మార్క్ ట్వేన్ ‘టామ్ సాయర్’, ‘హకల్‌బెరీ ఫిన్, ‘విచిత్ర వ్యక్తి’ నవలలను తెలుగులోకి అనువదించినవారు నండూరి రామ్మోహనరావు.
హకల్‌బెరీ ఫిన్:
మార్క్ ట్వేన్ ‘టామ్ సాయర్’, ‘హకల్‌బెరీ ఫిన్, ‘విచిత్ర వ్యక్తి’ నవలలను తెలుగులోకి అనువదించినవారు నండూరి రామ్మోహనరావు. ఆయన ఆ పని యెంత ప్రతిభావంతంగా చేశారంటే అనువాదం చదువుతున్నట్టుండదు, ఒరిజినల్ ఎలావుందో చూడాలనిపించదూ. పది, పన్నెండేళ్ల పిల్లవాడు మిసిసిపీ నదిపై చిన్న పడవపై చేసే ప్రయాణానుభవాలే ‘హకల్‌బెరీ ఫిన్’. అతనితో పాటు స్వేచ్ఛను కోరుతూ జిమ్ అనే నీగ్రో నౌకరు కూడా ప్రయాణిస్తూ వుంటాడు. వారిద్దరి మధ్యా యేర్పడిన అనుబంధాన్ని వివరిస్తూ, మానవ స్వభావంలోని కపటత్వాన్ని వెక్కిరిస్తూ, మత ఛాందసాన్ని దుయ్యబడుతూ, బానిసత్వాన్ని నిరసిస్తూ హాస్యస్ఫోరకంగా మార్క్ ట్వేన్ రాసిన విధానం పుస్తకాన్ని కిందపెట్టనివ్వకుండా చదివిస్తుంది. నేను చిన్నప్పుడు చదివిన యీ పుస్తకాన్ని ఇప్పటికీ తీసి మళ్లీ మళ్లీ చదివి ఆనందిస్తూ వుంటాను.
ద వుమన్ ఆఫ్ రోమ్:
1940 ప్రాంతాలలో వెలువడిన ఈ పుస్తక రచయిత ఆల్బర్ట్ మొరావియా ఇటలీ దేశస్థుడు. మొదటి సారి ఈ నవల చదువుతున్నపుడు నేను ఆశ్చర్యానికి గురయ్యాను. పాత్రల స్వభావాలనూ, వారి ఆలోచనలనూ ధైర్యంగా, నిర్మొహమాటంగా, నిస్సిగ్గుగా రచయిత చిత్రీకరించిన తీరు విప్లవాత్మకమయినది. ముఖ్యంగా స్త్రీ పాత్రలను చిత్రీకరించిన తీరు చూస్తే అతను వారిని పరిశీలించి కాదు, వారి ఆత్మలను దర్శించి రాశాడు అనిపిస్తుంది. అందరు ఆడపిల్లల్లాగే ఎన్నో కలలు కంటూ యవ్వనంలో అడుగుపెట్టిన వొక యువతి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందీ, చివరికామె వొక వేశ్యగా మారటానికి దారితీసిన పరిస్థితులూ రాసిన విధానం అనుపమానం.
దువ్వూరి వెంకట రమణశాస్త్రి స్వీయచరిత్ర:
ఇది చదివితే తెలుగు భాషలోని రుచితో పాటు వొకప్పటి తెలుగు ప్రజల జీవితాలలోని రుచీ తెలుస్తుంది. శాస్త్రిగారు తెలుగు, సంస్కృతం చదివిన పండితులు. తన కెదురయిన వింత అనుభవాలూ, విశేషాలూ, ఆనాటి మనుషుల మనస్తత్వాలూ, మమతలూ, చిట్టి పొట్టి కథలుగా చెప్పిన విధానం పుస్తకాన్ని వదలకుండా చదివిస్తుంది.
దీక్షితులు గారికి చలం లేఖలు:
తెలుగులో లేఖా సాహిత్యంలో చలానిది ప్రత్యేక స్థానం. ప్రముఖులు కాని వాళ్లకు కూడా ఆయన వుత్తరాలు రాశారు. చలం నా అభిమాన రచయితయినా, ఆయన రాసినవన్నీ నాకిష్టమే అయినా ఈ పుస్తకమంటే ప్రత్యేకాభిమానం. చలం స్త్రీనే కాదు, ఒక పురుషుడిని కూడా ఎంతగా ప్రేమించీ అభిమానించీ గౌరవించీ పలవరిస్తాడో యీ పుస్తకం చదివితే తెలుస్తుంది. ఒక మనిషిని వేరొక మనిషి జెండర్ స్పృహ లేకుండా ఇంత అభిమానించవచ్చా అని ఆశ్చర్యంగానూ, చలం అభిమానాన్ని అంతగా పొందిన దీక్షితులుగారిని తలుచుకుని అసూయగానూ అనిపిస్తుంది యీ పుస్తకం చదివితే.
అనుక్షణికం:
తెలుగు సాహిత్యంలో నూతనత్వానికి తెరతీసిన వ్యక్తి చండీదాస్. భాషనుపయోగించే తీరుగానీ, భావాలను వ్యక్తీకరించే తీరుగానీ అంతా కొత్తే. బుచ్చిబాబును తన అభిమాన రచయితగా చెప్పుకున్నా, అక్కడక్కడా ఆయన ప్రభావం తొంగిచూసినా ఈయన ధోరణి ఈయనదే. ‘అనుక్షణికం’లో తీసుకున్న కాన్వాస్ చాలా పెద్దది. అనేక పాత్రలు వచ్చిపోతుంటాయి. 1970–80 ప్రాంతాలలోని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జీవిత శకలాన్ని కళ్లముందుంచారు. నిష్పక్షపాతంగా రకరకాల పాత్రలనీ, వారి కుటుంబ, కుల నేపథ్యంతో సహా ఆవిష్కరించిన తీరు అనితర సాధ్యం. ఒక్క స్వప్నరాగలీన తప్ప మిగతా పాత్రలన్నీ మనం రోజువారీ చూసే వ్యక్తులే అనిపించడం ఈ నవల ప్రత్యేకత.
(rbhargavi17@gmail.com)
డాక్టర్ భార్గవి