అబద్ధాలను ప్రచారం చేస్తున్న బీజేపీ  | TRS Working President KTR Fires On BJP | Sakshi
Sakshi News home page

అబద్ధాలను ప్రచారం చేస్తున్న బీజేపీ 

Aug 23 2019 1:42 AM | Updated on Aug 23 2019 4:02 AM

TRS Working President KTR Fires On BJP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అబద్ధాలను పదే పదే ప్రచారం చేయడం ద్వారా.. వాటినే నిజాలుగా ప్రజలను నమ్మించాలన్నదే బీజేపీ ప్రయత్నమని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. బీజేపీ చేసే అబద్ధపు ప్రచారాలను రోజూ ఖండించలేమని, అయితే పార్టీ వేదికలు, సామాజిక మాధ్యమాల ద్వారా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం తెలంగాణ భవన్‌లో పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల నిర్మాణం, జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయ భవనాల నిర్మాణం వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. ‘బీజేపీ సహా ఇతర పార్టీలు చేసే విమర్శలకు రోజూ బదులివ్వాల్సిన అవసరం లేదు. తెలంగాణ అభివృద్ధి విషయంలో ఆయా పార్టీలకు ఉన్న చిత్తశుద్ధి ఏంటో ప్రజలకు తెలుసు’అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ దేశంలోనే అగ్రగామిగా, అతిపెద్ద కుటుంబంగా అవతరించిందని, కార్యకర్తల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రూ.2 లక్షల జీవిత బీమాతో పాటు ప్రయోజనాలు చేకూరేలా ప్రత్యేక గుర్తింపు కార్డులు కూడా ఇస్తున్నట్లు వెల్లడించారు. 

60 లక్షల మందికి సభ్యత్వం 
‘ఈ ఏడాది జూలై 27న ప్రారంభించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. ఇప్పటి వరకు 60 లక్షల మంది పార్టీ సభ్యత్వాన్ని తీసుకోగా.. ఇందులో 20 లక్షల మంది క్రియాశీలక సభ్యులున్నారు. వచ్చే నెల 15లోగా 20 లక్షల మందికి గుర్తింపు కార్డులు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం’అని కేటీఆర్‌ వెల్లడించారు. సభ్యత్వ నమోదులో సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ అసెంబ్లీ నియోజవకవర్గంలో అగ్రస్థానంలో ఉండగా, సిరిసిల్ల నియోజకవర్గంలో 63,400 మంది పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించినట్లు తెలిపారు. ఈ నెల 31 వరకు సంస్థాగత కమిటీల నిర్మాణం పూర్తి చేయాలని చెప్పారు. బస్తీ, వార్డు కమిటీలతో పాటు, అనుబంధ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని స్థాయిల్లో సోషల్‌ మీడియా కమిటీలు కూడా ఉండేలా చూడాలని, అయితే అన్ని రకాలైన కమిటీల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంఖ్య 51 శాతం ఉండేలా చూడాలన్నారు. 

దసరా నాటికి పార్టీ భవనాలు 
జిల్లా కేంద్రాల్లో చేపట్టిన పార్టీ కార్యాలయ భవన నిర్మాణ పనులు దసరా నాటికి పూర్తి చేయాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశించారు. 30 జిల్లాల్లో జరుగుతున్న పార్టీ కార్యాలయ భవన నిర్మాణ పనులను కేటీఆర్‌ సమీక్షించారు. భవిష్యత్తులో పార్టీ కార్యకర్తలు వివాహాలు, ఇతర శుభకార్యాలు నిర్వహించుకునేలా పార్టీ కార్యాలయ నిర్మాణం ఉండా లన్నారు. భవన నిర్మాణం, షెడ్లు కనీసం 5 వేల చదరపు అడుగులు ఉండేలా ఇచ్చిన ప్లాన్‌కు స్థానిక పరిస్థితులను బట్టి మెరుగులు దిద్దాల న్నారు.  పార్టీ సభ్యత్వ నమోదులో 90,575 సభ్యత్వాలతో గజ్వేల్‌ టాప్‌లో ఉండ గా, తర్వాతి స్థానాల్లో మేడ్చల్‌ (80,175),పాలకుర్తి (74,650), ములుగు (72,262), మహబూబాబాద్‌(70,475), సత్తుపల్లి(67,850), పాలేరు(69,175), సూర్యాపేట(66, 875), సిద్దిపేట (64,575), వర్ధన్నపేట(64,850) ఉన్నాయి. భేటీలో ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, భానుప్రసాద్, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు గుండు సుధారాణి ఉన్నారు. 

‘అలసిపోయినపుడు వేడి వేడి చాయ్‌కి మించిందేముంటుంది.. తిరుగు ప్రయాణంలో స్వల్ప విరామం’అంటూ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ట్విట్టర్‌లో తాను టీ తాగుతున్న ఫొటోలు పోస్ట్‌ చేశారు. సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం చేనేత పార్కు పురోగతి దుస్తుల తయారీపై సమీక్ష జరిపారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణంలో రాజీవ్‌ రహదారిపై ఉన్న ప్రజ్ఞాపూర్‌లో రోడ్డు పక్కన ఉన్న ఓ చాయ్‌ దుకాణంలో కాసేపు సేదతీరారు. చా య్‌ ఆస్వాదిస్తున్న ఫొటోలతో పాటు టీ స్టాల్‌ యజమాని కుటుంబంతో దిగిన ఫొటోల్ని పోస్ట్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement