మార్పు సరే..జై కొట్టేదెవరికి? 

Congress is unable to gain public confidence in Madhya Pradesh - Sakshi

బీజేపీకి కాంగ్రెస్‌ సరైన ప్రత్యామ్నాయమేనా? 

మధ్యప్రదేశ్‌ ఓటర్లలో హస్తంపై అనుమానాలు 

ప్రజల విశ్వాసం పొందలేకపోతున్న కాంగ్రెస్‌ 

మధ్యప్రదేశ్‌  – రౌండప్‌

మధ్యప్రదేశ్‌లో మార్పు తథ్యమని కాంగ్రెస్‌ పార్టీ నినదిస్తోంది. మామగా తనకంటూ రాష్ట్ర ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న శివరాజ్‌ను ఢీకొట్టి తమ పార్టీ గద్దె నెక్కుతామని ధీమాగా చెబుతోంది. అయితే.. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీపై సహజంగానే వచ్చే వ్యతిరేకతను కాంగ్రెస్‌ తమకు అనుకూలంగా మార్చుకోగలదా? అన్నదే ప్రశ్న. ఓటర్లు కూడా మార్పు కోరుకుంటున్నట్లయితే.. ఆ మార్పు కాంగ్రెస్సేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు వల్ల తలెత్తిన ఇబ్బందులు, 15 ఏళ్లుగా ఒకే ప్రభుత్వాన్ని చూడటం వంటివి సహజంగా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగేందుకు సరిపోతాయి. కానీ మధ్యప్రదేశ్‌లో ప్రజలు ఈ పరిస్థితుల్లోనూ ఏకపక్షంగా కాంగ్రెస్‌కు ఓటువేసేలా కనిపించడం లేదు. దీనికి కారణం ఆ పార్టీలో నెలకొన్న అంతర్గత సమస్యలే. కాంగ్రెస్‌ అధిష్టానం ఈ సమన్వయ లోపాన్ని అరికట్టలేకపోతోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినప్పట్నుంచి కాంగ్రెస్‌ ఈ గడ్డు పరిస్థితుల్నే ఎదుర్కొంటోంది. వరçసపెట్టి ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతూ ఉండడంతో దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన నైరాశ్యం ఆవహించింది. 

కాంగ్రెస్‌ సీఎం ఎవరు? 
ఓటర్లు మధ్యప్రదేశ్‌లో మార్పు కోరుకుంటున్నారనే వార్తల్లో వాస్తవం లేకపోలేదు. కానీ.. ఆ మార్పు కాంగ్రెస్‌కి అధికారం కట్టబెట్టడమేనని వారు భావించడం లేదని పరిశీలకులు అంటున్నారు. గతంలో దిగ్విజయ్‌ సింగ్‌ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అనుభవాలను ఇప్పటికీ ఓటర్లు మరిచిపోలేదని, కాంగ్రెస్‌ను గద్దెకెక్కిస్తే మళ్లీ అవే పరిస్థితులు వస్తాయనే భయం వారిని వెంటాడుతోందని కాంగ్రెస్‌ నాయకులే పేర్కొనడం ఇందుకు తార్కాణం. ‘బీజేపీకి ఓటేస్తే శివరాజ్‌ సీఎం అవుతారని అవుతారని మాకు తెలుసు. మరి కాంగ్రెస్‌కు ఓటేస్తే సీఎం ఎవరో మాకే తెలియదు. ఇంకా ప్రజలకు ఏం నమ్మకం ఉంటుంది’ అని కాంగ్రెస్‌ నేతలే అంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థిని ప్రకటించి ఉంటే.. గెలిచే అవకాశాలు మెండుగా ఉండేవని రాజకీయ విశ్లేషకులంటున్నారు. ‘సింధియా గుణ, గ్వాలియర్‌కే పరిమితం, కమల్‌నాథ్‌ చింద్వారా సంగతే చూస్తారు. రాష్ట్రం మొత్తానికి నాయకుడంటూ కాంగ్రెస్‌లో ఎవరూ లేరు. అలాంటప్పుడు వారికెందుకు ఓటేయాల’ నే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. 

బీజేపీకి ఆరెస్సెస్‌ అండ 
బీజేపీ మాతృ సంస్థ ఆరెస్సెస్‌ రాష్ట్రంలో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలకు వెళ్లి వాళ్ల కష్టసుఖాలు ఆరాతీస్తోంది. చేతనయిన సాయం చేస్తోంది. ఇదంతా ఈ ఎన్నికలను పెట్టుకుని చేస్తున్న పనికాదు. దశాబ్దానికి పైగా ఆరెస్సెస్‌ పలు ప్రాంతాల్లో చేపడుతున్న పనుల కారణంగానే బీజేపీకి గణనీయమైన ఓటుబ్యాంకు సిద్ధౖమైంది. కాంగ్రెస్‌కు ఈ రకమైన చేయూత లభించడం లేదు. కాంగ్రెస్‌ పార్టీకి కూడా పేరుకు సేవాదళ్, యూత్‌ కాంగ్రెస్‌ వంటి అనుంబంధ సంస్థలున్నా అవి ఆరెస్సెస్‌ స్థాయిలో పని చేయలేవని కాంగ్రెస్‌ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.  

చౌహాన్‌ కరిజ్మాపైనే.. 
సీఎంగా చౌహాన్‌కున్న వ్యక్తిగత ఇమేజ్‌ను నమ్ముకునే బీజేపీ ఈ ఎన్నికల్లో సమరశంఖం పూరించింది. ఆయన కూడా ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్రమంతా కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ 55ఏళ్లలో చేయలేనిది తాము 15 ఏళ్లలోనే చేశామని, విద్యుత్‌ సమస్యను పూర్తిగా పరిష్కరించామని, 77 లక్షల మంది విద్యుత్‌ బిల్లుల్ని మాఫీ చేశామని గుర్తు చేస్తున్నారు. బీమారు రాష్ట్రాల జాబితా నుంచి రాష్ట్రాన్ని బయటకు తెచ్చామన్నారు. నిరంతరాయ విద్యుత్, గ్రామీణ ప్రాంతాలకు రహదారులన్నీ తమ ఘనతగా చెబుతున్నారు.

కాంగ్రెస్‌ గెలవాలంటే .. 
గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 58 సీట్లలో నెగ్గింది. ఈ సారి అధికార పీఠం దక్కాలంటే ముందుగా సిట్టింగ్‌ స్థానాలను కాపాడుకోవాలి. అది కత్తి మీద సామే. ఎందుకంటే గత ఎన్నికల్లో స్వల్ప తేడాతోనే కాంగ్రెస్‌ అక్కడ గెలిచింది. బీజేపీ గత ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీపై సగటున 7.5%ఓట్ల మెజార్టీతో నెగ్గింది. ఇప్పుడు ఆ అదనపు ఓట్లను కాంగ్రెస్‌ తనవైపు లాక్కోగలగాలి. అలా బీజేపీ సిట్టింగ్‌ స్థానాల్లో కనీసం 58 చోట్ల ఓట్లను కొల్లగొట్టగలిగితే మేజిక్‌ ఫిగర్‌ 116కి కాంగ్రెస్‌ చేరుకోగలుగుతుంది. బీజేపీ నుంచి 4–5 శాతం ఓట్లను రాబట్టుకుంటేనే కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుంది. 

విసిగిపోయాం నిజమే.. కానీ! 
రాష్ట్రంలో బీజేపీకి కాంగ్రెస్‌ సరైన ప్రత్యామ్నాయం కాదని పలువురు భావిస్తున్నారు. ఓటర్లు బీజేపీతో విసిగిపోయారు నిజమే. అయితే కాంగ్రెస్‌ గత ప్రభుత్వాలు వ్యవహరించిన తీరును గుర్తుచేసుకుంటే వారికి ఓట్లేయడం కష్టమేనని మందసౌర్‌లోని కొందరు రైతులు పేర్కొన్నారు. దిగ్విజయ్‌ హయాంలో పడ్డ కరెంటు కష్టాలు ఇప్పటీకి మరిచిపోలేకపోతున్నామని వారంటున్నారు. ఈ వాదనతో పార్టీ శ్రేణులు కూడా లోపాయికారీగా ఏకీభవిస్తున్నాయి. 

బీజేపీ సమస్యలు 
- పదిహేనేళ్లు అధికారంలో ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేకత 
ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో అందుబాటులో లేకపోవడం 
కనీస మద్దతు ధర విషయంలో రైతుల్లో ఆగ్రహం 
ఎస్సీ, ఎస్టీ చట్టానికి చేసిన సవరణలపై ప్రజలకు వివరించలేకపోవడం 
నిరుద్యోగం, పెట్టుబడులు అనుకున్న స్థాయిలో లేకపోవడం 
మౌలిక సదుపాయాల లోటు 
    బీజేపీ బలాలు 
మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు గాను 2013 ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 165 స్థానాల్లో గెలవడం. 
వాటిలో 91 స్థానాల్లో ప్రత్యర్థి పార్టీల కంటే 10% ఓట్ల మెజార్టీ సాధించడం 
అతి పెద్ద ప్రాంతమైన మాల్వాలో ఏకంగా 46 సీట్లు గెలవడం 
ఇతర పార్టీల ఓట్లు చీలిపోవడం వల్ల 73 స్థానాల్లో జయకేతనం. 

శివరాజ్‌ సింగ్‌ (బీజేపీ)
బలాలు – ప్రజలతో మమేకం కావడం, అవిశ్రాంత శ్రామికుడిగా గుర్తింపు, స్త్రీలకు రైతులకు సంక్షేమ పథకాలు.  
బలహీనతలు – ప్రభుత్వ వ్యతిరేకత, వ్యాపమ్‌ కుంభకోణం, కుటుంబ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు.

 బుద్నీ నుంచి పోటీ. 
కమల్‌నాథ్‌ (కాంగ్రెస్‌)
బలాలు – పార్టీకి అవసర నిధులను అందించగల సత్తా, అపార అనుభవం ఉన్న రాజకీయ వ్యూహకర్త.  
బలహీనతలు – రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ చురుగ్గా లేకపోవడం, పేదల వ్యతిరేకి అన్న ముద్ర.  
జ్యోతిరాదిత్య సింధియా (కాంగ్రెస్‌)
బలాలు – 44% యువఓటర్లను ఆకర్షించే కరిజ్మా, మచ్చలేని ఇమేజ్, తండ్రి వారసత్వం.  
బలహీనతలు – రాజకుటుంబీకుడిగా ముద్ర, దిగ్విజయ్‌ సింగ్‌తో అంతర్గత విబేధాలు. 

ఒపీనియన్‌ పోల్స్‌ ఏమంటున్నాయ్‌
- అక్టోబర్‌ మొదటి వారంలో ఒపీనియన్‌ పోల్స్‌ అంచనాలు: బీజేపీ 115, కాంగ్రెస్‌ 105, ఇతరులు 10 
నవంబర్‌ మొదటి వారంలో ఒపీనియన్‌ పోల్స్‌ అంచనాలు: బీజేపీ 115–125, కాంగ్రెస్‌ 90–100, ఇతరులు 5–15. 
సీఎం అభ్యర్థిగా శివరాజ్‌ చౌహాన్‌కే పట్టంగట్టిన 40% మంది ఓటర్లు

బరిలో ముఖ్యులు: 
బీజేపీ– యశోధరరాజె సింధియా, ఉషా ఠాకూర్, ఫాతిమా రసుల్‌ అబ్దుల్, ఆకాశ్‌ విజయ్‌ వర్గీయ, కృష్ణ గౌర్‌.  
కాంగ్రెస్‌ – అరీఫ్‌ అకీల్, సంజయ్‌ సింగ్‌ మసానీ, జైవర్ధన్‌ సింగ్, అరుణ్‌ యాదవ్‌. 

వయా బుందేల్‌ఖండ్‌..! 
మధ్యప్రదేశ్‌లో మాయావతి వ్యూహం 
ఈసారి మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటడం ద్వారా.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కీలకంగా మారాలని బీఎస్పీ భావిస్తోంది. ఈ ఎన్నికల్లో మెజార్టీ రాకున్నా, కనీసం కింగ్‌మేకర్‌ స్థాయిలోనైనా ఉండాలని ఆ పార్టీ చీఫ్‌ మాయావతి ఆశిస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో, ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ పరాజయాల అనంతరం పార్టీ ఇప్పుడిప్పుడే ఊపిరి తీసుకుంటోంది. ఈ సమయంలో మధ్యభారతంలో తన పట్టును నిరూపించుకోవడం ద్వారా పునరుజ్జీవమవ్వాలని మాయావతి ఆశపడుతోంది. అందుకే మాయావతి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేస్తున్నా.. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతాల్లోని బుందేల్‌ఖండ్‌పై పట్టుకోసం చెమటోడుస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువ సీట్లు సంపాదించగలిగితే బీజేపీ, కాంగ్రెస్‌తో బేరాలాడే శక్తి వస్తుందని మాయావతి అంచనా. 

 ఆ ప్రాంతమే ఎందుకు? 
బీఎస్పీ ప్రధాన కార్యక్షేత్రం ఉత్తరప్రదేశ్‌. ఈ రాష్ట్రంలో పార్టీ అధికారంలో కూడా ఉంది. సాధారణంగా పార్టీ బలంగా ఉన్నరాష్ట్రానికి సరిహద్దులో ఉన్న ప్రాంతాల్లో సదరు పార్టీ ప్రభావం కనిపిస్తుంటుంది. బుందేల్‌ఖండ్, చంబల్, వింధ్య ప్రాంతాలు అటు యూపీ, మధ్యప్రదేశ్‌ల సరిహద్దుల్లో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల జనాభా ఎక్కువ. ఈ ప్రాంతంలో మొదట్నుంచీ బీఎస్పీకి కాస్తంత పట్టుంది. ఈ దఫా తన ప్రభావాన్ని మరింత బలోపేతం చేసుకొని ఈ ప్రాంతంలో మెజార్టీ సీట్లు పొందాలని బీఎస్పీ భావిస్తోంది. ‘బుందేల్‌ఖండ్‌ మీదుగా భోపాల్‌కు’ అనే నినాదంతో ఈ ప్రాంతంలో మద్దతు పొందేందుకు యత్నిస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top