గీ వసూళ్లకు దిగుడేంది చంద్రన్నా..

TDP Leaders Are Issuing Order To Traders And Contractors For The Cost Of Election - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఎన్నికల్లో పెట్టిన ఖర్చును గెలిచిన తర్వాత వచ్చే ఐదేళ్లలో రాబట్టుకునే ప్రజాప్రతినిధులను చూశాం. అయితే ఎన్నికల్లో గెలుపు ప్రశ్నార్థకం కావడంతో ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు తాము పెట్టిన ఖర్చును ఎన్నికల ఫలితాలు వచ్చేలోగానే నయానో భయానో తిరిగి రాబట్టుకోవడంపై దృష్టి పెట్టారు. దీని కోసం చందాల దందా మొదలుపెట్టారు. వ్యాపారులు, కాంట్రాక్టర్లకు హుకుం జారీ చేస్తున్నారు. డబ్బులు ఇవ్వని వారిపై బెదిరింపులకు దిగుతున్నట్లు సమాచారం. 

 ఈ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు పెద్దఎత్తున ఖర్చు పెట్టారు. ఒక్కో స్థానంలో ఓటుకు రూ.500 నుంచి రూ. 2000 వరకూ ఇచ్చారు. ఇది కాకుండా డ్వాక్రా గూపులకు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాల్సి వచ్చింది. దీంతో ఒక్కో నియోజకవర్గానికి రూ.10 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకూ ఖర్చు పెట్టినట్టు సమాచారం.  ఏలూరు, చింతలపూడి, పోలవరంలో ఓటుకు 500 చొప్పున ఇవ్వగా, మిగిలిన నియోజకవర్గాల్లో ఓటుకు రూ.వెయ్యి, భీమవరంలో ఓటుకు రూ.రెండు వేలు ఇచ్చారు.

పోస్టల్‌ బ్యాలెట్లకు, మద్యం సరఫరాకు, ప్రచా రానికి పెట్టిన ఖర్చులు అదనం.. అయితే ఎన్నికలు మొదటి దశలోనే ప్రకటించడం, పోలింగ్‌కు సమయం లేకపోవడంతో పార్టీకి చందాలు అనుకున్న స్థాయిలో రాలేదు. కొంతమంది ఇస్తామన్న డబ్బులూ సమయం చాలలేదని ఇవ్వలేదు. మరోవైపు అధిష్టానం నుంచి రావాల్సిన డబ్బులు కూడా పూర్తిస్థాయిలో రాలేదు. 
 

గెలుపుపై నమ్మకం లేకే..
దీంతో అభ్యర్థులే సొంత డబ్బులు ఖర్చుపెట్టారు. ఇంత చేసినా గెలుస్తామా.. అనే అపనమ్మకం వారిని వెంటాడుతోంది. ఓటమి భయంతో సరి కొత్త వ్యూహానికి ఎమ్మెల్యేలు తెరతీశారు. దీపం ఉండగానే చక్కపెట్టు కోవాలన్న చందంగా ఫలితాల్లోపే ఎన్నికల ఖర్చు రాబట్టుకోవాలని ఎమ్మెల్యేలు వసూళ్ల దందాకు తెగబడుతున్నారు. తమకు హామీ ఇచ్చిన వారి నుంచి, వ్యాపారులు, కాంట్రాక్టర్ల నుంచి ఖర్చులు రాబట్టుకునే పనిలో ప్రజాప్రతినిధులు పడ్డారు. 
 

ఇవిగో నిదర్శనాలు 
     ఒక ఎమ్మెల్యే తన పట్టణంలోని 260 బంగారు షాపుల నుంచి ఒక్కో షాపుకు రూ.25 వేల చొప్పున వసూలు చేసినట్లు సమాచారం. దీని కోసం బులియన్‌ మర్చెంట్స్‌ అసోసియేషన్‌ నేతను అడ్డం పెట్టుకున్నట్లు తెలిసింది. ఇవే కాకుండా బట్టల షాపులు, ఇతర పెద్ద షోరూంలకూ ఇండెంట్‌ వేసినట్లు తెలిసింది. బట్టల కొట్ల నుంచి వాటి స్థాయిని బట్టి రూ.25 వేల నుంచి రూ.50 వేల  వరకూ వసూలు చేస్తున్నట్లు సమాచారం.  ఒక మాజీ ఎఎంసీ చైర్మన్‌ ఈ బాధ్యతను భుజాన వేసుకున్నట్లు తెలిసింది. గెలిచినా, ఓడినా తమ మాట వినకపోతే వ్యాపారం చేసుకోలేరని బెదిరింపులకు దిగినట్లు సమాచారం. 

ఇంకో ఎమ్మెల్యే కాంట్రాక్టర్ల నుంచి రావాల్సిన కమీషన్లను వెంటనే ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. మరికొందరు ఎన్నికల ఫలితాలు వచ్చేలోగా మట్టి, ఇసుకదందాలను సాధ్యమైనంత మేర పూర్తి చేసుకునే పనిలో ఉన్నారు. పెట్టిన ఖర్చులో ఎంతోకొంత కౌంటింగ్‌లోపే రాబట్టుకోవడం కోసం ఎమ్మెల్యేలు చేస్తున్న యత్నాల పట్ల వ్యాపారులు, కాంట్రాక్టర్లలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అయితే వారిని ఎదిరించి ఇబ్బందులు పడటం ఇష్టం లేక వారు నోరుమెదపడం లేదు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top