‘జగన్‌ పాదయాత్రపై ప్రభుత్వం కుట్ర’

Chandrababu plot to stop Jagan Padayatra, says Dharmana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ ప్రతిపక్ష నాయకుడు, తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ నెల 6 నుంచి తలపెట్టిన పాదయాత్రను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. ‘ప్రజా సంకల్పం’ యాత్రకు ఆటంకాలు కల్పించేందుకు టీడీపీ ప్రయత్నిస్తున్నట్టుగా కనబడుతోందన్నారు. గురువారం వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రతిపక్ష నేతగా ప్రజల్లోకి వెళ్లే హక్కు జగన్‌కు ఉందన్నారు. ప్రజలను చైతన్యపరచడం ప్రతిపక్షంగా తమ బాధ్యతని పేర్కొన్నారు. టీడీపీ మితిమీరిన వ్యవహారాలు చేస్తోందని, పాదయాత్రను అడ్డుకోవాలనుకోవడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు.

సీఎం చంద్రబాబు స్థాయి మరిచి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. విపక్ష సభ్యులు మంత్రులుగా ఉన్న ఏకైక ప్రభుత్వం చంద్రబాబుదేనని దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ఇప్పటివరకు 2 వేల రహస్య జీవోలు విడుదల చేసిందని తెలిపారు. రాజ్యాంగ ఉల్లంఘనలతో వ్యవస్థలను చంద్రబాబు భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. శాసనసభలో మాట్లాడనీయకుండా ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారని, ఇలాంటి సందర్భంలో ప్రజలను జాగృతం చేయాల్సిన బాధ్యత విపక్షానిదేనని అన్నారు. 6 నెలల పాటు జరిగే పాదయాత్రలో ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని, అక్రమాలను, చట్టవ్యతిరేక చర్యలను ప్రజలకు వైఎస్‌ జగన్‌ వివరిస్తారని చెప్పారు.  జననేత అందరినీ కలుస్తారని, పాదయాత్రకు అందరూ సహకరించాలని ధర్మాన ప్రసాదరావు కోరారు.  

 జగన్‌ పాదయాత్రపై ప్రభుత్వం కుట్రలు చేస్తోంది 

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top