అద్భుతాలు సాధించాం | CM Chandrababu says that Wonders have been achieved | Sakshi
Sakshi News home page

అద్భుతాలు సాధించాం

Jun 15 2018 3:22 AM | Updated on Aug 14 2018 11:26 AM

CM Chandrababu says that Wonders have been achieved - Sakshi

సాక్షి, అమరావతి:  కేంద్ర ప్రభుత్వ సహాయ నిరాకరణను తట్టుకుని గత నాలుగేళ్లలో అద్భుతాలు సాధించామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోందని, అయినా సరే ప్రగతి సాధించామని అన్నారు. ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్‌ పాలనా మండలి సమావేశాలకు హాజరు కానున్న సీఎం గురువారం సచివాలయంలో అధికారులతో సన్నాహక భేటీ నిర్వహించారు. సమాఖ్య స్ఫూర్తి ఏమైంది? ప్రధానమంత్రి మోదీ చెప్పిన టీమ్‌ ఇండియా స్పిరిట్‌ ఏమైందని ప్రశ్నించారు. అవరోధాలు, ఆటంకాలను తట్టుకుని సుస్థిరంగా అభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రాల పట్ల కేంద్రం ఉదాసీనంగా, కక్ష సాధింపు తరహాలో వ్యవహరించడం వాంఛనీయం కాదన్నారు.  చెప్పినవి చేయండి, ఇస్తామన్నవి ఇవ్వండని కేంద్రాన్ని కోరతామని వెల్లడించారు.

20,000 ఎకరాలకు మినహాయింపు  
కొల్లేరు సరస్సులో మూడో కాంటూరు నుంచి ఐదో కాంటూరు వరకు ఉన్న జిరాయితీ, డి పట్టా భూములను కొల్లేరు  అభయారణ్యం పరిధి నుంచి మినహాయిస్తామని సీఎం తెలిపారు. 5,600 ఎకరాల డి పట్టా భూములు, 15 వేల ఎకరాల పట్టా (జిరాయితీ) భూములను అభయారణ్య పరిధి నుంచి మినహాయిస్తున్నట్లు చెప్పారు. కొల్లేరు సరస్సు నుంచి జిరాయితీ, పట్టా భూముల మినహాయింపు, సరస్సు పరిరక్షణ, డ్రైనేజీల ఆధునికీకరణ, పర్యాటకాభివృద్ధి తదితర అంశాలపై ప్రజాప్రతినిధులు, అధికారులు గురువారం సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. తాజా నిర్ణయం వల్ల ప్రస్తుతం మూడో కాంటూరు నుంచి ఐదో కాంటూరు వరకు సుమారు 78,000 ఎకరాల్లో విస్తరించిన కొల్లేరు సరస్సు 58,000 ఎకరాలకు పరిమితమవుతుందని, తద్వారా ఈ ప్రాంతంలో స్థానికులకు ఇబ్బందులు తొలుగుతాయని అధికారులు సీఎంకు వివరించారు. 

నిత్యావసరాల పంపిణీలో లోపాలున్నాయ్‌  
ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి, ప్రజల్లో సంతృప్తి స్థాయిని పెంచాలని సీఎం పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. ప్రజాపంపిణీ వ్యవస్థ పనితీరుపై సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు. రహదారుల పనులు జరిగే ప్రదేశంలో అధికారులెవరూ లేకపోవడంపై సీఎం మండిపడ్డారు. ఇలాగైతే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని హెచ్చరిం  చారు. రహదారులపై చంద్రబాబు తొలిసారిగా గురువారం పర్చువల్‌ ఇన్‌స్పెక్షన్‌ నిర్వహించారు. చినపాలెం నుంచి వల్లభాపురం వెళ్లే రహదారిలో పైపులైన్‌ వేయకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఈ పనులు చేసిన కాంట్రాక్టర్, సంబంధిత అధికారులపై చర్య తీసుకోవాల్సి వస్తుం దన్నారు. సంబంధిత జేఈని సస్పెండ్‌ చేస్తున్నామని, ఇఎన్‌సీతో విచారణ జరిపించి నిర్లక్ష్యం నిజమైతే కఠిన చర్యలు తీసుకుంటానన్నారు. విజయవాడ స్వరాజ్య మైదానం వద్ద చెత్త డంపింగ్‌పై వర్చువల్‌ ఇన్‌స్పెక్షన్‌లో సీఎం మండిపడ్డారు. అక్కడ విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిని సస్పెండ్‌ చేస్తున్నామని చెప్పారు. 

బీజేపీ– వైఎస్సార్‌సీపీ డ్రామాలు బహిర్గతం
రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌సీపీ, బీజేపీ కలిసి ఆడుతున్న నాటకాలు మరోసారి బయటపడ్డాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌సీపీ బీజేపీ అడుగులో అడుగువేస్తోందని, ఇందులో భాగంగానే బీజేపీ పెద్దలతో ఆ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి సమావేశమయ్యారన్నారు. గురువారం చిత్తూరు జిల్లా కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాజీనామాల విషయంలో పక్క ప్లాన్‌తో ఇరుపార్టీలు నాటకాలు ఆడాయన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఏకపక్షం కావాలని పిలుపు ఇచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement