కాలం చెల్లిన పోలీసు వ్యవస్థలో న్యాయం బహు దూరం

కాలం చెల్లిన పోలీసు వ్యవస్థలో న్యాయం బహు దూరం - Sakshi


అవలోకనం


బ్రిటిష్‌ వారు ఏర్పాటు చేసిన  కాలం చెల్లిన వ్యవస్థలో పనిచేస్తున్న మన పోలీసులు శాస్త్రీయమైన దర్యాప్తు  పద్ధతుల్లో నేరాన్ని పరిష్కరించడం లేదు. కాబట్టి తీవ్ర నేరాలకు పాల్పడే వారిలో సైతం అధికులు తప్పించుకుపోగలుగుతున్నారు. కాబట్టి, గౌరీ లంకేశ్‌ను హత్యచేసినవారు, వారిని అందుకు పురమాయించినవారు ఎప్పటికీ శిక్ష అనుభవించాల్సి రాకపోతే ఆశ్చర్యపోను.



గత ముప్పయ్యేళ్లలో మన దేశంలోని నగరాలు బాగా మారిపోయాయి. ఇది పోలీ సుల పనితీరును బాగా ప్రభావితం చేసింది. నగరాలు ఎలా పెరిగిపోయాయి లేదా నివాసయోగ్యం కానివిగా ఉన్నా చాలా మంది ప్రజలు అక్కడే ఎలా నివసించాల్సి వస్తున్నది అనే వాటి గురించి నేను మాట్లాడటం లేదు. మన నగరాలను అసలు ఎలా రూపకల్పన చేశారు, అవి ఎలా మారిపోయాయి అనేదాన్ని ప్రస్తావిస్తున్నాను. మన దేశం ప్రాచీనమైనదే అయినా, మన నగరాలలో చాలా వరకు కొత్తవే. ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి అతి పెద్ద నగరాలు 300 ఏళ్ల క్రితం బ్రిటిష్‌ వారు నిర్మించినవి. హైదరాబాద్, సూరత్‌ లాంటి నగరాలు దాదాపు మరో 200 ఏళ్లు ముందు నిర్మించినవి. మన ‘పాత’ ఢిల్లీ సైతం 400 ఏళ్ల క్రితం నిర్మించినదే.



కాశీని మాత్రమే ప్రాచీన నగరంగా చెప్పుకోవచ్చు. అయితే ఆ నగరం దాదాపుగా అంతా వాస్తవానికి కొత్తగా నిర్మించినదే. అక్కడి ఘాట్లు సైతం సాపేక్షికంగా ఇటీవలివే. 500 ఏళ్ల కంటే ముందు నుంచీ ఉన్నదని సమంజసమైన ఆధారాలతో చెప్పగల కట్టడం ఒక్కటీ అక్కడ నేడు లేదు. రోమ్‌తో దీన్ని పోల్చి చూడండి. అక్కడి పేంథియన్‌ (రోమన్‌ దేవాలయం) దాదాపు 2,000 ఏళ్ల క్రితం నాటిది. ఇప్పటికీ అది చెక్కు చెదరకుండా ఉంది. రోమ్‌లోని పురాతన కట్టడాల చుట్టూతా ఆ నగర జనాభా ప్రాచీనకాలం నుంచి నేటి వరకు తమ జీవితాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఆధునికమైన సైకిళ్లు, మోటార్‌ కార్లు, రెస్టారెంట్లు వచ్చి చేరినా అది కొనసాగుతూనే ఉంది. జీవిత విధానంలో వచ్చిన ఈ మార్పులు తప్ప, అక్కడి ఏ నివాస ప్రాంతాన్ని చూసినా శతాబ్దాల తరబడి మారనట్టే కనిపిస్తుంది. మన దేశంలో పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నమైనది. ఏవో కొన్ని కొత్త భవంతులు పుట్టుకొస్తుండని ప్రాంతాలు మన నగరాలలో అరుదు. కొన్నేళ్ల తర్వాత తిరిగివస్తే మన నగరాల్లోని చాలా ప్రాంతాలు గుర్తు పట్టరానివిగా మారిపోతాయి.



ఈ మార్పు, పోలీసులు తమ విధులను నిర్వహించే తీరును ప్రభావితం చేసిందని నేను ఎందుకు అంటున్నట్టు? సాంప్రదాయక పద్ధతిలో ఒక నివాస ప్రాంతంలోని ఠాణా నేరాలతో వ్యవహరిస్తుండేది. ‘హిస్టరీ షీటర్ల’ (నేర చరిత్రుల) జాబితా, వారి ఫొటోలు పోలీసు స్టేషన్‌ నోటీసు బోర్డులో అతికించి ఉండేవి. కొత్తగా వచ్చిన పోలీసులు ఆ ప్రాంతం గురించి, నేరాలకు ‘అలవాటుపడ్డవారి’ గురించి తెలుసుకోడానికి ఇది తోడ్పడేది. కానీ నేటి మన నగరాలలో ప్రజలు ఉద్యోగాలు మారుతుంటారు, నగరాలు మారుతుంటారు, అద్దె ఇళ్లను ఎప్పటికప్పుడు మార్చుతుంటారు. కాబట్టి బోలెడంత గందరగోళం ఉంటుంది. పట్టణ ప్రాంతాలు నిరంతరం మారిపోతున్నా పాత పోలీసు వ్యవస్థే మిగిలి ఉంది. సీసీటీవీ కెమెరాల వంటి వాటి ద్వారా కొంత సాంకేతిక సహాయం లభిస్తోంది. అది కూడా ఇతర దేశాలకు భిన్నంగా దైవాధీనం అన్న తీరులోనే సాగుతోంది. మధ్యతరగతి ఇళ్లలో జరిగే దొంగతనాల కేసులను ఇప్పటికి కూడా పనివాళ్లనందర్నీ పట్టుకొచ్చి, ఎవరో ఒకరు నేరాన్ని ఒప్పుకునే వరకు చితగ్గొట్టే పద్ధతిలోనే పోలీసు దర్యాప్తు సాగుతోంది. హత్య సహా ఏ నేరం విషయంలోనూ సక్రమమైన దర్యాప్తు అనేదే లేదు. గౌరీ లంకేశ్‌ హత్యా ప్రదేశానికి తొలుత చేరుకున్న వారు.. అది ఎవరైనా ఇష్టానుసారం వచ్చి వెళ్లడానికి వీలుగా ఉండటం చూసి ఉంటారు. అలాంటి చోట చెప్పుకోదగిన ఫోరెన్సిక్‌ ఆధారాలేవీ మిగలవు.



సమాంతరంగా సంభవించిన మరో పరిణామం కూడా పోలీసు పనిని ప్రభావితం చేసింది. పోలీసులకు ఎప్పటికప్పడు సమాచారాన్ని చేరవేసే ‘కబ్రీ’లు మాయమయ్యారు. నేడు ఆ పనిని చేస్తున్నది, నేరగ్రస్తత అంచుల్లో ఉండే పోలీసు ఇన్‌ఫార్మర్లు మాత్రమే. ఇన్‌ఫార్మర్లు కొంత చట్టవిరుద్ధమైన పనులను కూడా చేస్తుం టారు. పోలీసులు వారిని భయపెట్టి లేదా లంచమిచ్చి సమాచారాన్ని తెలుసుకుంటారు. బాబ్రీ మసీదు కూల్చివేత, ముంబై, సూరత్‌ అల్లర్లు, ఆ తర్వాత వాటికి ప్రతిగా బాంబు దాడుల రూపంలో జరిగిన దాడుల తదుపరి పోలీసులకు కబ్రీలు లేకుండా పోయారు. కబ్రీలలో ఎక్కువ మంది ముస్లింలు కావడమే అందుకు కారణం. మతపరమైన విభజన పాత నమూనా పోలీసు పనిని ప్రభావితం చేసింది. ఆధునిక ఫోరెన్సిక్స్‌పై ఆధారపడ్డ దర్యాప్తు పూర్తిగా లోపిస్తుంది. పాత నమూనా దర్యాప్తు ఇక ఎంత మాత్రమూ ఫలితాలను ఇవ్వగలిగేది కాదు.



1996లో నేను ఒక విలేకరిగా ముంబై సెషన్స్‌ కోర్టులో ఉండగా, ఇక్బాల్‌ మిర్చి అని మాదకద్రవ్యాల సరఫరాదారు తరఫు న్యాయవాదిౖయెన శ్యామ్‌ కేశ్వానీ నన్ను కలిశారు. అప్పట్లో ఇక్బాల్‌ మిర్చిని అప్పగించాలని భారత్‌ ఇంగ్లండ్‌ని కోరుతోంది. ఆ కేసు కోసం సీబీఐ నలుగురి బృందాన్ని పంపింది. కేశ్వానీ నాకు దాదాపు 200 పేజీల చార్జీ షీటు ప్రతిని ఇచ్చారు. అందులో ఒకే ఒక్క చోట ఆయన క్లయింట్‌ పేరు ఉంది. అది కూడా చిట్టచివరి పేజీలో ‘ఈ కేసులో ఇక్బాల్‌ మెమన్‌ లేదా మిర్చి కూడా అవసరమైన వ్యక్తి’ అన్న ఒక్క వాక్యంలోనే ఉంది. భారత ప్రభుత్వం నాడు సమర్పిస్తుండిన మొత్తం ‘ఆధారం’ అదే. ఇంగ్లండ్‌ మిర్చిని అప్పగించలేదు. ఇది భారత పోలీసుల తప్పు అనడం లేదు. వారు చాలా కష్టించి పనిచేస్తున్నారు. కాకపోతే, ఒక నివాస ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం బ్రిటిష్‌ వాళ్లు ఏర్పాటు చేసిన వ్యవస్థలోనే మన పోలీసు ఇంకా పనిచేస్తున్నాడు. దర్యాప్తు ద్వారా నేరాన్ని పరిష్కరించడం లేదు.



జపాన్‌లో నేరాభియోగాలకు గురైన వారిలో శిక్షపడినవారి నిష్పత్తి 95 శాతం. అంటే ఏదైనా నేరానికిగానూ పోలీసులు ఎవరినైనా పట్టుకున్నారంటే, కోర్టు అతన్ని దోషి అని నిర్ధారించడానికి హామీ దాదాపుగా ఉంటుంది. భారత్‌లోలాగే తరచుగా చిత్రహింసలకు గురిచేయడం ద్వారా రాబట్టిన నేరాంగీకార ప్రకటనలపై ఆధారపడే ఈ వ్యవస్థను విమర్శించేవారూ ఉన్నారు. అదే లోపాలున్నా, భారత్‌లో శిక్షలు పడేవారి నిష్పత్తి 50 శాతం కంటే తక్కువే ఉంటోంది.



తీవ్ర నేరాలుసహా నేరాలకు పాల్పడే భారతీయులలో అధికులు తప్పించుకుపోగలుగుతున్నారు. ఈ కారణంగా, గౌరీ లంకేశ్‌ను హత్యచేసినవారు, వారిని ఆ పని చేయడానికి నియమించినవారు ఎప్పటికీ శిక్ష అనుభవించాల్సి రాకపోతే నేను ఆశ్చర్యపోను. ఈ వైఫల్యం వ్యవస్థాగతమైనది, కొన్ని ప్రత్యేక సందర్భాలలో అది పనిచేస్తుందని ఆశించడం మన ఆశావాదాన్ని సూచిస్తుందే తప్ప, వాస్తవాలు తెలిపే నిజపరిస్థితిపై అంచనాను మాత్రం సూచించదు.



ఆకార్‌ పటేల్‌

వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ‘ aakar.patel@icloud.com


 




 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top