మతానికి అసలు నిర్వచనం చెప్పారు

These Hindu And Muslim Families Swapped Kidneys - Sakshi

చండీగఢ్‌ : ‘మతం’ నువ్వు సంతోషంగా ఉంటూ.. తోటి వారికి మేలు చేయడానికి నిర్దేశించిన ఓ మార్గం. మనిషికి ప్రశాంతతను చేకూర్చడం.. హద్దు మీరకుండా.. సంఘానికి మేలు చేసే విధంగా జీవించడం ఎలానో వివరించేది మతం. కానీ నేటి సమాజంలో ఈ పరిస్థితులు పూర్తిగా మరిపోయాయి. ముఖ్యంగా ఓ మతం వారిని వేధిస్తూ.. దాడులకు పాల్పడటం.. హింసాకాండను సృష్టించడం నిత్యకృత్యమయ్యింది. ఒకప్పుడు హిందూ ముస్లిం భాయి భాయిగా విలసిల్లిన సంస్కృతి క్రమేపీ క్షీణిస్తుంది. ఇలాంటి రోజుల్లో.. ఇప్పుడు చెప్పబోయే సంఘటన గురించి తెలిస్తే.. మనసుకు సంతోషం కల్గుతుంది. పర్లేదు మన సమాజంలో మానవత్వం ఇంకా మిగిలే ఉందనిపిస్తుంది.

ఓ ముస్లిం వ్యక్తికి హిందువు.. హిందూ స్త్రీకి ముస్లిం మహిళ కిడ్నీ దానమిచ్చి సాయానికి మతంతో సంబంధం లేదని నిరూపించారు. వివరాలు.. కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా కరేరి గ్రామానికి చెందిన అబ్దుల్‌ అజిజ్‌ నజర్‌(53) కార్పెంటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో కిడ్నీలో రాళ్లు రావడంతో అతని రెండు కిడ్నీలు పూర్తిగా పాడయ్యాయి. దాత కోసం వెతకడం ప్రారంభించాడు. ఫలితం లేకపోవడంతో ఓ ఆన్‌లైన్‌ యాప్‌లో తన బ్లడ్‌ గ్రూప్‌, సమస్య వివరాలను రిజిస్టర్‌ చేశాడు. దేవుడి మీద భారం వేసి.. దాత కోసం ఎదురు చూడసాగాడు.

అటు బిహార్‌కు చెందిన సుజిత్‌ కుమార్‌ సింగ్‌ భార్య మంజులకు కూడ రెండు కిడ్నీలు చెడిపోయాయి. ఆమె కూడ దాత కోసం గాలిస్తూ.. ఫలితం లేక.. అబ్దుల్‌లానే యాప్‌లో తన వివరాలు పొందుపరిచింది. అదృష్టవశాత్తు అబ్దుల్‌ బ్లడ్‌ గ్రూప్‌, సుజిత్‌ బ్లడ్‌ గ్రూప్‌లు.. అలానే మంజుల, అబ్దుల్‌ భార్య షాజియా(50)ల బ్లడ్‌ గ్రూప్‌లు సరిపోయాయి. దాంతో వారు ఒకరికొకరు కిడ్నీ దానం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వీరి సొంత రాష్ట్రాల్లో ఈ కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌లకు అనుమతి లభించలేదు.

దాంతో పంజాబ్‌లో వీరికి సర్జరీ నిర్వహించారు. పంజాబ్‌ మొహాలి ఆస్పత్రి వీరికి వైద్య పరీక్షలు నిర్వహించి.. ఎటువంటి సమస్యలు లేవని నిర్థారించిన తర్వాత ఆపరేషన్‌ చేసి.. కిడ్నీ మార్పిడి చేశారు. డాక్టర్‌ ప్రియదర్శి రంజన్‌ ఒక్క రోజు వ్యవధిలోనే ఈ నాలుగు ఆపరేషన్‌లను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సదరు డాక్టర్‌ మాట్లాడుతూ.. ‘ఇది చాలా కష్టమైన ఆపరేషన్‌. ఇక్కడ సమస్య మతం కాదు.. అంతరాష్ట్ర అవయవ మార్పిడి నిబంధనలు చాలా ఇబ్బంది కల్గించాయి. రెండు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన దాతలు, గ్రహీతలకు మూడో రాష్ట్రంలో ఆపరేషన్‌ నిర్వహించడం చాలా కష్టమైన టాస్క్‌’ అన్నారు.

‘ఇక్కడ ప్రధానంగా నేను మూడు సమస్యలు ఎదుర్కొన్నాను. మొదటిది వైద్య సంబంధిత ఇబ్బందులు.. రెండు అంతరాష్ట్ర అవయవ మార్పిడి నిబంధనలు.. మూడు మతం. అయితే వైద్యశాస్త్రంలో మానవత్వానికే మొదటి ప్రాధాన్యత. అందుకే ఈ సమస్యల్ని అధిగమించగలిగాను’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నలుగురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.

అబ్దుల్‌ మాట్లాడుతూ.. ‘నా దేహంలో ఒక కిడ్నీ.. హిందువుది అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఆపరేషన్‌కు గాను నాకు రూ. 7లక్షలు ఖర్చయ్యింది. అయితే ప్రభుత్వం నుంచి నాకు ఎలాంటి సాయం అందలేద’ని వాపోయాడు. సుజిత్‌ కుమార్‌, మంజుల కూడా చాలా సంతోషంగా ఉన్నారు. నా దేహంలో ఓ ముస్లిం మహిళ అవయవం ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదన్నారు మంజుల.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top