62వ రోజు పాదయాత్ర డైరీ

ys jagan prajasankalpayatra dairy 62th day - Sakshi

ఈ ఆత్మీయతలే నన్ను నడిపిస్తున్నాయి..

14–01–2018, ఆదివారం
రావిళ్లవారిపల్లె శివారు,
చిత్తూరు జిల్లా

ప్రపంచంలోని తెలుగువారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రజలందరూ భోగభాగ్యాలతో, సిరిసంపదలతో విలసిల్లాలి. సుఖసంతోషాలతో జీవించాలి. ఈ సంక్రాంతి.. అందరి జీవితాలలో కాంతిని నింపాలి. 

‘ప్రతిభకు పేదరికం అడ్డు కాకూడదు.. పేదింట్లో పుట్టిన ప్రతి ప్రతిభావంతుడూ ఉన్నత చదువులు చదవాలి’ అని నాన్నగారు అనేవారు. ఆయన కలలకు ప్రతిరూపమైన ఓ సంఘటన ఈ రోజు ఎదురైంది. అడపారెడ్డిపల్లికి చెందిన తులసి, కీర్తి అనే అక్కచెల్లెళ్లు ‘అన్నా.. మీ నాన్నగారు ఇచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో మేము, మా తమ్ముడు.. ముగ్గురం ఎంటెక్‌ చదివాం. చాలా థ్యాంక్స్‌ అన్నా’ అన్నారు. నాన్నగారిపై ఉన్న అదే కృతజ్ఞతాభావాన్ని నాపై ప్రదర్శించడాన్ని చూసి చలించిపోయాను. అంతేగాక నా చేతికి రక్షాబంధన్‌ కట్టి ‘అన్నా.. మీ ఆరోగ్యం జాగ్రత్త. మీరు బాగుంటేనే మేమంతా బాగుంటాం’ అని అనడం నా హృదయాన్ని తాకింది. ఈ ఆత్మీయతలే నన్ను ఉత్సాహంతో నడిపిస్తున్నాయి. ఈ ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని కొందరు మార్క్సిస్టు విశ్లేషకులు సైతం ‘ఇంతకు మించిన సోషలిజం ఏముంటుంది..’ అని ప్రశంసించారు. పిల్లలు ఎంత బాగా చదువుకోగలిగితే.. భావితరాలకు పునాది అంత పటిష్టంగా ఉంటుంది. 

కాస్త దూరం నడిచాక ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలలో పనిచేసే అధ్యాపక సంఘం నేతలు కలిశారు. ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు వేతనాల నుంచి సౌకర్యాల వరకు తమ హక్కుల్ని కాలరాస్తున్నాయని, పని ఒత్తిడి తీవ్రంగా ఉంటోందని, వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న అధ్యాపకుల స్థితిగతులను మెరుగుపర చడం తోపాటు విద్యార్థులు ఎదుర్కొంటు న్న తీవ్ర మానసిక ఒత్తిళ్లను తొలగించాల్సి న అవసరం ఎంతైనా ఉంది. 

దారిలో సుజాత అనే ఒక అక్క ‘అన్నా.. పండుగ కోసం హైదరాబాద్‌ నుంచి వచ్చాం. కానీ, ఆ సంతోషమే లేదు’ అంది. ఏమైంది అక్కా.. అని అడిగాను. ‘హైదరాబాద్‌ నుంచి రావడానికి బస్సు చార్జీ ఒక్కొక్కరికి రూ.2,300 పెట్టాం.. ఇంతగా రేట్లు పెంచేస్తే ఇక గవర్నమెంటుకు, ప్రైవేటు కంపెనీకి తేడా ఏముందన్నా..’ అని అంది. పల్లెసీమల ప్రజల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటే, పండుగ సందర్భంగా ధరలు మాత్రం ఆకాశాన్నంటు తున్నాయి. ప్రజలకు తోడ్పాటునిచ్చి, ధరలను తగ్గించి, సంతోషంగా పండుగ జరుపుకొనే పరిస్థితులను కల్పించాల్సింది పోయి.. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని ప్రభుత్వమే ఆర్టీసీ చార్జీలను పెంచడమే కాకుండా, ప్రైవేటు ఆపరేటర్లకు కొమ్ముకాయడం, నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు ప్రయత్నించకపోవడం ఎంత వరకు సమంజసం?


ఆదివారం చిత్తూరు జిల్లా కమ్మపల్లె వద్ద  వైఎస్‌ జగన్‌తో సెల్ఫీ దిగుతున్న యువతి 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top