కొత్త పుస్తకాలు | Sakshi
Sakshi News home page

కొత్త పుస్తకాలు

Published Mon, Aug 29 2016 1:03 AM

కొత్త పుస్తకాలు

కొత్త పుస్తకాలు
జీవరహస్య లిపి
కవి: ఖాదర్‌ షరీఫ్‌; సంపాదకులు: అల్లు భాస్కరరెడ్డి, పెరుగు రామకృష్ణ; పేజీలు: 108; వెల: 100; ప్రతులకు: పెరుగు రామకృష్ణ, 25–1–949, ఐదో వీధి, నేతాజీ నగర్, నెల్లూరు–4. కవి ఫోన్‌: 9441938140

‘ఖాదర్‌ షరీఫ్‌ కవిత్వం ఒక్కచోట నిలకడగా నిలవదు. టీని టీకప్పులో బంధించినట్లు అతని కవిత్వాన్ని కాగితం దేహానికి గుచ్చలేం. అది మస్తిష్కం నిండా విస్తరిస్తూ వెళ్తుంది’. ‘ఒక సజీవ దృశ్యాన్ని కవిత్వం చేసి పుష్పగుచ్ఛంలా ఇస్తాడు. ఒక్కో కవిత చదువుతున్నప్పుడు నిద్రించిన జ్ఞాపకానికి జీవమొచ్చినట్లు అన్పిస్తుంది. అన్నీ కూడా పరిణతి చెందిన భావాలు. జన జీవితాన్ని ఆలోచింపజేసి చైతన్యపరిచే బాధ్యతాయుతమైన కవిత్వం’.

ఆటాడుకుందాం... రా!
(హోసూరు కతలు)

రచన: అగరం వసంత్‌; పేజీలు: 222; వెల: 150; ప్రతులకు: కృష్ణగిరి జిల్లా తెలుగు రచయితల సంఘం, 2/1097, బస్తి, ఆవులపల్లి రోడ్డు, హోసూరు–635109, కృష్ణగిరి జిల్లా, తమిళనాడు. ఫోన్‌: 09488330209

అ.. ఆ.. ఆట తెలుసా? కమల గిమల– గులుగులు గుమల– తారం తమల– నీ పేరు అమల; రమేసు గిమేసు– గులుగులు గుమేసు– తారం తమేసు– నీ పేరు అమేసు; ఈ పద్ధతిలో ఆడితే(పలికితే) ఏ పేరును తీసుకున్నా అది ‘అ’తో మొదలవుతుంది. ‘అచ్చ తెలుగు అమృతాన్ని తాగతా తెలుగమ్మ ఒడిలో ఊగతా’ ఉండినట్టుగా అనిపించే ఇలాంటి బాల్యపు ఆటలే వస్తువులుగా 100 కథలు రాశారు వసంత్‌. అవి ‘హోసూరు ప్రజలు తరతరాలుగా’ జీర్ణించుకున్న, చిన్నా పెద్దా, ఆడా, మగా ఆడుకునే 100 ఆటలు!

అశుద్ధ భారత్‌
ఆంగ్లమూలం: భాషా సింగ్‌; తెలుగు: సజయ; పేజీలు: 240; వెల: 150; ప్రతులకు: హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్, ప్లాట్‌ నం. 85, బాలాజీ నగర్, గుడిమల్కాపూర్, హైదరాబాద్‌–6; ఫోన్‌: 23521849
బెజవాడ విల్సన్‌ ముందుమాటతో వచ్చిన ‘అన్‌సీన్‌: ద ట్రూత్‌ ఎబౌట్‌ ఇండియాస్‌ మాన్యువల్‌ స్కావెంజర్స్‌’కు ఇది తెలుగు అనువాదం. ‘కేవలం పుట్టుక ద్వారా తోటి మనుషుల పియ్యిపెంటలను ఎత్తి పారబోసే పాకీ పనిచేసే వ్యక్తుల, సమూహాల వాస్తవ పరిస్థితి బయటపెట్టింది (ఈ) పుస్తకం’. ‘అనేక గణాంకాల కంటే కూడా అతి సామాన్యమైన పదాలతో భాషా సింగ్‌ భారతదేశ పాకీపనివారి కడగండ్లను, అలాగే వారి సామర్థ్యాలను శక్తిమంతంగా ఈ పుస్తకంలో వివరించారు’.

కళ్యాణ మంజీరాలు
హిందీ మూలం: అమృతలాల్‌ నాగర్‌; తెలుగు: కౌముది; పేజీలు: 188; వెల: 120; ప్రతులకు: విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్, 33–22–2, చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ–4; ఫోన్‌: 0866–2430302
‘కళ్యాణ మంజీరాలు(సుహాగ్‌ కే నూపుర్‌) అనే ఈ నవలను అమృతలాల్‌ నాగర్, తమిళ కావ్యం ‘శిలప్పదికారం’ ఆధారం చేసుకొని రాసారు. తమిళనాడులోని పేర్లు, సంఘటనలు ఇందులో కనపడతాయి. జైన బౌద్ధ మతాల ప్రభావం ఉన్న రోజుల్లో సాంఘిక పరిణామాలు, ఆచార వ్యవహారాలను ఈ నవల ప్రతిబింబిస్తున్నది’. తొలుత ‘కళంకిని’ పేరుతో అచ్చయిన ఈ నవల ఇప్పుడు ‘కళ్యాణ మంజీరాలు’గా పునర్ముద్రణ అయింది.
 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement