అరవింద్‌ కేజ్రీవాల్‌తో పీకే టీం

Prashant Kishor Organisation Coming On Board With  Arvind Kejriwal - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ కీలక ప్రకటన చేశారు. వరుసగా రెండోసారి ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలనే వ్యూహంలో భాగంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో జత కడుతున్నట్టు వెల్లడించారు. రాజధానిలో జరగబోయే ఎన్నికలకు ప్రశాంత్‌ కిషోర్‌ కన్సల్టెన్సీ సంస్థ  ఇండియన్‌ పొలిటిక​ల్‌ యాక్షన్‌ కమిటీ(ఐ-పీఏసి)తో ఆప్‌  కలిసి పనిచేయనున్నట్టు ట్విటర్‌ ద్వారా ముఖ్యమంత్రి శనివారం ప్రకటించారు. ఐపాక్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది..స్వాగతం అంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. దీంతో కేజ్రీవాల్‌, పీకే (ప్రశాంత్‌ కిషోర్‌) టీం భాగస్వామ్యం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ విషయాన్ని ఐపాక్‌ కూడా తన ట్వీట్‌ ద్వారా ధృవీకరించింది. పంజాబ్‌ ఎన్నికల తరువాత గట్టి పోటీదారుగా ఆప్‌ను గుర్తించామని, ఈ నేపథ్యంలో ఆప్‌తో కలిసి పనిచేయనుండడం సంతోషకరమని ఐపాక్‌ పేర్కొంది. వివాదాస్పదమైన నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి), పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రశాంత్‌ కిషోర్‌ వ్యతిరేకించారు. అలాగే  ఐపాక్‌ తాజా క్లయింట్లు, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ కూడా వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నవారే కావడం ఆసక్తికరమైన విషయం. 

మరోవైపు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పాగా వేసి, ఢిల్లీలో కూడా అధికార పగ్గాలకోసం ఉవ్విరూళుతున్న బీజేపీ షాకిచ్చేలా కేజ్రీవాల్‌ ఈ కీలక అడుగు వేయడం విశేషం. ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్తగా తనదైన శైలిలో రాణిస్తూ ఆయా పార్టీలకు అధికారాన్ని సునాయాసంగా అందిస్తున్న పీకే వ్యూహాలు అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఏమేరకు కలిసి వస్తాయో వేచి చూడాలి. కాగా 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ  ఎన్నికలకు తృణమూల్ కాంగ్రెస్‌కు కూడా ప్రశాంత్‌ కిషోర్‌  ఐపాక్‌ పనిచేస్తోంది. రాష్ట్రంలో బీజేపీ పుంజుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిగా వరుసగా మూడోసారి విజయం సాధించాలనే లక్ష్యంతో దీదీ మమతా బెనర్జీ కూడా పీకేను నమ్ముకున్న సంగతి తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top