రూ. 3 లక్షల 62 వేల కోట్ల అప్పు భారం : బుగ్గన | Sakshi
Sakshi News home page

ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల

Published Wed, Jul 10 2019 4:54 PM

Buggana Rajendranath Reddy Releases White Paper On State Finance Position - Sakshi

సాక్షి, అమరావతి : విభజన తర్వాత ప్రజలు ఆశించినంతగా పరిపాలన జరుగలేదని ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అన్నారు. జాతీయ సగటుతో ఆంధ్రప్రదేశ్‌ స్థూల ఉత్పత్తి తక్కువేనని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆయన బుధవారం శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ...ఏపీలో వినియోగ ద్రవ్యోల్బణం భారీగా పెరిగిందని తెలిపారు. గత ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో పెద్ద ఎత్తున అప్పులు చేసిందని.. ప్రస్తుతం ఆ అప్పులు రాష్ట్రానికి భారంగా మారాయని పేర్కొన్నారు. మొత్తంగా రాష్ట్రంపై 3 లక్షల 62 వేల కోట్ల రూపాయల అప్పు భారం మోపారన్నారు. తమ ప్రభుత్వం మానవ వనరులపై దృష్టి సారించి వారిపైనే ఎక్కువ పెట్టుబడి పెట్టాలనే యోచనలో ఉందన్నారు. 

రెవెన్యూ లోటు రూ. 66 వేల కోట్లు
‘2014-17 మధ్య రాష్ట్రంలో 5 శాతం వృద్ధిరేటు మాత్రమే నమోదైంది. ద్రవ్యోల్బణం జాతీయస్థాయిలో తగ్గింది. కానీ, ఏపీలో మాత్రం వినియోగ ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం రాష్ట్ర జీడీపీలో 3 శాతం దాటి అప్పులు చేయకూడదు. కానీ టీడీపీ ప్రభుత్వం ఆ పరిమితిని దాటి అప్పులు చేసింది. పన్ను రూపంలో వచ్చే ఆదాయం పరంగా చూసినట్లైతే తెలంగాణ కంటే మనం బాగా వెనుకబడి ఉన్నాం. మౌలిక రంగాల్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టలేదు. రాష్ట్ర రెవెన్యూ లోటు 66 వేల కోట్ల రూపాయలకు పెరిగింది. తెలంగాణకు వచ్చినంతగా మనకు పన్ను ఆదాయం రావడం లేదు’ అని బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి పేర్కొన్నారు.

వృద్ధిరేటు ఎలా పెరిగినట్లు?
‘వ్యవసాయరంగంలో 1999- 2004 మధ్య కాలంలో 3.66 శాతం వృద్ధిరేటు ఉంది. 2004- 2009 మధ్య ఐదేళ్ల కాలంలో 6.14 శాతం నమోదైంది. కానీ గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగ స్థూల ఉత్పత్తి తగ్గింది. చేపల, గొర్రెల పెంపకాల్లో వృద్ధిరేటు పెరిగిందనీ.. వ్యవసాయ రంగంలో వృద్ధిరేటు సాధించామంటూ అంచనాలు తయారు చేశారు. చేపల పెంపకం పెరిగినంతమాత్రాన వ్యవసాయ వృద్ధి రేటు ఎలా పెరుగుతుంది’ అని బుగ్గన ప్రశ్నించారు.

మానవ వనరుల అభివృద్ధిపై దృష్టి
‘గత ప్రభుత్వం ప్రత్యేక హోదాను నీరుగార్చి ప్యాకేజీని ఆహ్వానించింది. ప్యాకేజీ ద్వారా చంద్రబాబు సర్కారు సాధించిందేమీ లేదు. ఎన్నికలకు ముందు కాంట్రాక్టర్ల బిల్లులను మాత్రమే చెల్లించారు. నియమ నిబంధనలు విరుద్ధంగా ప్రభుత్వ రంగ సంస్థలు రుణ సేకరణ చేశాయి. వివిధ కార్పోరేషన్లకు రూ. 18 వేల కోట్ల బకాయిలు మిగిల్చారు. అంగన్‌వాడీ మిడ్‌డే మీల్స్‌, హోంగార్డులు, ఔట్‌సోర్సింగ్‌, విద్యా, వైద్య, వ్యవసాయ, పౌరసరఫరాల శాఖకు భారీగా బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సమస్యల నుంచి త్వరలోనే గట్టెక్కుతాం. అయితే అందుకు కొంత సమయం పడుతుంది. మానవ వనరుల అభివృద్ధిపై దృష్టి సారించాం. ముఖ్యంగా విద్యా రంగానికి పెద్దపీట వేయాల్సి ఉంది. ఉదాహరణకు అత్యధిక అక్షరాస్యత కలిగిన కేరళను తీసుకుంటే అక్కడ రెవెన్యూ వచ్చేది హ్యూమన్‌ నుంచే. దేశ విదేశాల్లో పనిచేస్తూ వారు ఆదాయం పొందుతున్నారు. హ్యూమన్‌ క్యాపిటల్‌ను పెంచినట్లైతే అభివృద్ధి జరుగుతుంది’ అని బుగ్గన పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Advertisement
Advertisement