మెజారిటీ సర్వేల్లో బీజేపీదే పైచేయి.. | karnataka exit poll 2018 results | Sakshi
Sakshi News home page

May 12 2018 6:51 PM | Updated on Mar 18 2019 9:02 PM

karnataka exit poll 2018 results - Sakshi

సాక్షి, బెంగళూరు : దేశమంతటా తీవ్ర ఉత్కంఠ రేపిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పోలింగ్‌ ముగియగానే ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు వెలువడ్డాయి. కర్ణాటక ఓటర్లు ఈసారి  ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వకుండా హంగ్‌ ఫలితాలు వెలువరించే అవకాశముందని మెజారిటీ సర్వేలు అంచనా వేశాయి. అధికార కాంగ్రెస్‌ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశముందని, టైమ్స్‌ నౌ, ఇండియాటుడే ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేయగా.. మిగతా సర్వేలు బీజేపీదే పైచేయి అని చాటాయి. మొత్తానికి చూసుకుంటే కాంగ్రెస్‌, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొందని, ఏ పార్టీ కూడా సొంతంగా మెజారిటీ మార్క్‌ను దాటే అవకాశాలు అంతగా లేవని సర్వేలు చాటుతున్నాయి. కర్ణాటక అసెంబ్లీలో 224 స్థానాలు ఉండగా.. 222 స్థానాలకు తాజాగా ఎన్నికలు జరిగాయి. ఈ నెల 15న ఈ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

సర్వేలు ఏమంటున్నాయి.
ఎన్నికలకు ముందు వెలువరించిన పలు సర్వేల్లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొని ఉందని, అధికార కాంగ్రెస్‌ పార్టీ కొద్దిగా పైచేయి సాధిస్తుందని, ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఛరిష్మా పనిచేస్తుందని పలు సర్వేలు అంచనా వేశాయి. ఇక పోలింగ్‌ ముగిసిన తర్వాత వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల్లో టైమ్స్‌ నౌ, ఇండియాటుడే, పీపుల్స్‌ పల్స్‌ సర్వేలు ఇదే విషయాన్ని చాటాయి. టైమ్స్‌ నౌ సర్వేలో కాంగ్రెస్‌ పార్టీకి 90 నుంచి 103 సీట్లు, బీజేపీకి 80 నుంచి 93 సీట్లు, జేడీఎస్‌కు 31 నుంచి 33 సీట్లు వచ్చే అవకాశముందని తేలింది. ఇండియాటుడే సర్వే కాంగ్రెస్‌కు 106-118 స్థానాలు, బీజేపీకి 79-92 స్థానాలు, జేడీఎస్‌కు 22-30 స్థానాలు వచ్చే అవకాశముందని పేర్కొంది. పీపుల్స్‌ సర్వేలో కాంగ్రెస్‌కు 93-103 సీట్లు, బీజేపీకి 83-93 సీట్లు, జేడీఎస్‌కు 33-43 సీట్లు వస్తాయని తేలింది.  

మెజారిటీ సర్వేల్లో బీజేపీదే పైచేయి..
రిపబ్లిక్‌ టీవీ, న్యూస్‌ ఎక్స్‌ సహా ఇతర సర్వేల్లో బీజేపీ పైచేయి కనిపించింది. రిపబ్లిక్‌ టీవీ సర్వేలో బీజేపీకి 95-114 సీట్లు, కాంగ్రెస్‌కు 73-83 సీట్లు, జేడీఎస్‌కు 32-43 సీట్లు వస్తాయని తేలింది. న్యూస్‌ ఎక్స్‌ సర్వేలో బీజేపీకి 102-110 సీట్లు, కాంగ్రెస్‌కు 72-78సీట్లు, జేడీఎస్‌కు 35-39 సీట్లు వస్తాయని అంచనా వేశారు. సీఎన్‌ఎక్స్‌ ఎగ్జిట్‌ పోల్స్‌లో బీజేపీకి 106, కాంగ్రెస్‌కు 75, జేడీఎస్‌కు 37 సీట్లు వస్తాయని పేర్కొంది. న్యూస్‌ నేషన్‌ ఎగ్జిట్‌ పోల్స్‌లో కాంగ్రెస్‌కు 71-75, బీజేపీకి 105-109, జేడీఎస్‌కు 36-40 సీట్లు వస్తాయని తేలింది. దిగ్విజయ్‌ న్యూస్‌ ఎగ్జిట్‌ పోల్స్‌లో కాంగ్రెస్‌కు 76-80, బీజేపీకి 103-107, జేడీఎస్‌కు 31-35 సీట్లు వస్తాయని పేర్కొంది. సీ ఓటర్‌ ఎగ్జిట్‌ పోల్స్‌లో బీజేపీకి 103, కాంగ్రెస్‌ 93, జేడీఎస్‌కు 25 సీట్లు రాగా, ఏబీపీ-సీఎస్‌డీఎస్‌ ఎగ్జిట్‌ పోల్స్‌లో బీజేపీకి 89-95, కాంగ్రెస్‌కు 85-91, జేడీఎస్‌కు 32-38 సీట్లు వస్తాయని తేలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement