రమేశ్ మాటల్లో రహస్యమేమిటి?

రమేశ్ మాటల్లో రహస్యమేమిటి? - Sakshi


స్వాతంత్య్రం వచ్చాక మొదటి ఇరవై ఏళ్లు కాంగ్రెస్ పాలకులు రాజ్యాంగబద్ధులై నడచుకున్నారు. కానీ ‘భారతీయ’ ఇందిరాగాంధీ హయాం నుంచి, ఇటాలియన్ సోనియా (మన్మోహన్‌తో కలిపి) హయాం దాకా కనిపించే చరిత్ర పెక్కు రాజ్యాంగ ఉల్లంఘనలతో నిండి ఉంది.

 

 ఆంధ్రప్రదేశ్‌ను దేబరించుకుంటేగాని రాజ్యసభ సీటు దొరకని కేంద్రమంత్రి జైరాం రమేశ్ కూడా రాష్ట్ర కృత్రిమ విభజనలో ‘రెండు నాల్కల ధోరణి’కి అలవాటు పడిపోయారు. తెలంగాణలో పర్యటిస్తే ఒకమాట, సీమాంధ్ర పర్యటనలో వేరొకమాట వల్లించడం నేర్చు కున్నారు. విభజన ‘రాజ్యాంగబద్ధంగానే జరిగిందని’ చెప్పడానికి సాహసించిన రమేశ్ మరో అడుగు ముందుకు వేసి ‘విభజన’ విషయంలో ఇక ‘ఎవరూ ఏమీ చేయలేరు, న్యాయస్థానాలకు వెళ్లి ఎన్ని అభ్యంతరాలు చెప్పినా ఏమీ కాదని’ చెప్పేస్తున్నాడు (9-3-2014న సంగారెడ్డి).

 

 ఎక్కడిదో ఈ నమ్మకం?

 విభజన బిల్లు(చట్టం) అక్రమమనీ, రాజ్యాంగ వ్యతిరేకమనీ, ఫెడరల్ స్ఫూర్తికే విరుద్ధమనీ సుప్రీం కోర్టులో సమైక్యవాదుల  తరపున దాఖలైన 18 రిట్ పిటిషన్లపైన విచారణ ప్రారంభమైంది.  దరిమిలా బాధ్యతాయుత స్థానంలో ఉన్న కేంద్రమంత్రి కోర్టు నిర్ణయం వెలువడక ముందే ఎవరు ‘ఎన్ని అభ్యంతరాలు చెప్పుకున్నా ఏమీ కాద’ని చెప్పడమంటే ఎక్కడో ఏ మూలనో ఏదో గూడుపుఠాణీ జరుగుతోందన్న అనుమానం సామాన్య ప్రజా బాహుళ్యానికి కలగడం సహజం! తమకు, పార్లమెంటుకు రాష్ట్రాల్ని ఎక్కడికక్కడ తునాతునకలుగా విడగొట్టే హక్కు, అధికారమూ ఉందని చెబుతూ ‘కూటసాక్ష్యం’గా ఇదే రమేశ్ రాజ్యాంగంలోని ‘అధికరణ -3’ను ఇప్పుడు, ఇంతకుముందు కూడా ఉదహరిస్తూ వస్తున్నాడు. కానీ ఆ అధికరణ వెలుగు చూసిన సందర్భం ఆయనకు తెలిసి ఉంటే ఆ విషయాన్ని తెలియజెప్పకపోవడం ప్రజలను మోసగించడమే.

 

 ఈ అధికరణ పూర్వరంగం తెలియ కుంటే అతడు మంత్రి పదవికీ అనర్హుడే. ఎందుకంటే, మూడవ అధికరణ ఆశయం- స్వతంత్ర భారత యూని యన్‌లో విలీనం కావడానికి స్వదేశ రాచరిక సంస్థానాలు అనేకం వ్యతిరేకిస్తున్నప్పుడు వాటికి ‘ముగుతాడు’ వేయడానికి ఆవిర్భవించినదే. కానీ గాంధీజీ వద్దు వద్దని చెబుతున్నా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేత నెహ్రూ ప్రభుత్వం దేశ విభజన అనుకూల తీర్మానం ఆమోదింప జేసింది. దాని ఫలితంగానే భారత దేశానికి చెందిన బెరుబరీహూనియన్   భూభాగాన్ని విడిపోయిన పాకి స్థాన్‌కు కట్టబెట్టడానికి దోహ దం చేసిన అధికరణ కూడా ఇదే! అధికరణ (3) చాటు నే, బ్రిటిష్ సామ్రాజ్యవాద విస్తరణలో భాగంగా మాత్ర మే కలుపుకున్న సిక్కిమ్‌ను కూడా కాంగ్రెస్ పాలకులు భారతదేశంలో కలిపేశారు. ఇందిరాగాంధీ పాలనలో అమలుకువచ్చిన ఈ ‘సంక్రమణ’ సిద్ధాంతం ద్వారా సిక్కిమ్‌ను భారతదేశంలో అంతర్భాగం చేయడాన్ని భారత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్  సైతం ‘దురాక్రమణ’ చర్యగా అభివర్ణించడాన్ని మరచిపోలేం. కానీ జైరాం రమేశ్ ‘అధికరణ-3’కు ఉన్న ఇంతటి పూర్వ రంగాన్ని తెలుసుకోలేకపోవ డంతో పాటు, ఆ అధికరణను విధిగా అమలు జరపాలని పేర్కొన్న మంచి షరతులనీ, ఆదేశాలనూ కూడా ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంలో మరచిపోయాడు.

 

 జైరామ్ భరోసా వెనుక!

 ‘ఎవరేమీ చెప్పినా న్యాయస్థానాలు ఏమీ చేయలేవ’న్న రమేశ్ భరోసా వెనుక రహస్యం ఏమై ఉంటుంది? అందులోనూ, విభజన సమస్యపై వచ్చిన రిట్‌పిటి షన్లను వాస్తవ పరిస్థితి ఆధారంగా లేదా న్యాయపరమైన అంశాల ఆధారంగా విచారించబోయే ముందు కేంద్ర ప్రభుత్వానికి, సంబంధిత శాఖలనూ ‘వివరణ ఇవ్వా ల’ని నోటీసు జారీ చేసింది. అనంతర పరిస్థితిని అయి దుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ఉన్నత ధర్మా సనానికి నివేదించాలని ఇరువురు న్యాయమూర్తులున్న బెంచ్ గౌరవ ప్రధాన న్యాయమూర్తిని కోరింది. ఊహిం చని ఈ పరిణామం చూసి కూడా జైరాం అలాంటి ‘భరోసా’ ఇవ్వడానికి కారణం ఏమిటి? స్వాతంత్య్రం వచ్చాక మొదటి ఇరవై ఏళ్లు కాంగ్రెస్ పాలకులు రాజ్యాం గబద్ధులై నడుచుకున్నారు. కానీ ‘భారతీయ’ ఇందిరా గాంధీ హయాం నుంచి, ఇటాలియన్ సోనియా (మన్మోహన్‌తో కలిపి) హయాం దాకా కనిపించే చరిత్ర పెక్కు రాజ్యాంగ ఉల్లంఘనలతో నిండి ఉంది.

 

 అలహాబాద్ తీర్పుతో మొదలు

 ఈ ఉల్లంఘనలు 1975లో అలహాబాద్ హైకోర్టు తీర్పుతో నిస్సంకోచంగా మొదలయ్యాయి. ప్రధాన మంత్రి పదవి కోల్పోవలసి వచ్చిన ఇందిరాగాంధీ దేశంలో ‘ఎమర్జెన్సీ’ ప్రకటిం చి, పౌరులకు రాజ్యాంగం ఇచ్చిన  జీవించే హక్కు సహా సప్త స్వాతంత్య్రాలను, ప్రాథమిక హక్కులను రద్దు చేసింది. ఈ ‘రద్దు’ను సమర్థించుకోవడానికి దేశ న్యాయవ్యవస్థలోని కొందరు న్యాయమూర్తుల నుంచి నయానా, భయానా అండ దండలు సంపాందించింది. ఈ క్రమంలోనే అనుకూలు రకు ప్రమోషన్లు, ప్రతికూలురకు డిమోషన్లు చోటు చేసుకున్నాయి. ఎమర్జెన్సీలో వందలాది మంది డిటె న్యూలు ‘హెబియస్ కార్పస్’ పిటిషన్ ద్వారా తమ విడు దలకు న్యాయస్థానాలను ఆశ్రయించిన చీకటి రోజుల్లో మొత్తం సుప్రీం న్యాయవ్యవస్థలో ఆదర్శమూర్తిగా నిలి చిన వారు జస్టిస్ హెచ్.ఆర్.ఖన్నా ఒక్కరే.  ‘హెబియస్’ పిటిషన్లు స్వీకరించి ఆయన వందలాది మంది విడు దలకు ఉత్తర్వులు జారీ చేశారు! ఇక కొలది మాసాలలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావల్సి న ఖన్నా ఆ పదవిని త్యజించడానికి సిద్ధమై సామాజిక బాధ్యతను సత్యప్రమాణంగా నిర్వర్తించి చరితార్థుడ య్యాడు. కాగా 1973లో కేశవానందభారతి కేసు తీర్పు వచ్చింది. ఆ తర్వాత ప్రధాన న్యాయమూర్తి సిక్రీ పదవీ విరమణ చేశారు. సిక్రీ వారసునిగా పదోన్నతికి అర్హులైన వారు ముగ్గురు సీనియర్ జడ్జీలు నాడు ఉన్నారు. వారే షెలాత్, గ్రోవర్, హెగ్డే. కానీ ఆ ముగ్గురి కన్నా జూని యర్ జస్టిస్ ఎ.ఎన్.రేకు  ఇందిర పదోన్నతి కల్పించారు. దాంతో అన్ని రాజ్యాంగ సూత్రాలకు క్రమంగా ‘దేవిడి మన్నా’ చెప్పేశారు.

 

 పౌర ప్రాథమిక హక్కుల స్థానంలో పార్లమెంటు మాట మాత్రమే ‘బ్రూట్’ మెజారిటీ ఆధారంగా  చెల్లుబడి కావాలి తప్ప, రాజ్యాంగ నిబం ధనలు కాదన్న కొత్త సంప్రదాయం వచ్చింది. ఇది తప్పు డు 42వ  రాజ్యాంగ సవరణ ద్వారా జరిగింది. ఎలా? పాలకులే ‘ప్రజా సంక్షేమానికి’, ‘ప్రజాస్వామ్య సంస్థ’ లకు శ్రీరామరక్ష అనీ, అందుకు న్యాయవ్యవస్థలో ఉన్న వారు విరోధులనీ జడ్జీలపై విరుచుకు పడిన సవరణ అది. తమ నిర్ణయాలకు ఎదురు చెప్పకుండా న్యాయ మూర్తులను లొంగదీసుకునేందుకే ఈ సవరణ తెచ్చారు. కానీ ఈ పరిణామాలన్నీ ఆ తర్వాత అధికారానికి వచ్చిన పాలకులు తెచ్చిన 44వ రాజ్యాంగ సవరణ వల్ల గాలిలో కలసి పోవలసివచ్చింది! జీవించే  హక్కును అవహేళన చేసి, హరించివేసిన ఎమర్జెన్సీ నాటి దుర్దినాలవి. 14 మంది జడ్జీల బదిలీల విషయంలో కూడా స్వార్థ ప్రయోజనాలకే కాంగ్రెస్ పాలకులు ప్రాధాన్యమిచ్చారు!

 

 బొప్పికట్టించిన బొమ్మయ్ కేసు

 1994 నాటి బొమ్మమ్(కర్ణాటక) కేసులో మాడు పగిలే తీర్పును 9 మంది జడ్జీలతో కూడిన సుప్రీం ధర్మాసనం వెలువరించే దాకా కాంగ్రెస్ పాలకుల అధికార దాహా నికి ‘చెక్’ పడలేదు! మళ్లీ 20 ఏళ్ల తర్వాత గానీ తన పాల నలోనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించక తప్పలేదు. బొమ్మయ్ కేసులో మెజారిటీ (9 మందిలో) న్యాయమూర్తులు ప్రభుత్వ నిర్ణయాలను న్యాయస్థాన సమీక్షలకు అతీతం కాజాలవనీ, పాలనా వ్యవహారాల నిర్వహణ విషయంలో వర్తించే న్యాయ సమీక్షతో (జ్యుడీషియల్ రివ్యూ) రాజ్యాంగ చట్ట నిబంధనలకూ వర్తిస్తాయని తీర్పు చెప్పారని మరవరాదు.

 

 అయితే కోర్టులకు వెళ్లినా ఏమీకాదన్న అతని భరోసా వెనుకదాగిన రహస్యాన్ని కూడా గత చరిత్ర నుంచి పరిగణనలోకి మనం తీసుకోవాలి! అవి సుప్రీం నిర్ణయాలే కావచ్చు. అయినా పదవీ విరమణానంతర పదవులను ఆశించే కొందరు ఇచ్చే తీర్పులు ప్రజాహితమైనవిగా ఉండగలవనీ భావించలేం. జైరాం భరోసా వెనుక ఉన్నది ఇదే అయితే చెప్పగలిగింది లేదు! కాని‘జడ్జి’ల కుంభకోణాలపై సుప్రీం హెచ్చరికలు, తీర్పులు మంచి రోజులకే సూచనగా భావించవచ్చు!    

 (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు)

 ఏబీకే ప్రసాద్

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top