ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విజ్ఞప్తి చేశారు.
వెంకయ్య నాయుడికి మంద కృష్ణ విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విజ్ఞప్తి చేశారు. ఈమేరకు బుధవారం ఢిల్లీలోని వెంకయ్య నాయుడి నివాసంలో కలసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఎన్డీయే అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని వెంకయ్య నాయుడు ఇచ్చిన హామీని మరోసారి గుర్తు చేశారు. బీజేపీ పూర్తి మెజారిటీతో కేంద్రంలో అధికారంలో ఉన్నందున ఆ హామీని నిలబెట్టుకోవాలని కోరారు.
వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి మాదిగలు, మాదిగ ఉప కులాల జీవితాల్లో వెలుగు నింపుతారని ఆశిస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. ఉమ్మడి రిజర్వేషన్ల విధానం వల్ల మాదిగలకు జరుగుతున్న నష్టాన్ని 1982 లోనే వెంకయ్యనాయుడు గుర్తించారన్నారు. గత యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నంలో బీజేపీ తరఫున ఎల్.కె.అద్వానీ, నితిన్ గడ్కారీతో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేఖలు రాయించారని పేర్కొన్నారు.