సొమ్ము కేంద్రానిది.. సోకు కేసీఆర్‌దా? | BJP Leader Laxman Fires On KCR Government | Sakshi
Sakshi News home page

Jul 4 2018 3:06 AM | Updated on Aug 15 2018 9:10 PM

BJP Leader Laxman Fires On KCR Government - Sakshi

మంగళవారం మంచిర్యాలలో డప్పు కొడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌

మంచిర్యాలసిటీ/గోదావరిఖని: కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలకు విడుదల చేస్తున్న నిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోకులు చేసుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విమర్శించారు. జన చైతన్య యాత్రలో భాగంగా మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగిన బహిరంగ సభలలో ఆయన ప్రసంగించారు. రేషన్‌ బియ్యం పథకానికి కిలోకు రూ.29,, డబుల్‌ బెడ్‌ రూం పథకంలో ఒక్కో ఇంటికి రూ.1.50, కేసీఆర్‌ కిట్‌కు రూ.6 వేలు చొప్పున కేంద్రం నిధులు కేటాయిస్తుందని చెప్పారు. ప్రతి జిల్లా కేంద్రంలో డయాలసిస్‌ కేంద్రాలను కేంద్రం నిధులతో ఏర్పాటు చేస్తే అది కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసినట్టుగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.

సుదీర్ఘ కాంగ్రెస్‌ పాలనలో 6.20 లక్షల మరుగుదొడ్లు నిర్మిస్తే, నాలుగేళ్ల మోదీ పాలనలో 7.5 లక్షల మరుగుదొడ్లు నిర్మించామని తెలిపారు. దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది మహిళలకు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చిన ఘనత బీజేపీకే దక్కిందన్నారు. ఉద్యోగం చేస్తున్న మహిళలకు మూడు నెలలు ఉన్న ప్రసూతి సెలవులను ఆరు నెలలకు సవరించినట్లు తెలిపారు. సామాజిక న్యాయం కోసం ముస్లిం శాస్త్రవేత్తను, దళిత మేధావిని రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీదేనని చెప్పారు. మహిళలను గౌరవించే పరిస్థితి కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లలో లేదన్నారు. సుష్మాస్వరాజ్‌ను విదేశాంగ మంత్రిగా, నిర్మలా సీతారామన్‌ను రక్షణ మంత్రిగా, సుమిత్రా మహాజన్‌ను లోక్‌సభ స్పీకర్‌గా పదవులు ఇచ్చి గౌరవించామన్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లది కుటుంబ పాలనే సాగుతుందన్నారు.  

దేశరక్షణలో రాజీపడం: కేంద్రమంత్రి హన్స్‌రాజ్‌  
దేశరక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో తమ ప్రభుత్వం రాజీపడే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్‌ గంగారామ్‌ అన్నారు. కశ్మీర్‌లో బీజేపీ అధికారాన్ని వదులుకున్న తర్వాతనే అక్కడ శాంతి నెలకొందన్న అంశాన్ని ప్రజలు గమనించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతుంటే, కనీసం ప్రధాని మోదీ ఫొటో కూడా పెట్టకుండా తానే మొత్తం చేస్తు న్నట్లు ప్రచారం చేసుకోవడం తగదన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.  కాగా లక్ష్మణ్‌ పుట్టినరోజు వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి.

టీఆర్‌ఎస్‌ అధ్యక్ష పదవి ఇతరులకిచ్చే దమ్ముందా? 
టీఆర్‌ఎస్‌ అధ్యక్ష పదవిని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఇచ్చే దమ్ముందా అని కేసీఆర్‌కు ఆయన సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో నలుగురి పాలననే నడుస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ఎంఐఎంను పోషి స్తే ఇప్పుడు టీఆర్‌ఎస్‌ ఆ పని చేస్తుందన్నారు. ఎంఐఎంతో కలసి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న కేసీఆర్‌ కుటుంబ పాలనకు రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో కోట్ల కుంభకో ణం జరిగిందని, అవినీతికి పాల్పడిన వారిని జైలు కు పంపుతానని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన మాట ఏమైందని లక్ష్మణ్‌ ప్రశ్నించారు. ఈ కుంభకోణంలో పాత్ర ఉన్నవారిపై ప్రేమ చూపుతున్నారంటే కాంగ్రె స్, కేసీఆర్‌ ఒక్కటేనని చెప్పారు. కాంగ్రెస్, ఎంఐ ఎం, టీఆర్‌ఎస్‌లలో ఏ ఒక్క పార్టీకి ఓటేసినా ఎంఐ ఎంకు వేసినట్టేనని చెప్పారు. ప్రజలు ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపుతామని భరోసా ఇచ్చారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement