వచ్చేది వెయ్యి కోట్లు పైనే చూపింది 28 కోట్లు 

BJP MP Rajeev Chandrasekhar And His Income - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రాజ్యసభకు ఎన్నికైన ప్రముఖ వ్యాపారవేత్త రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఎన్నికల అఫిడ్‌విట్‌లో పేర్కొన్న ఆయన, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు చూస్తే ఎవరైనా కళ్లు తిరిగి పడిపోవాల్సిందే. తాను నిర్వహిస్తున్న వివిధ కంపెనీల నుంచి తనకు ఏటా 28 కోట్ల రూపాయలు వస్తున్నాయని, తన కుటుంబ సభ్యుల ఆస్తి మొత్తం 65 కోట్ల రూపాయలని తెలిపారు. తాను 1942 మోడల్‌ ‘రెడ్‌ ఇండియన్‌ స్కౌట్‌’ కారును 2004లో పది వేల రూపాయలకు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. స్టాక్‌ ఎక్స్ఛేంచ్‌లో నమోదుకాని ‘వెంక్ట్రా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఎస్‌పీఎల్‌ ఇన్ఫోటెక్‌ పీటీఈ, జూపిటర్‌ గ్లోబల్‌ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్, మిన్స్క్‌ డెవలపర్స్, ఆర్‌సీ స్టాక్స్‌ అండ్‌ సెక్యూరిటీస్, శాంఘైన్‌ న్యూ మీడియా’ కంపెనీల్లో తనకు ఈక్విటీ షేర్లు ఉన్నాయని, ఈ షేర్ల ద్వారా ఏటా 28 కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని ఆయన వివరించారు. 58 అనుబంధ కంపెనీలు కలిగిన అతిపెద్ద కంపెనీ ‘జూపిటర్‌ క్యాపిటల్‌’ పేరును ఆయన తన అఫిడవిట్‌లో పొందుపర్చలేదు. ఈ కంపెనీలో 90 శాతం వాటా ఆయనదే. 

ఆయన 2005లో ఈ కంపెనీని స్థాపించారు. మొదటి సంవత్సరం నాలుగు అనుబంధ కంపెనీల ద్వారా ఆ కంపెనీకి 15.08 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఈ కంపెనీ వేగంగా అనుబంధ కంపెనీలను ఏర్పాటు చేస్తూ వచ్చింది. కంపెనీ 2018లో కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమర్పించిన నివేదిక ప్రకారం కంపెనీకి 58 అనుబంధ కంపెనీలు ఉన్నాయి. వాటిలో సువర్ణ న్యూస్, ఆసియా నెట్, ఇండిగో 91.9 ఎఫ్‌ఎం, రిపబ్లిక్‌ టీవీ, ఆక్సిస్‌కేడ్‌ (టెక్నాలజీ సంస్థ), ఇండియన్‌ ఎయిరో వెంచర్స్‌ లాంటి పలు డిఫెన్స్‌ కంపెనీలు కూడా ఉన్నాయి. 

వేల కోట్ల రూపాయల ఆదాయం
జూపిటర్‌ కంపెనీ 2018, మార్చి నెలలో ‘రిజిస్టార్‌ ఆఫ్‌ కంపెనీస్‌’ సమర్పించిన నివేదికలో కంపెనీ పెట్టుబడుల విలువను 7,100 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. 2018, మార్చి నెల నాటికి 1,026 కోట్ల రూపాయలను వార్షికాదాయంగా చూపించారు. ఈ కంపెనీ గురించి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తన ఎన్నికల అఫిడవిట్‌లో ప్రస్తావించకపోవడం ఆశ్చర్యం. ఆయన 2014 సెప్టెంబర్‌ నుంచి 2017 ఆగస్ట్‌ 30వ తేదీ వరకు డిఫెన్స్‌ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యులుగా కొనసాగారు. అప్పుడు సొంతంగా డిఫిఎన్స్‌ కంపెనీలు కలిగిన వ్యక్తిని పార్లమెంటరీ స్థాయి సంఘంలోకి ఎలా తీసుకుంటారని కాంగ్రెస్‌ ఎంపీలు గొడవ చేశారు. వివాదాస్పద రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు కోసం రక్షణ శాఖ తరఫున చర్చలు జరిపిన కమిటీలో కూడా ఈ రాజీవ్‌ చంద్రశేఖర్‌ సభ్యుడిగా ఉన్నారు. 

అనేక లగ్జరీ కార్లు ఆయన సొంతం
చంద్రశేఖర్‌ తాను 2004లో పది వేల రూపాయలతో ఓ డొక్కు కారును కొన్నట్లుగా ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. హెరిటేజ్‌ కార్లకు లక్షల్లో, కోట్లలో డిమాండ్‌ ఉంటుందన్న విషయం తెల్సిందే. వ్యాపారవేత్తలు ఎవరైనా కంపెనీల పేరిటే కార్లను కొంటారని తెల్సిందే. ఆయనకు ‘ఫెరారీ డినో, ఫెరారీ ఎఫ్‌555 స్పైడర్, లంబోర్గినీ ముర్సీలగో, బీఎండబ్ల్యూ ఎం5 (ఎఫ్‌ 60), హమ్మర్‌ హెచ్‌2 లాంటి అతి ఖరీదైన, అతి విలాసవంతమైన కార్లు ఉన్నాయి. 

అఫిడవిట్‌లోనూ తప్పులే
తనకు ఆరు కంపెనీల నుంచి ఏటా 28 కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని 2018, మార్చి 12వ తేదీన సమర్పించిన అఫిడవిట్లో రాజీవ్‌ పేర్కొన్నారు. అయితే అవి ఫిబ్రవరి 28వ తేదీ నాటి లెక్కలని చెప్పారు. 2018, మార్చి 30వ తేదీ నాటికి ఈ ఆరు కంపెనీలకు కలిపి 313 కోట్ల రూపాయల లాభం వచ్చిందని కంపెనీ ఆర్థిక రిటర్న్స్‌లో చూపించారు. 

లోక్‌పాల్‌ విచారించాల్సిందే!
ప్రధాని సహా మంత్రులు, పార్లమెంట్‌ సభ్యుల అవినీతిని విచారించే అధికారంగల లోక్‌పాల్‌ తొలి చైర్మన్‌గా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ను కేంద్రం ఆదివారమే ఖరారు చేసిన విషయం తెల్సిందే. ప్రధాని నేతత్వంలోని కమిటీ నియమించే లోక్‌పాల్‌ చైర్మన్, ప్రధానిపై వచ్చే ఆరోపణలను చిత్తశుద్ధిగా విచారిస్తారని ఆశించడం అత్యాశే అవుతుంది. పాలకపక్షం బీజేపీ తరఫున గత మార్చి నెలలో గెలిచిన రాజీవ్‌ చంద్రశేఖర్, తన అఫిడవిట్‌లో అటు ప్రభుత్వాన్ని, ఇటు ప్రజలను బోల్తా కొట్టించినందుకు ఆయనపై లోక్‌పాల్‌ విచారణ జరిపి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. అవినీతి ప్రక్షాళన దిశగా తొలి అడుగు వేయాలి. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top