలన్న ఆరాటంతో ప్రతిదీ ప్రయివేటీకరణ చేస్తున్నారు. కేజీహెచ్‌లో ఒక బెడ్‌కు ఇద్దరు పేషేంట్లను పెడుతున్నారు. ఇక్కడ డాక్టర్లు, నర్స్‌లను రిక్రూట్‌ చేయరు. ప్రసవానికి 50 వేల రూపాయలు ఖర్చు అవుతోంది. కేజీహెచ్‌కు వెళ్తే ఒకబెడ్‌కు ఇద్దరుంటున్నారు. దిక్కులేక పేద ప్రజలు ప్రయివేట్‌ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇంతటి దారుణంగా విశాఖలో పాలన కొనసాగుతుంది. 

హుదూద్‌ తుఫాన్‌..
హుదూద్‌ తుఫాన్‌ వచ్చినా జయించేశాం అన్నాడు. ఈ తుఫాన్‌ కారణంగా 25వేల ఇళ్లు దెబ్బతింటే.. కేవలం 4 వేల ఇళ్లు కట్టారు. రాజశేఖర్‌ రెడ్డి హయాంలో 30 వేల ఇళ్లు కట్టారు. విశాఖలో ఏం జరిగినా స్కామే. ఫ్లాట్‌ కట్టిస్తాడట. 300 అడుగుల ఫ్లాట్‌, అడుగుకు 2000 వేల అడుగుతాడట. ఆ ఫ్లాట్‌లలో లిఫ్ట్‌ ఉండదు. ప్రభుత్వమే భూమి ఇస్తున్నప్పుడు, ఏవరిని అడిగినా దానికి  వెయ్యి రూపాయల కంటే ఎక్కువ కాదని చెబుతారు. మీకు 6 లక్షలకు  అమ్ముతాడంట. అందులో లక్షన్నర కేంద్రం, లక్షన్నర ప్రభుత్వం ఇస్తుందంట. మిగిలినవి మీరు అప్పుగా కట్టించుకుంటారంటా.? నెల నెల మూడు వేలు 20 నెలలు కట్టాలంటా.. ఆ ఫ్లాట్స్‌ ఇస్తానంటే ఎవరూ వద్దూ అనొద్దు. బంగారంగా తీసుకొండి. మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జగన్‌ అనే నేను మీ అందరికి హామీ ఇస్తున్నాను. ఆ ఫ్లాట్స్‌ మీద ఏదైతే అప్పు ఉంటుందో ఆ మొత్తం డబ్బంతా మాఫీ చేస్తాను’ అని  వైఎస్‌ జగన్‌ తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top