
‘మాకు పారికర్ కావాలంతే..’
గోవా ఎన్నికలు ముగిసి హంగ్ పరిస్థితి ఏర్పడింది. ఎవరికీ పూర్తి స్థాయి విజయం అందలేదు. అలాగే ఎవరికీ మేజిక్ ఫిగర్ కూడా సొంతం కాలేదు.
పంజిమ్: గోవా ఎన్నికలు ముగిసి హంగ్ పరిస్థితి ఏర్పడింది. ఎవరికీ పూర్తి స్థాయి విజయం అందలేదు. అలాగే ఎవరికీ మేజిక్ ఫిగర్ కూడా సొంతం కాలేదు. దీంతో ప్రస్తుతం గోవాలో ప్రభుత్వం ఏ పార్టీ ఏర్పాటుచేస్తుందనే విషయంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే తమకు నాయకత్వం ఒక్క మనోహర్ పారికర్ మాత్రమే వహించాలని ప్రస్తుతం ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి కూడా సంకేతాలు పంపించారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న ఆయనే తమకు ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారు.
మొత్తం 40 స్థానాలు ఉన్న గోవా ఎన్నికల్లో బీజేపీకి 13 స్థానాలు దక్కాయి. అధికారం చేపట్టాలంటే కనీసం 21 స్థానాలు ఉండాలి. మరోపక్క కాంగ్రెస్ పార్టీకి 17 దక్కాయి. ఇతరులు పది స్థానాలు గెలుచుకున్నారు. అయితే, గోవాలో కూడా తామే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని చెప్పడంతోపాటు ఇతర స్థానాల్లో గెలుపొందినవారు కూడా బీజేపీకే మద్దతిచ్చే యోచనలో ఉన్నారంట.
ఇదే జరిగితే.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే మరోసారి పారికర్‌నే ముఖ్యమంత్రి సీట్లో కూర్చొబెట్టే అవకాశం ఉందని అంటున్నారు. గత ఎన్నికల్లో పార్టీని గెలిపించిన పారికర్‌ను 2014 కేంద్ర రక్షణశాఖలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన అక్కడికి వెళ్లిన తర్వాత ప్రతిపక్ష పార్టీలకు బలం చేకూరినట్లయిందని, మాజీ ముఖ్యమంత్రి పర్సేకర్ ఆయన స్థానాన్ని భర్తీ చేయలేకపోయారని బీజేపీ వర్గాలు అంటున్నాయి.