కుల మీడియా సృష్టికర్త చంద్రబాబే

Vijaya Sai Reddy Fires On Chandrababu Naidu - Sakshi

రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి

ఆయనను ఎల్లోమీడియా ఆకాశానికి ఎత్తేస్తోంది

వైఎస్సార్‌సీపీపై దుష్ప్రచారం చేస్తోంది  

నేను మాట్లాడినట్టు సృష్టించిన వాయిస్‌ నాది కాదు

సాక్షి, హైదరాబాద్‌: కుల మీడియా సృష్టించిన కులోన్మాది ఏపీ సీఎం చంద్రబాబునాయుడేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి విమర్శించారు. ఎల్లో మీడియా ఆయనను ప్రతిరోజూ ఆకాశానికి ఎత్తేస్తూ..వైఎస్సార్‌సీపీపై అభూత కల్పనలతో దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు, రాధాకృష్ణ సంభాషణ వారి దుర్మార్గానికి పరాకాష్ట అన్నారు. సోమవారం హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌లోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..దశాబ్ధాల పాటు చంద్రబాబును ఆంధ్రజ్యోతి, మిగతా ఇతర కుల మీడియా ఆకాశానికి ఎత్తుతూ దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా ప్రచారం చేస్తున్నాయని .. అదే సమయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజల్లోకి చొచ్చుకుపోతుంటే.. దుష్ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. ‘కొంతకాలం క్రితం వరకు రాధాకృష్ణ ఒక లాండ్రిటా డొక్కు స్కూటర్‌లో సాధారణమైన న్యూస్‌ కలెక్టర్‌గా ఉండే వారని’ విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. ఈ రోజు అదే రాధాకృష్ణ ఆస్తి రూ.50 వేల కోట్లకు పైగా ఉంటుందని చెప్పారు.  

రాధాకృష్ణ పెద్ద మోసగాడు..
రాధాకృష్ణ పెద్ద మోసగాడని విజయసాయిరెడ్డి అన్నారు. 2010–2011 వ సంవత్సరంలో ఉమ్మడి హైకోర్టులో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు వ్యతిరేకంగా ఒక కేసు నమోదు అయిందని గుర్తు చేశారు. విజయ ఎలక్ట్రానిక్స్, నూజివీడు సీడ్స్, బొజ్జల గోపాల కృష్ణారెడ్డి మిత్రులు అమోదా పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టారన్నారు. వారు పెట్టిన పెట్టుబడులను తిరిగి చెల్లించకుండా రాధాకృష్ణ ఎగ్గొట్టారన్నారు. కంపెనీ రిజిస్టర్లలో ఆ సంస్థలో వారి పేర్లు లేకుండా మోసం చేశాడని తెలిపారు. ఈ అక్రమాలకు సంబంధించిన సాక్ష్యాధారాలు తన వద్ద ఉన్నాయని  చెప్పారు.

వెనక్కు తిరిగే తత్వం వైసీపీకి లేదు..  
 తాను మాట్లాడినట్లుగా ఒక ఆడియో సృష్టించారని .. అది నా వాయిస్సే కాదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఆ వాయిస్‌ను సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించామని రాధాకృష్ణ చెబుతున్నారని, అయితే ఆ అధికారం కేవలం పోలీసులకు మాత్రమే ఉందన్నారు. రాధాకృష్ణ అక్రమాలు, అవినీతిని వ్యతిరేకిస్తోన్న తమపై ఆయన యుద్ధం ప్రకటించారని, దానిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఉన్నాయని తెలిపారు. యుద్ధంలో పోరాటం చేయడమే వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు తెలుసని విజయసాయిరెడ్డి వివరించారు. 10 శాతం ఫిర్యాదులపైనే చర్యలు..: చంద్ర  బాబు ప్రభుత్వం అధికార దుర్వినియోగంపై తాను చేసిన ఫిర్యాదుల్లో కేవలం10 శాతం ఫిర్యాదులపై మాత్రమే ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకుందని విజయసాయిరెడ్డి చెప్పారు. ఏపీ డీజీపీ, ప్రకాశం, చిత్తూరు జిల్లాల ఎస్‌పీలను మార్చమన్నా మార్చలేదని, కేఏ పాల్‌ పార్టీ గుర్తును మార్చమన్నా పట్టించుకోలేదని పేర్కొన్నారు. తప్పుడు వార్తలు సృష్టిస్తోన్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై డీజీపీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. బాబు, పవన్‌ కల్యాణ్‌ ఓ అవగాహనతో పోటీ చేస్తున్నారని సాయిరెడ్డి తెలిపారు.

బాబు – రాధాకృష్ణ సంభాషణ దారుణం..
ఎన్టీఆర్‌కు స్వయానా అల్లుడైన చంద్రబాబుకు .. ఎన్టీఆర్‌ పట్ల ఎలాంటి గౌరవం ఉందో ఇప్పుడు వైరల్‌ అవుతున్న ఓ వీడియో చూస్తే ప్రజలకు అర్థమౌతుందన్నారు. ఎన్‌టీఆర్‌ ఆరోగ్యశ్రీ నుంచి ఎన్టీఆర్‌ పేరును తొలగిస్తానని చంద్రబాబు రాధాకృష్ణతో అనడం స్పష్టంగా ఉందన్నారు. బుద్ధి, జ్ఞానం ఉన్న వ్యక్తి ఎవరైనా సొంత మామనే వాడు, వీడు అని పిలుస్తారా? వీడియోలో నమోదు అయిన రికార్డింగ్‌ను పరిశీలిస్తే రాధాకృష్ణ, చంద్రబాబు ఎంత దుర్మార్గులో అర్థం అవుతుందని చెప్పారు. అత్యంత నీచులైన చంద్రబాబు, రాధాకృష్ణకు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. రాజకీయ రంగంలో చీడపురుగు చంద్రబాబు అయితే.. జర్నలిజం విలువలను మంట గలిపిన వ్యక్తి రాధాకృష్ణ అని మండిపడ్డారు.

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై క్రిమినల్‌ కేసు
హైదరాబాద్‌: ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి చానల్‌ ఎండీ వేమూరి రాధాకృష్ణపై హైదరాబాద్‌లో క్రిమినల్‌ కేసు నమోదైంది. వైఎస్సార్‌ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు సోమవారం రాధాకృష్ణపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో మరికొందరు నిందితులుగా ఉన్నట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.  తనది కాని గొంతును తనకు ఆపాదిస్తూ తాను మాట్లాడినట్లు ప్రసారం చేసి తన ప్రతిష్టను, తమ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా వేమూరి రాధాకృష్ణ వ్యవహరించా రని, ఈ వ్యవహరం వెనుక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి పాత్రపై అనుమానాలు ఉన్నాయని విజయసాయిరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఆదివారం జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు అందగా న్యాయసలహా తీసుకున్న పోలీసులు సోమవారం కేసు రిజిస్టర్‌ చేశారు. నిందితులకు నోటీసులు జారీ చేయడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top