ఒకే పులి..! 

only one tiger in nirmal forest - Sakshi

జిల్లాలో పులుల కన్నా.. చిరుతలే ఎక్కువ 

సంఖ్య పెంచుకున్న ఎలుగుబంట్లు 

అడవి బర్రెలు, కుక్కలూ ఎక్కువే 

ఆ రెండు రేంజ్‌ల్లోనే అధిక జంతువులు 

జిల్లాలో పెరుగుతున్న జంతువుల సంఖ్య 

నిర్మల్‌ : మన జిల్లాలో పెద్దపులి అరుపులకన్నా.. మెరుపువేగంతో దూసుకెళ్లే చిరుతలే ఎక్కువగా ఉన్నాయి. ఇక ఎలుగుబంట్లూ తామేం తక్కువ కాదన్నట్లు సంఖ్య పెంచుకుంటున్నాయి. అడవి బర్రెలు, కుక్కలూ వందల్లో తమ ప్రాబల్యాన్ని చాటుకుంటున్నాయి. వీటిలో అధికశాతం జంతువులన్నీ కవ్వాల్‌ అభయారణ్యం పరిధిలోని కడెం, ఖానాపూర్, పెంబి రేంజ్‌ల్లోనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లకోసారి చేపట్టే జంతుగణన జిల్లాలో జనవరి 22 నుంచి 28వరకు పూర్తయింది. అటవీశాఖ అధికారులు, సిబ్బందితో పాటు పలువురు స్వచ్ఛంద సభ్యులు కూడా అడవుల్లో సంచరిస్తూ జంతువుల అడుగులు, వివిధ గుర్తులతో లెక్కింపు చేపట్టారు.  

పక్కా తేలని పులి లెక్క.. 
పులులకు సంబంధించిన కవ్వాల్‌ అభయారణ్యం ఉన్న నిర్మల్‌ జిల్లాలో ఒకటి లేదంటే రెండు మాత్రమే పెద్దపులులున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో దొరికిన ఆధారాలను బట్టి మూడు కూడా ఉండవచ్చంటున్నారు. దాదాపు ఒకట్రెండు పులులే వివిధ ప్రాంతాల్లో సంచరించి ఉంటాయన్న అనుమానాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇవి.. ఒకటా..రెండా.. మూడా అన్నది తేలాలంటే వాటి గుర్తులు, ఆనవాళ్ల ఆధారంగా ల్యాబ్‌ నుంచి రిపోర్ట్‌ వచ్చిన తర్వాతే తేలుతుందని చెబుతున్నారు. జనవరి 22న ఖానాపూర్‌ రేంజ్‌ సోమావార్‌పేట్, కడెం రేంజ్‌లోని అల్లంపల్లి అటవీ ప్రాంతాల్లో పులి పాద ముద్రలు, మలం కనిపించాయి. వీటి ఆధారంగా రెండు పులులున్నట్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఒకటే పులి ఆయా ప్రాంతాల్లో సంచరించి ఉండవచ్చన్న అనుమానాలున్నాయి. 

చిరుతలు.. ఎలుగులే ఎక్కువ.. 
పెద్దపులి తర్వాత ప్రధాన మాంసాహార జంతువుల్లో చిరుతపులుల సంఖ్య జిల్లాలో 30 ఉన్నట్లు గణనలో పేర్కొన్నారు. వీటికి రెండింతలు అంటే 60 ఎలుగుబంట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ మధ్యకాలంలో వీటి సంఖ్య బాగానే పెరిగిందని అంచనా వేస్తున్నారు. చిరుతలు తరచూ జనావాసాల్లోకి వస్తున్న సంఘటనలను బట్టి వీటి సంఖ్య పెరిగిందనే చెబుతున్నారు. ఇటీవల నర్సాపూర్‌(జి) మండలంలోనూ చిరుత పశువులను చంపింది. ఎలుగుబంట్లు, చిరుతల కంటే ఎక్కువగా అడవి బర్రెలు 250, అడవి కుక్కలు 200 ఉన్నాయి.  

ఆ రేంజ్‌ల్లోనే ఎక్కువ.. 
చదువులమ్మ కొలువైన బాసర నుంచి కడెం వరకు నిర్మల్‌ జిల్లా విస్తరించి ఉంది. గోదావరి సరిహద్దుగా ఉన్న జిల్లాలో ముథోల్, నిర్మల్‌ నియోజకవర్గాలకంటే ఖానాపూర్‌ నియోజకవర్గంలోనే అటవీశాతం ఎక్కువగా ఉంది. అందువల్లే.. ఈ నియోజకవర్గంలోని అటవీరేంజ్‌లైన ఖానాపూర్, కడెం, పెంబిల్లోనే జంతువుల సంఖ్య ఎక్కువగా ఉంది. కవ్వాల్‌ అభయారణ్యం పరిధిలోని ఈ రేంజ్‌లో దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. కడెం రేంజ్‌ పరిధిలోని అల్లంపల్లి, ఖానాపూర్‌ పరిధిలోని సోమార్‌పేట్‌లోనే పులుల సంచారాన్ని గుర్తించారు. పులులు, చిరుతలు, ఎలుగుంట్లతో పాటు అడవి పిల్లులు, మర్నాగిలు, నక్కలు, తోడేళ్లు, జింకలు, నీలుగాయిలు, అడవి పందులు, హైనాలు జిల్లా అడవుల్లో ఉన్నట్లు గుర్తించారు. మొత్తం మీద జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతాల్లో నాలుగేళ్లలో జంతువుల సంఖ్య పెరిగినట్లుగా అధికారులు నిర్ధారించారు. 

దట్టమైన అడవుల్లోకి వెళ్లి.. 
గత నెల 22నుంచి 24వరకు మాంసాహార, 25 నుంచి 28వరకు ఇతర జంతువులను లెక్కించారు. ప్రధానంగా నీటిలభ్యత ఉండే ప్రాంతాల్లో, బురద మడుగుల్లో జంతువుల పాదముద్రలను ఎక్కువగా గుర్తించారు. దట్టమైన అడవుల్లో కిలో మీటర్ల పొడవునా అటవీశాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది, వలంటీర్లు తిరుగుతూ జంతుగణన చేపట్టారు. అడుగులతో పాటు మలమూత్రాలను సేకరించారు. వీటి ఆధారంగానే ప్రస్తుతం జిల్లాలోని జంతువుల సంఖ్యను అంచనా వేశారు. పక్కగా వీటి సంఖ్యను గుర్తించడానికి పాద ముద్రలను ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో సేకరించారు. మలమూత్రాలను హైదరాబాద్‌లోని సీసీఎంబీ(సెంటర్‌ ఫర్‌ సెల్యూలర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ) ల్యాబ్‌కు పంపించారు. అక్కడ పరీక్షించిన అనంతరం ఏయే జంతువులు ఎన్ని ఉన్నాయనేది పక్కాగా లెక్క తేలుతుందని అధికారులు పేర్కొంటున్నారు. శాకాహార జంతువులకు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం అప్‌లోడ్‌ ఇంకా కొనసాగుతోంది. 

జిల్లాలో అడవుల వివరాలు.. 
జిల్లా అటవీ విస్తీర్ణం : 1,20,566.75 హెక్టార్లు 
కోర్‌ ఏరియా : 50,036.48 హెక్టార్లు 
బఫర్‌ ఏరియా : 20,369.26 హెక్టార్లు 
అటవీ శాతం : 33.08 
అటవీ డివిజన్‌లు : నిర్మల్, ఖానాపూర్‌ 
రేంజ్‌లు : నిర్మల్, భైంసా, మామడ, 
దిమ్మదుర్తి (నిర్మల్‌ డివిజన్‌) 
ఖానాపూర్, కడెం, పెంబి, ఉండుంపూర్‌ (ఖానాపూర్‌ డివిజన్‌) 

జంతుగణన ప్రకారం.. 
పులులు    :    2 
చిరుత పులులు    :    30 
ఎలుగుబంట్లు    :    60 
అడవి బర్రెలు    :    250 
అడవి కుక్కలు    :    200 

అడవులతో పాటు జంతురక్షణ 
జిల్లాలో నాలుగేళ్ల వ్యవధిలో జంతువుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం జిల్లాలో రెండు పులులు సంచరిస్తున్నట్లు గుర్తించాం. వీటితోపాటు 30 చిరుతలు, 60ఎలుగుబంట్లు ఉన్నాయి. అడవులను కాపాడడంతో పాటు జంతుపరిరక్షణ చేపడుతున్నాం. జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజల సహకారం చాలా అవసరం. 
– దామోదర్‌రెడ్డి, జిలా అటవీశాఖాధికారి 
 

Read latest Nirmal News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top