
కేరళలోని మూడు కూటములైన ఎల్డీఎఫ్, యూడీఎఫ్, ఎన్డీయే మధ్య ఎక్కడైనా హోరాహోరీ పోరు ఉందంటే అది ప్రతిష్టాత్మక తిరువనంతపురం నియోజకవర్గంలోని ముగ్గురు ఉద్దండుల మ«ధ్యే. ఈ స్థానం నుంచి, కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ నుంచి, ముచ్చటగా మూడోసారి గెలుపుని కైవసం చేసుకోవాలని ప్రస్తుత ఎంపీ శశిథరూర్ ఉవ్విళ్లూరుతున్నారు. ఈ స్థానం నుంచి అభ్యర్థిగా ప్రముఖ బీజేపీ నాయకుడు, మిజోరం మాజీ గవర్నర్ కుమ్మనం రాజశేఖర్, సీపీఎం నాయకత్వంలోని ఎల్డీఎఫ్ అభ్యర్థిగా తిరువనంతపురం సిట్టింగ్ ఎమ్మెల్యే సి.దివాకరన్.. ఎవరికి వారు విజయాన్ని సొంతం చేసుకోవాలని తపిస్తున్నారు. హ్యాట్రిక్ కొట్టాలనే శశిథరూర్ కల.. అంచనాలకు అందకుండా ఉంది.
దక్షిణ భారతదేశంలో చిట్టచివరన ఉన్న తిరువనంతపురం నియోజకవర్గంలో మొత్తం 13,34,665 ఓటర్లున్నారు. ఇందులో మహిళా ఓటర్లు 6,90,695, థర్డ్ జెండర్స్ 31 మంది ఉన్నారు. ఈ నియోజకవర్గం అరేబియా సముద్రతీరం నుంచి, పశ్చిమ కనుమల వరకూ విస్తరించి ఉంది. తమిళనాడుకి ఆనుకొని వున్న కన్యాకుమారి జిల్లాతో కూడా ఈ ప్రాంతానికి సరిహద్దు ఉంది.
గెలుపు అంత ఈజీ కాదు..
తిరువనంతపురం నియోజకవర్గం పట్టణ, గ్రామీణ, తీర ప్రాంతాలలో విస్తరించి ఉంది. ఈ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో కజకుట్టం, వట్టియార్‌క్కావు, నెమం, పరస్సల, కోవలం, తిరువనంతపురం శాసనసభా స్థానాలున్నాయి. ఈ నియోజకవర్గం ఎవరికీ, ఎప్పుడూ ఏకపక్షంగా విజయాలను కట్టబెట్టలేదు. గతంలో ఇక్కడి నుంచి, కాంగ్రెస్, ఎల్డీఎఫ్ భాగస్వామ్య పక్షమైన సీపీఐ పలుమార్లు విజయకేతనం ఎగురవేశాయి. రెండుసార్లు వరుస విజయాలతో దూసుకుపోయిన శశిథరూర్ ఈసారి విజయాన్ని సొంతం చేసుకోవడం అంత తేలికైన విషయమైతే కాదని విశ్లేషకుల అభిప్రాయం. ఈయన ప్రత్యర్థులు కూడా జనాదరణ కలిగి, విజయాన్ని తమ ఖాతాల్లో వేసుకోవడానికి ముమ్మరంగా యత్నిస్తున్నారు.
కాంగ్రెస్: అభివృద్ధే గెలిపిస్తుందని ఆశ
2009 లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీచేసిన ఐక్యరాజ్యసమితి మాజీ రాయబారి శశిథరూర్ దాదాపు లక్ష (99,998) ఓట్ల ఆధిక్యంతో విజయాన్ని కైవసం చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో శశిథరూర్‌ని బీజేపీ ప్రముఖుడు ఓ రాజగోపాల్ ఢీకొట్టి ఆయన మెజారిటీని 15 వేలకు తగ్గించగలిగారు. పదేళ్లుగా ఈ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని చూసి, ఓటర్లు తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారనే నమ్మకం ఉందని శశిథరూర్ విశ్వసిస్తున్నారు. ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పరిశ్రమలు తీసుకురావడం, జాతీయ రహదారుల అభివృద్ధి తదితర అంశాలపై నిరంతరం శ్రమించి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడ్డాననీ, అందుకే ప్రత్యేకించి యువతరం తన వైపే మొగ్గు చూపుతుందని ఆయన ఆశిస్తున్నారు.
బీజేపీ: ‘రాజ’వుతారా?
బీజేపీ ఎంతో ప్రజాదరణ కలిగి, మంచి ఇమేజ్ కలిగి ఉన్న మిజోరం మాజీ గవర్నర్ రాజశేఖరన్‌ని రంగంలోకి దించి, విజయంపై ఆశలు పెట్టుకుంది. రాజశేఖరన్‌కు ప్రజలతో ఉన్న సత్సంబంధాలు, ఆయన పలుకుబడి, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా ఈ నియోజకవర్గంలో ఆయన కృషి తమకు విజయాన్ని సాధించిపెడుతుందని బీజేపీ గంపెడాశతో ఉంది. ఈ ఎన్నికల్లో పినరయి విజయన్ నాయకత్వంలోని ఎల్డీఎఫ్ పాలనపై ప్రజా వ్యతిరేకత, శబరిమల దేవాలయ సమస్య, మోదీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ప్రత్యేకించి, కేరళలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం సహాయం, గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉన్న రాజశేఖరన్ అభ్యర్థిత్వం తమను విజయతీరాలకు చేరుస్తుందని బీజేపీ భావిస్తోంది.
సీపీఎం: సర్కారు పనితీరుపై భారం
ఎల్డీఎఫ్ భాగస్వామిగా ఉన్న సీపీఎం నుంచి పోటీ చేస్తోన్న స్థానిక శాసనసభ్యుడు దివాకరన్ నియోజకవర్గంలో మంచి పట్టున్న వ్యక్తి. ఈయన ప్రముఖ కార్మికోద్యమ నాయకుడు కూడా కావడం సీపీఎంకి కలిసొచ్చే అంశం. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో శశిథరూర్ విఫలమయ్యారనీ, అది తమకు సహకరించవచ్చునని సీపీఎం భావిస్తోంది. అలాగే శబరిమల దేవాలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ చేసిన ప్రచారాన్ని ప్రజలు తిరస్కరిస్తారని, సుప్రీంకోర్టు తీర్పుని ప్రభుత్వం అమలు చేయడం, అన్ని వయస్సుల మహిళలను దేవాలయ ప్రవేశం చేయించడం, తమకు కలిసి వచ్చే అంశాలని ఆ పార్టీ ఆశాభావంతో ఉంది. మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, విజయన్ ప్రభుత్వం గత ఆగస్టులో సంభవించిన ప్రకృతి విపత్తు సందర్భంగా చేపట్టిన పునరావాస కార్యక్రమాలూ, రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలూ తమ విజయాన్ని ఖరారు చేస్తాయని సీపీఎం ఆశాభావంతో ఉంది.
ఎవరి మొగ్గు ఎటో?!
పార్టీ బలాలూ, న్యూట్రల్ ఓట్లే కాకుండా, వివిధ సామాజికవర్గాల ఓట్లు తిరువనంతపురం నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపోటములను శాసించనున్నాయి. ముఖ్యంగా హిందువులు, క్రిస్టియన్స్, ముస్లిం సామాజిక వర్గాల ఓట్లు ఎన్నికలను ప్రభావితం చేయనున్నాయి. శబరిమలై ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకించి, ఎవరైతే దీనికి అనుగుణంగా పనిచేస్తారో, భక్తుల మనోభావాలను గౌరవిస్తారో, వారినే గెలిపిస్తామని నాయర్ సర్వీస్ సొసైటీ (ఎన్‌ఎస్‌ఎస్) ప్రకటించింది. తిరువనంతపురం నుంచి గతంలో అనేక మంది ఉద్దండులు పార్లమెంటుకి ప్రాతినిధ్యం వహించారు. 1970లో వామపక్షాల సహకారంతో ఇండిపెండెంట్‌గా వీకే కృష్ణమీనన్, 1977లో సీపీఐ నుంచి ఎంఎన్ గోవిందన్ నాయక్, 1998లో కాంగ్రెస్ నుంచి కె.కరుణాకరన్, 2004లో పీకే వాసుదేవన్ నాయర్ లాంటి ప్రముఖులు ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. గోవిందన్ నాయర్ లాంటి సీపీఐ ప్రముఖులు, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఓఎన్‌వీ కురుప్ (సీపీఐ) ఇక్కడ అపజయం పాలైన చరిత్ర ఉంది.
2011జనాభాలెక్కలప్రకారం..
హిందువులు 66.46 %
క్రిస్టియన్లు 19.1 %
ముస్లింలు13.72 %