
దళితుల బిడ్డల పెళ్లికి ఠాకూర్లే పెద్దలు!
అల్లర్లకు కేంద్రస్థానమైన షబ్బీర్‌పూర్ గ్రామంలో ఇద్దరు దళిత యువతుల పెళ్లిళ్లకు ఠాకూర్ల కుటుంబ సభ్యులే పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు.
ఒకవైపు సహారన్‌పూర్ జిల్లా దళితులు - ఠాకూర్ల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతోంది. ఒకరినొకరు చంపుకోవడం, గృహదహనాల లాంటివి అక్కడ జరుగుతున్నాయి. అయితే, ఈ అల్లర్లకు కేంద్రస్థానమైన షబ్బీర్‌పూర్ గ్రామంలో ఇద్దరు దళిత యువతుల పెళ్లిళ్లకు ఠాకూర్ల కుటుంబ సభ్యులే పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. షబ్బీర్‌పూర్‌కు చెందిన ఫకీర్ చంద్ కుమార్తెలు ప్రీతి, మనీషా ఇద్దరికీ పెళ్లిళ్లు కుదిరాయి. దీనికి షబ్బీర్‌పూర్ మాజీ ప్రధాన్ ఠాకూర్ ఓం సింగ్, మహేష్‌పూర్ గ్రామం మాజీ ప్రధాన్ నక్లీ సింగ్ ఇద్దరూ ఈ పెళ్లిళ్లను తమ చేతుల మీదుగా చేయించాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు, పెళ్లికొడుకులకు తమ ఇళ్లలోనే విడిది ఏర్పాటు చేశారు. కులాల అడ్డంకులను తోసిరాజని, పెళ్లికొడుకుల ఊరేగింపు (బారాత్)ను కళ్యాణమండపం వరకు దగ్గరుండి తీసుకెళ్లి, వాళ్లను సంప్రదాయపద్ధతిలో స్వాగతించారు.
ఇరువర్గాలకు చెందిన యువకులు కలిసి బారాత్‌లో డాన్సు చేశారు. గత కొన్ని వారాలుగా కేవలం హింసాత్మక ఘటనలను మాత్రమే చూస్తున్న ఆ గ్రామం కాస్తా ఇప్పుడు ఠాకూర్లు.. దళితులు కలిసి ఒకే పెళ్లిలో బాలీవుడ్ పాటలకు కలిసి డాన్సు చేయడం చూసి ఎంతో సంతోషించింది. వాస్తవానికి పెళ్లి ముహూర్తం పెట్టుకున్నప్పటి నుంచి పెళ్లి కూతుళ్లు ప్రీతి, మనీషాలతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఏం జరుగుతుందోనని ఆందోళనతోనే ఉన్నారు. కానీ, ఇరు వర్గాలకు చెందిన పెద్దలు కలిసి కూర్చుని మాట్లాడుకున్నారు. పెళ్లికి ఎలాంటి ఇబ్బంది రాకుండా తాము చూసుకుంటామని ఠాకూర్లు మాట ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని.. ఈ ప్రాంతంలో శాంతి సామరస్యాలను నెలకొల్పేందుకు ప్రయత్నం చేశారు. అది సఫలమైంది కూడా. దానికి పోలీసులు కూడా సహకరించి, తగిన భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. పెళ్లి అనుకున్నప్పటి నుంచి ఏమవుతుందోనని భయపడ్డామని, కానీ ఠాకూర్ల కుటుంబాలే ముందుకొచ్చి పెళ్లిలో పాల్గొనడంతో పాటు తమకు కూడా వీలైనంత సాయం చేశారని ఫకీర్ చంద్ చెప్పారు.