వారసులే.. వారసులు

Heirs Entry in Political Parties This Lok Sabha Election - Sakshi

కాంగ్రెస్, బీజేపీల నుంచి పలువురు..

‘మహారాష్ట్ర’ బరిలో 35 కుటుంబాల నుంచి..

ముంబై : కాంగ్రెస్‌ పార్టీ పేరు చెబితే చాలు.. అది నెహ్రూ, గాంధీ కుటుంబ పార్టీ అనే విమర్శలు వినపడతాయి. వాస్తవం ఏమిటంటే.. ఈ దేశంలోని రాజకీయ పార్టీల్లో అత్యధికం ఇలాంటివే. అమిత్‌ షా నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. మహారాష్ట్రనే ఉదాహరణగా తీసుకుంటే.. దాదాపు 35 కుటుంబాల వారసులు ఇక్కడి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. పార్థ్‌ పవార్, డాక్టర్‌ సుజయ్‌ విఖే పాటిల్‌ ఏకంగా మూడోతరం రాజకీయ వారసులు. మరాఠా దిగ్గజం, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌కు పార్థ్‌ మనవడు కాగా.. అటల్‌ బిహారీ వాజ్‌పేయి కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన బాలాసాహెబ్‌ విఖే పాటిల్‌కు మనవడు సుజయ్‌. అంతేకాదు.. సుజయ్‌ తండ్రి, కాంగ్రెస్‌ నేత రాధాకృష్ణ విఖే పాటిల్‌ మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కూడా. ఆసక్తికరమైన అంశం ఇంకోటి ఏమిటంటే.. పార్థ్‌ కోసం శరద్‌ పవార్‌ తాను ఎన్నోసార్లు పోటీ చేసిన మాధా నియోజకవర్గాన్ని వదులుకోవడం. ఈసారి తాను పోటీ చేయడం లేదని ప్రకటించడం. ఏకకాలంలో ముగ్గురు పవార్‌లు పోటీలో ఉండటం ఓటర్లకు తప్పుడు సంకేతాలు పంపుతుందన్న అంచనాతో శరద్‌ పవార్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే బీజేపీ, శివసేన ఈ నిర్ణయాన్ని కూడా తప్పు పడుతుండటం గమనార్హం. సీనియర్‌ పవార్‌ బరిలోంచి తప్పుకోవడంతో ఇప్పుడు పార్థ్‌ పుణే జిల్లాలోని మవాల్‌ స్థానం నుంచి పోటీ చేస్తుండగా.. శరద్‌ పవార్‌ కుమార్తె సుప్రియా సూలే బారామతి నుంచి మరోసారి పోటికి దిగారు.

సుజయ్‌ చుట్టూ డ్రామా
కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన డాక్టర్‌ సుజయ్‌ విఖే పాటిల్‌ చుట్టూ బోలెడంత డ్రామా నడిచింది. పశ్చిమ మహారాష్ట్రలోని అహ్మద్‌ నగర్‌ నుంచి ఈయన బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు రెండు నెలల ముందు నుంచి మహారాష్ట్ర సీనియర్‌ మంత్రి గిరీశ్‌ మహాజన్‌ ద్వారా సుజయ్‌తో టచ్‌లో ఉన్న బీజేపీ చివరకు ఆయన్ను తమ వైపునకు తిప్పుకోగలిగింది. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన తరువాత ఈ న్యూరోసర్జన్‌ డాక్టర్‌ తండ్రి అయిన రాధాకృష్ణ విఖే పాటిల్‌ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలని సొంత పార్టీ నేతల నుంచి ఒత్తిడి వచ్చింది. అయితే రాధాకృష్ణ వీటికి లొంగలేదు. మరోవైపు మాధా స్థానం విషయంలో మోహితే పాటిల్‌ కుటుంబంలో పెద్ద యుద్ధమే నడిచింది. పోటీ చేయడం లేదని ప్రకటించిన తరువాత ‘మాధా’ నుంచి తన సన్నిహితుడు విజయ్‌ సిన్హ్‌ పాటిల్‌ పోటీ చేయాలని శరద్‌పవార్‌ ఆదేంచారు. అయితే ఇంతలోనే విజయ్‌ సిన్హ్‌ కుమారుడు రంజిత్‌ సిన్హ్‌ మోహితే పాటిల్‌ తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించేశారు. ఎన్సీపీ తనకు ఎలాగూ సీటు ఇవ్వదని తీర్మానించుకున్న రంజిత్‌ సిన్హ్‌ మార్చి 20న బీజేపీలో చేరిపోయాడు. కానీ.. బీజేపీ రంజిత్‌ సిన్హ్‌ మోహితే పాటిల్‌ స్థానంలో రంజిత్‌ సిన్హ్‌ నాయక్‌ నింబాల్కర్‌కు మాధా టికెట్‌ ఇచ్చింది. ఈ నింబాల్కర్‌ గత వారమే కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరారు. దీంతో ఎన్సీపీ మాధా నుంచి మాజీ ఎమ్మెల్యే, షోలాపూర్‌ జిల్లా పరిషత్‌ అధ్యక్షుడు బాబూరావు షిండే తమ్ముడు సంజయ్‌ షిండేను బరిలోకి నిలిపింది.

శివాజీ వారసులు..చవాన్‌.. ముండేలూ
∙మహారాష్ట్ర ఎన్నికల బరిలో నిలిచిన బోలెడన్ని ఇతర రాజకీయ కుటుంబాల్లో చవాన్, ముండేలతోపాటు ఛత్రపతి శివాజీ వారసులూ ఉన్నారు. 16వ లోక్‌సభలో సతారాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉదయన్‌రాజే భోసాలే ఛత్రపతి శివాజీ వారసుడు.. 13వ ఛత్రపతిగానూ ఉన్నారు. ఈసారి కూడా ఆయన సతారా నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. కొల్హాపూర్‌ నుంచి శివసేన టికెట్‌పై పోటీ చేస్తున్న సంజయ్‌ మాండలిక్‌ స్వతంత్ర సభ్యుడు సదాశివరావ్‌ మాండలిక్‌ కుమారుడు. మాజీఎమ్మెల్యే అన్నాసాహెబ్‌ పాటిల్‌ కుమారుడు నరేంద్ర పాటిల్‌ను శివసేన సతారా నుంచి బరిలోకి దింపింది.

మరాఠ్వాడ ప్రాంతంలోని నాందేడ్‌ నుంచి బరిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌.. మాజీ కేంద్రమంత్రి ఎస్‌.బి.చవాన్‌ కుమారుడన్న సంగతి తెలిసిందే. 1952 నుంచి నాందేడ్‌లో ఎక్కువసార్లు కాంగ్రెస్‌ గెలుపొందుతూ వస్తోంది. ఎస్‌.బి.చవాన్‌ రెండుసార్లు ప్రాతినిధ్యం వహించగా.. అశోక్‌ చవాన్‌ కూడా 1987 ఉప ఎన్నికల్లో ఈ స్థానం నుంచి గెలుపొందారు. ఎస్‌.బి.చవాన్‌ అల్లుడు అశోక్‌ చవాన్‌ బావ అయిన భాస్కర్‌రావ్‌ ఖటగావ్‌కర్‌ 1998, 1999, 2009లో నాందేడ్‌ నుంచి ఎంపీగా గెలుపొందారు. 2014లో అశోక్‌ చవాన్‌ మరోసారి ఇక్కడి నుంచి గెలుపొందారు.

బీడ్‌ స్థానంలో బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తున్న ప్రీతమ్‌ ముండే దివంగత బీజేపీ నేత గోపీనాథ్‌ ముండే కుమార్తె. ప్రీతమ్‌కు ప్రత్యర్థి కూడా ముండే కుటుంబానికి చెందిన వారే కావడం ఇక్కడ ఆసక్తికరం. ప్రీతమ్‌ సోదరి, మహారాష్ట్ర మంత్రి పంకజా ముండేకు తమ్ముడి వరసైన ధనుంజయ్‌ ముండే ఎన్సీపీ తరఫున ప్రీతమ్‌కు ప్రత్యర్థిగా ఉన్నారిక్కడ. గోపీనాథ్‌ ముండే బతికుండగానే ధనంజయ్‌ తిరుగుబాటు చేసి ఎన్సీపీలో చేరిపోయారు. విధాన పరిషత్‌లో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. ప్రీతమ్‌ ముండేకు దగ్గరి బంధువు, దివంగత బీజేపీ నేత ప్రమోద్‌ మహాజన్‌ కుమార్తె పూనమ్‌ మహాజన్‌ ముంబై నార్త్‌ సెంట్రల్‌ నుంచి పోటీ చేస్తున్నారు.

ఒస్మానాబాద్‌లో ఎన్సీపీ తరఫున రాణా జగజీత్‌ సిన్హ్‌ పాటిల్‌ తన సమీప బంధువు శివసేన అభ్యర్థి ఒమ్‌ రాజే నింబాల్కర్‌తో పోటీ పడుతున్నారు. జగజీత్‌ మహారాష్ట్ర సీనియర్‌ మంత్రి, శరద్‌ పవార్‌ దగ్గరివాడైన పదమ్‌సిన్హ్‌ పాటిల్‌ కుమారుడు. 2006లో జరిగిన కాంగ్రెస్‌ నేత పవన్‌రాజె నింబాల్కర్‌ హత్య కేసులో పదమ్‌ సిన్హ్‌ నిందితుడు కాగా.. సేన అభ్యర్థి ఓమ్‌రాజే నింబాల్కర్‌ పవన్‌ రాజే కుమారుడే.

నాసిక్‌లో సీనియర్‌ ఎన్సీపీ నేత ఛగన్‌ భుజ్‌బల్‌ సమీప బంధువు సమీర్‌ భుజ్‌బల్‌ మాజీ ఎంపీ రాజాబహూ గాడ్సే అల్లుడు హేమంత్‌ గాడ్సే పోటీపడుతున్నారు. కల్యాణ్‌ స్థానంలో ఎక్‌నాథ్‌ షిండే.. వాధా నుంచి చారులతా టోకాస్, ముంబై నుంచి ప్రియాదత్, మిలింద్‌ దేవరా, థానే నుంచి ఆనంద్‌ పరాంజపేతోపాటు ఇంకొందరు కూడా రాజకీయ కుటుంబ వారసత్వం ఆధారంగానే ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

టి.ఎన్‌.రఘునాథ
(రచయిత, ముంబై కేంద్రంగా పనిచేస్తున్న సీనియర్‌ జర్నలిస్టు. మహారాష్ట్ర రాజకీయాలను మూడు దశాబ్దాలుగా పరిశీలిస్తున్నారు. ‘ద ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’, ‘ద పయనీర్‌’, ‘ద ఫ్రీ ప్రెస్‌ జర్నల్‌’, ‘ద బ్లిట్జ్‌’, ‘న్యూస్‌టైమ్‌’ దినపత్రికల్లో పనిచేశారు)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top