ఆశల పాలసీ అమలెప్పుడో..

Special Story on NRI Policy - Sakshi

ఎన్నారై పాలసీ కోసం ఎదురుచూస్తున్న ప్రవాసులు

ప్రవాసీ విధానం అమలైతే తమ బతుకులు మారుతాయని భావిస్తున్న గల్ఫ్‌ వలస కార్మికులు

ఇప్పటికే ముసాయిదా సిద్ధం చేసిన ప్రభుత్వం

పాలసీ అమలుకు పోరాటం చేస్తున్న సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు  

సాక్షి, నెట్‌వర్క్‌: ప్రవాసుల రక్షణ, సంక్షేమం కోసం ఎన్నారై పాలసీ(ప్రవాసీ విధానం)ని అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందోనని ప్రవాసులు ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా గల్ఫ్‌ ప్రవాస కార్మికులు ఈ పాలసీ కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకున్న గల్ఫ్‌ ప్రవాస కార్మికులు ఎన్నారై పాలసీ అమలు కోసం చర్చను సాగిస్తున్నారు. ఫేస్‌బుక్, వాట్సప్, ఐఎంవో(ఇమో), టెలిగ్రామ్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో కొన్ని రోజులుగా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ జీవితాలు బాగుపడుతాయని భావించిన గల్ఫ్‌ కార్మి కులు ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. తెలంగాణ ఉద్యమానికి గల్ఫ్‌ కార్మికులు అండగా నిలువడంతో 2014లో జరిగిన సాధారణ ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీ తన మేనిఫెస్టోలో ఎన్నారై పాలసీ అమలును ప్రధానాంశంగా చేర్చింది. టీఆర్‌ఎస్‌ అధికారం చేపట్టాక అప్పటి ఎన్నారై మంత్రి కేటీఆర్‌ 2016 జూలై 27న హైదరాబాద్‌లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ముసాయిదాను సైతం రూపొందించగా సాధారణ పరిపాలన శాఖ, హోం, పరిశ్రమలు, ఐటీ, కార్మిక ఉపాధి, ఆర్థిక, నైపుణ్య అభివృద్ధి, సాంస్కృతిక పర్యాటక శాఖ, టామ్‌కామ్‌లకు ప్రభుత్వం పంపించింది. ఆయా శాఖల సూచనలను పరిగణనలోకి తీసుకున్నారు. ఆ ముసాయిదా మంత్రి మండలి ఆమోదం పొందాల్సి ఉంది. ఎన్నారై పాలసీ అమలైతే తమ జీవితాలు బాగుపడటానికి ఒక మార్గం ఏర్పడుతుందని ప్రవాసీలు భావిస్తున్నారు.

ముసాయిదాలో ఉన్న అంశాలు ఇవీ..
గల్ఫ్‌ దేశాలకు వెళ్లే కార్మికులకు వీసా చార్జీ లు, రిక్రూట్‌మెంట్‌ ఫీజులు తదితర ఖర్చు ల కోసం పావలా వడ్డీ రుణాలు లభిస్తాయి.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముద్ర పథకంతో అనుసంధానం. అల్పాదాయ కార్మికులను ఆదుకోవడానికి తెలంగాణ స్టేట్‌ ఎన్నారై వెల్ఫేర్‌ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని నిర్దేశించారు.
ప్రభుత్వం, వృత్తి నిపుణులు, పారిశ్రామికవేత్తలు తదితరుల నుంచి విరాళాలను సేకరించి తెలంగాణ స్టేట్‌ ఎన్నారై వెల్ఫేర్‌ ఫండ్‌లో జమ చేస్తారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలలో లబ్ది పొందని పేద కార్మికులను ఆదుకోవడానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించడానికి ఈ నిధిని వినియోగిస్తారు.
విదేశాల్లో మరణించిన వారి శవపేటికలను హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి వారి స్వగ్రామాలకు తరలించడానికి ఉచిత అంబులెన్స్‌ సౌకర్యం
కల్పిస్తారు. రేషన్‌కార్డు విధానంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల కుటుంబాలకు ఉచిత అంబులెన్స్‌ సౌకర్యం వర్తింపజేస్తారు.
విదేశీ జైళ్లలో మగ్గుతున్న ప్రవాసులకు న్యాయ సహాయం అందిస్తారు.
హైదరాబాద్‌లో ఎన్నారై భవన్‌ను ఏర్పాటు చేస్తారు
గల్ఫ్‌ దేశాల నుంచి ఇంటికి చేరిన వారికి పునరావాసం, పునరేకీకరణకు ప్రత్యేక పథకం రూపకల్పన జరుగుతుంది. కొత్తగా వ్యాపారాలు, చిన్న తరహా పరిశ్రమలు స్థాపించుకోవడానికి రుణ సదుపాయం కల్పిస్తారు.
గల్ఫ్‌ ప్రవాస కార్మికుల కుటుంబాలకు తెల్ల రేషన్‌కార్డులు, ఆరోగ్యశ్రీ, పావలా వడ్డీకి రుణాలు, గృహ నిర్మాణం కోసం ఆర్థిక సహాయం వంటి పథకాలను అమలు చేస్తారు.
24 గంటల పాటు హెల్ప్‌లైన్‌
విదేశాల్లో ఉన్న వలస కార్మికులు, ఉద్యోగులు, వృత్తి నిపుణులు, విద్యార్థుల రిజిస్ట్రేషన్‌ కోసం ‘ప్రవాసీ తెలంగాణ’ వెబ్‌ పోర్టల్‌ ఏర్పాటు
ధనవంతులైన ఎన్నారైలు గ్రామాలను దత్తత తీసుకునేలా ప్రోత్సాహం
అందించడం.
ప్రవాసుల సంక్షేమానికి తగిన బడ్జెట్‌ను కేటాయించడం.

ఎన్నారై పాలసీని సాధించుకోవాలి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ హయాంలో ప్రవేశపెట్టిన లక్ష రూపాయల మృతధన సహాయం ఇప్పుడెందుకు ఆగిపోయింది. ప్రవాసులకు రూ.500 కోట్ల కేటాయింపు ఏమైంది. గల్ఫ్‌లోని ఎంబసీలలో తెలుగు మాట్లాడే సిబ్బందిని నియమించాలి. మనమంతా ఒక్కటై  ఎన్నారై పాలసీని సాధించుకోవాలి.–మెట్టా హేమలత, దుబాయి  

హామీ ఇచ్చి ఆరేళ్లు..
ఎన్‌ఆర్‌ఐ పాలసీ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నారైలు అంతా కలిసి రాష్ట్ర సాధనకు ఎంతో కృషి చేశారు. కేటీఆర్‌ దుబాయిలో పర్యటించినప్పుడు ఎన్‌ఆర్‌ఐ పాలసీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆరేళ్లు గడుస్తున్నప్పటికీ ఆ ఊసే లేదు. ఎన్నారై పాలసీ అమలైతే గల్ఫ్‌లోని కార్మికులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. మోసపోయిన కార్మికులను న్యాయపరంగా ఆదుకునే అవకాశం ఉంటుంది.  – కట్కం రవి, తెలంగాణ గల్ఫ్‌కల్చరల్‌ అసోసియేషన్‌ కోశాధికారి, దుబాయి

నకిలీ ఏజెంట్లను అరికట్టవచ్చు
ఎన్‌ఆర్‌ఐ పాలసీ అమలైతే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులను మోసం చేసే ఏజెంట్లను అరికట్టవచ్చు. అంతేకాకుండా ఎన్‌ఆర్‌ఐ పాలసీ అమలు వల్ల కార్మికులు వెళ్లే దేశాల నియమ నిబంధనలు తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా గల్ఫ్‌ దేశాల్లో వారికి ఒక చట్టబద్దత కల్పించే అవకాశం ఉంది. అంతేకాకుండా కార్మికులకు చట్టపరంగా రక్షణ ఉంటుంది. ఇన్సూరెన్స్‌ కల్పించే అవకాశం ఉంది.
– రఘుపతిరెడ్డి, రాయికల్‌

వెంటనే అమలు చేయాలి 
ఎన్‌ఆర్‌ఐలు.. ప్రధానంగా గల్ఫ్‌ కార్మికులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఎన్‌ఆర్‌ఐ పాలసీని వెంటనే అమలు చేయాలి. ఎన్‌ఆర్‌ఐ పాలసీ అమలులో కాలయాపన తగదు. ఎన్‌ఆర్‌ఐలకు పెన్షన్‌ పథకం అమలు చేయాలి. ప్రత్యేక బీమా పథకం కూడా అమలు చేయాలి. ఎన్‌ఆర్‌ఐలకు రేషన్‌కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలి. వారి పిల్లలకు ఉచిత విద్య అందించే ఏర్పాట్లు చేయాలి. ఇవన్నీ ఎన్‌ఆర్‌ఐ పాలసీ ద్వారానే సాధ్యమవుతుంది. ఎన్‌ఆర్‌ఐ పాలసీ అమలులో నిర్లక్ష్యం సరైంది కాదు.     – స్వర్ణ సుధాకర్, బహ్రెయిన్‌

వలస కార్మికుల జీవితానికి భరోసా కల్పించాలి  
వలస కార్మికులకు ముఖ్యంగా గల్ఫ్‌ ప్రవాసీలకు వారి జీవితాలపై భరోసా కల్పించాలి. ఇది ఎన్‌ఆర్‌ఐ పాలసీతోనే సాధ్యమవుతుంది. వలస కార్మికులకు ఆర్థిక భద్రత, ఆరోగ్య పరిరక్షణ, ఉద్యోగ భద్రత లభించడానికి ఎన్‌ఆర్‌ఐ పాలసీ ఒక్కటే మార్గం. ఎన్‌ఆర్‌ఐ పాలసీ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం తగదు. ఎంతో కాలంగా ఎన్‌ఆర్‌ఐ పాలసీ కోసం ఎదురుచూస్తున్నారు. అందరి ఆశలను నిలబెట్టడానికి ప్రభుత్వం చొరవ చూపాలి.   – చింతకింది స్వాతి, ఒమన్‌

ఆచరణలో ముందడుగు పడాలి
నాలుగేళ్ల క్రితం ప్రవాసీ పాలసీ రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. దీనికి కార్యాచరణ రూపొందించినా అమలులో ఆలస్యం జరుగుతోంది. వచ్చే బడ్జెట్‌లో ప్రవాసీల సంక్షేమానికి రూ.500కోట్లు
కేటాయించాలి. ప్రవాసీ మంత్రిత్వ శాఖ, సచివాలయంతో పాటు జిల్లాలు, మండలాల వారీగాఎన్నారై సెల్‌ ఏర్పాటు చేయాలి. విదేశాల్లో చనిపోయిన వారికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. ఎయిర్‌పోర్టులో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలి. ప్రవాసీల వివరాల కోసం సమగ్ర సర్వే నిర్వహించాలి. వలసలకు కారణాలను వి శ్లేషించి తదనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తే బాగుంటుంది. ప్రవాసీలకు పింఛన్, ప్రమాద బీమా, పునరావాసం కల్పించాలి.   – బొలిశెట్టి వెంకటేశ్,  ఎన్నారై, బహ్రెయిన్‌

పాలసీతో భరోసా ఇవ్వాలి..
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా ఎన్నారై పాలసీపై దృష్టిపెట్టాలి. మా వేదిక తరఫున చాలాసార్లు నిరసనలు, ఆందోళన తెలిపాం. పలు డిమాండ్లను ప్రభుత్వానికి తెలిపాం. ఉపాధి కోసం వచ్చి విదేశాల్లో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.15లక్షలు ఇవ్వాలి. నకిలీ ఏజెంట్లపై చర్యలు చేపట్టాలి. విదేశాల్లో నివసించే అర్హులకూ కూడా పథకాలు అందేలా చూడాలి. మండలాల వారీగా యువతకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాంలు చేపట్టాలి. విదేశాల్లో చనిపోయినవారిని తీసుకురావడానికి ఆర్థికసాయం చేయాలి. వారి ఇంటి వరకూ మృతదేహం చేరేందుకు అయ్యే ఖర్చులు భరించాలి. గల్ఫ్‌ దేశాల్లో సహాయ కేంద్రాలు, హైదరాబాద్‌లో ఎన్‌ఆర్‌ఐ భవన్‌ ఏర్పాటు చేయాలి. జైళ్లలో మగ్గుతున్న వారికి న్యాయ సహాయం చేయాలి.  – దొంతుల శివాజీ, గల్ఫ్‌ కార్మికుల అవగాహన వేదిక కన్వీనర్, సౌదీ అరేబియా  

పాదయాత్రకు సిద్ధం..
ఇప్పటికీ తెలంగాణ నుంచి గల్ఫ్‌ దేశాలకు వలసలు కొనసాగుతునే ఉన్నాయి. అవగాహన లేక ఏజెంట్ల, కంపెనీల మోసాలకు వందలాది మంది బలవుతున్నారు. ఇక్కడి చట్టాలపైనా అవగాహన లేకపోవడంతో ఎంతోమంది గల్ఫ్‌ దేశాల జైళ్లలో మగ్గుతున్నారు. వాళ్ల కుటుంబాలు స్వదేశంలో అనాథలుగా మిగిలాయి. ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఏడాదికి దాదాపు రూ.1200 కోట్ల రాబడి మా నుంచి తెలంగాణ ప్రభుత్వానికి వెళ్తోంది. దాన్నుంచే గల్ఫ్‌ బాధితులను, వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నాం. ఇక ఎన్నారై పాలసీ కోసం రెండున్నరేళ్ల నుంచి గల్ఫ్‌ కార్మికుల అవగాహన వేదిక ద్వారా పోరాడుతూనే ఉన్నాం. ఎన్నో నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపట్టాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే.. గల్ఫ్‌ వలస ప్రాంతాలైన ఖానాపూర్, మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల, సిరిసిల్ల తదితర ప్రాంతాల మీదుగా హైదరాబాద్‌ వరకు పాదయాత్ర చేపడతాం. ఇందులో భాగంగా ప్రతీ ఊరిలో బాధితుల కష్టాలను తెలుసుకుంటాం. ఎన్నారై పాలసీ అమలు కోసం ఆమరణదీక్ష చేసేందుకైనా సిద్ధంగా ఉన్నా.
– దొనికెన కృష్ణ, గల్ఫ్‌కార్మికుల అవగాహన వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు, యూఏఈ

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top