
ప్రజలు నగదు ఎలా మార్చుకోవాలి?
పాత పెద్ద నోట్ల రద్దును స్వాగతిస్తున్నాం, కానీ అమలులో లోపాలున్నాయని వైఎస్సార్ సీపీ ఎంపీలు అన్నారు.
న్యూఢిల్లీ: పాత పెద్ద నోట్ల రద్దును స్వాగతిస్తున్నాం, కానీ అమలులో లోపాలున్నాయని వైఎస్సార్ సీపీ ఎంపీలు అన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా నోట్లను రద్దు చేయడంతో రైతులు, కూలీలు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. సహచర ఎంపీలతో కలిసి గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బ్యాంకులు లేని గ్రామాల్లో ప్రజలు నగదు ఎలా మార్చుకోవాలని అన్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను టీడీపీ నేతలు ఎలా కొన్నారని ప్రశ్నించారు. నల్లధనంతో ఎన్నికల్లో కొందరు విపరీతంగా ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు.
పాత పెద్ద నోట్ల రద్దుతో గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సదుపాయమే లేదని అన్నారు. పెద్ద నోట్ల రద్దుపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రధాని మోదీ నిర్వహించిన సర్వేలో చాలా కొద్దిమంది మాత్రమే పాల్గొన్నారని చెప్పారు.
నల్లధనం నియంత్రణకు రెండున్నరేళ్లలో మోదీ సర్కారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఎంపీ వరప్రసాద్ విమర్శించారు. పాత పెద్ద నోట్ల రద్దుతో ప్రజలను అనవసరంగా బాధ పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత, మృత్స్యకారులు, రైతులను బాధ పెట్టడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరారు. విలేకరుల సమావేశంలో వైఎస్ అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి కూడా పాల్గొన్నారు.