వారసత్వ ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం.. 

Mp kavitha comments about legacy Jobs at singareni - Sakshi

టీబీజీకేఎస్‌ గౌరవాధ్యక్షురాలు, ఎంపీ కవిత 

సాక్షి, కొత్తగూడెం: సింగరేణి కార్మికుల పిల్లలకు వారసత్వ ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని టీబీజీకేఎస్‌ గౌరవాధ్యక్షురాలు, నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన మంగ ళవారం ఆమె భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని కొత్తగూడెం ఏరియా, కొత్తగూడెం కార్పొరేట్, ఇల్లెందు, మణుగూరు ఏరి యాల్లో ప్రచారం చేశారు. కొత్తగూడెం లోని సింగరేణి హెడ్‌ ఆఫీస్, ఆయా ఏరియాల్లోని గనుల వద్ద ఏర్పాటు చేసిన గేట్‌ మీటింగ్‌లలో కవిత మాట్లాడారు. సింగరేణిలో ఎన్నికలతో సంబంధం లేకుండా టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో టీబీజీకేఎస్‌ నిరంతరం కార్మికుల హక్కుల కోసం పాటుపడుతోందన్నారు. దీన్ని ఓర్వలేని జాతీయ సంఘాలు అక్రమ పొత్తులు పెట్టుకుని.. టీబీజీకేఎస్‌ను ఓడించేందుకు ప్రయత్నిస్తు న్నాయన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటీయూసీ 2002లో వారసత్వ ఉద్యోగాల రద్దు ఒప్పందాలపై సంతకాలు చేసిందన్నారు.

ఆనాడు జరిగిన తప్పును సరిదిద్దుతూ సీఎం కేసీఆర్‌ 2016లో వారసత్వ ఉద్యోగాల ప్రక్రియ ప్రారంభిం చగా, ఏఐటీయూసీ వారే కోర్టులో కేసు వేయించారన్నారు. అయినప్పటికీ వారసత్వ ఉద్యోగాలు ఇచ్చే విషయంలో దృఢ నిశ్చయంతో ఉన్న కేసీఆర్‌ వారసత్వం బదులు కారుణ్య నియామకాల పేరుతో ఉద్యోగాలు ఇచ్చేందుకు నిర్ణయించారన్నారు. ఉద్యోగం వద్దనుకున్న వారికి రూ.25 లక్షలు అందజేస్తామన్నారు. వారసులకు ఉద్యోగాలు ఇవ్వనిపక్షంలో వచ్చే సాధారణ ఎన్నికల్లో కోల్‌బెల్ట్‌ ఏరియాల్లో ఓట్లు అడగమని ఎంపీ కవిత అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో టీబీజీకేఎస్‌ను గెలిపిస్తేనే కార్మికుల మేలు జరుగుతుందన్నారు. ఏఐటీయూసీని గెలిపిస్తే ప్రతి పనికీ వారు మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వద్దకే రావాలన్నారు. కార్మికులు ఈ విషయాన్ని ఆలోచించాలన్నారు. ఇక ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ గుర్తింపు సంఘాలుగా ఉన్న సమయంలో 22 రకాల కార్మికుల హక్కులను పోగొడితే.. టీబీజీకేఎస్‌ వచ్చాక వాటితోపాటు అదనంగా హక్కులు సాధించడం జరిగిందన్నారు.

అలాగే కార్మికుల కంటే ఎవరూ ఎక్కువ కాదంటూ నష్టాన్ని భరిస్తూ ఇల్లెందులో మూసేసిన 21 ఇంక్లైన్‌ గనిని ప్రత్యేక చొరవ తీసుకుని కేసీఆర్‌ తెరిపించారన్నారు. కాగా.. ‘అలియాస్‌’ పేర్లతో ఇబ్బంది పడుతున్న కార్మి కుల ఇబ్బందులు తొలగించేందుకు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద పేర్లు కరెక్షన్‌ చేసి ఈ సమస్య తొలగిస్తామన్నారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం, మహబూబాబాద్‌ ఎంపీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అజ్మీరా సీతారాంనాయక్, కొత్తగూడెం, పినపాక, ఇల్లెందు, మహబూబాబాద్‌ ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, బానోతు శంకర్‌నాయక్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, జెడ్పీ చైర్‌పర్సన్‌ గడిపల్లి కవిత పాల్గొన్నారు. 

గనులపై గులాబీ జెండా: ఈటల 
భూపాలపల్లి: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో సంస్థవ్యాప్తంగా 11 ఏరియాల్లో గల గనులపై టీబీజీకేఎస్‌ గులాబీ జెండా ఎగరడం ఖాయమని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. భూపాలపల్లిలో మంగళవారం ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థలో గతంలో 1.16 లక్షల మంది కార్మికులు ఉండగా ఇప్పుడు 52,400 మంది ఉన్నారని తెలిపారు. నూతన గనుల తవ్వకాలు చేపట్టి సంస్థకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. ఉత్తర దక్షిణ ధృవాల్లాంటి ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీలు కలిసి పోటీ చేయడం విడ్డూరమన్నారు. తాము అధికారంలో లేని సమయంలో కార్మికుల పక్షాన అనేక పోరాటాలు చేశామన్నారు. గత సీఎంల మెడలు వంచి ప్రమాదంలో మృతిచెందిన కార్మిక కుటుంబాలకు రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇప్పించామని గుర్తు చేశారు.

సింగరేణి కార్మికులకు దేశ సైనికుల మాదిరిగా ఐటీ మినహాయించాల ని పార్లమెంట్‌లో డిమాండ్‌ చేశామన్నా రు. గుర్తింపు సంఘం ఎన్నికలకు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారానికి రావడం అవసరమా? అని ఐక్యకూటమి నాయకులు ప్రశ్నించడంలో అర్థం లేదన్నారు. తమ పార్టీ ప్రతి ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పని చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు ఏదో ఒక రూపంలో వారసత్వ ఉద్యోగాలను అందిస్తామన్నారు. సమావేశంలో రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్‌ చైర్మన్‌ పెద్ది సుదర్శన్‌రెడ్డి, టీబీజీకేఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెంగెర్ల మల్లయ్య, టీఆర్‌ఎస్‌ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు సిరికొండ ప్రశాంత్, టీఆర్‌ఎస్, టీబీజీకేఎస్‌ నాయకులు దేవరకొండ మధు, పైడిపెల్లి రమేష్‌ పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top