కశ్మీర్‌లో హై అలర్ట్‌! | Paramilitary forces of 100 companies to the state | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో హై అలర్ట్‌!

Feb 24 2019 1:37 AM | Updated on Feb 24 2019 1:37 AM

Paramilitary forces of 100 companies to the state - Sakshi

శ్రీనగర్‌: కశ్మీర్‌లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఆర్టికల్‌ 35ఏపై సోమవారం నుంచి సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో అనూహ్య పరిణామాలు సంభవించాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి పోలీసులు అనూహ్య దాడులు జరిపి జమాతే ఇస్లామీ జమ్మూకశ్మీర్‌ సంస్థ అధినేత అబ్దుల్‌ హమీద్‌ ఫయాజ్‌ సహా వివిధ సంస్థలకు చెందిన 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. దీంతోపాటు ఆ రాష్ట్రానికి కేంద్రం దాదాపు 100 కంపెనీల పారా మిలటరీ బలగాలను తరలించింది. పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ బలగాలపై ఉగ్రదాడితో ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా తాజా పరిణామాలు మరింత వేడిని పెంచాయి. ఎన్నికల ఏర్పాట్లలో భాగంగానే బలగాలను తరలించినట్లు హోంశాఖ పేర్కొంది. కేంద్రం చర్యను కశ్మీర్‌లోని రాజకీయ పార్టీలు, వివిధ సంస్థలు ఖండించాయి.

 శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం వేకువజాము వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో దాడులు జరిపిన పోలీసులు జమాతే ఇస్లామీ జమ్మూకశ్మీర్‌ సంస్థ అధినేత అబ్దుల్‌ హమీద్‌ ఫయాజ్, అధికార ప్రతినిధి జాహిద్‌ అలీ, జేకేఎల్‌ చీఫ్‌ యాసిన్‌ మాలిక్‌ సహా 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఎక్కువమంది జమాతే ఇస్లామీకి చెందిన వారే ఉన్నారు. రాళ్లు విసిరే ఘటనలను నివారించేందుకే వీరిని నిర్బంధించామని పోలీసులు తెలిపారు. జమాతేపై కఠినంగా వ్యవహరించడం  ఇదే ప్రథమమని అంటున్నారు. కేంద్రం కశ్మీర్‌కు 100 కంపెనీల (దాదాపు 10వేల మంది) పారా మిలటరీ బలగాలను తరలించింది. కశ్మీరీలకు ప్రత్యేక హక్కులు కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 35ఏను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఈ నెల 25వ తేదీన సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. తీర్పు తర్వాత అనూహ్య పరిణామాలు సంభవిస్తే ఎదుర్కొనేందుకే ఈ ముందు జాగ్రత్త చర్య తీసుకున్నట్లు భావిస్తున్నారు.
 
14 ఏళ్ల తర్వాత బీఎస్‌ఎఫ్‌.. 
సాధారణ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగానే కశ్మీర్‌కు 100 కంపెనీల పారా మిలటరీ బలగాలను పంపినట్లు హోం శాఖ తెలిపింది. ఎన్నికలకు బలగాలను మోహరించడం సర్వసాధారణంగా జరిగేదేనని శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. 45 సీఆర్పీఎఫ్, 35 బీఎస్‌ఎఫ్, 10 సశస్త్ర సీమా బల్‌ (ఎస్‌ఎస్‌బీ), 10 ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ) కంపెనీల బలగాలను పంపారు. ఇవి రాష్ట్రంలో శాంతి భద్రతల విధుల్లో పాల్గొంటాయని హోం శాఖ పేర్కొంది. అయితే, దాదాపు 14 ఏళ్ల తర్వాత కేంద్రం కశ్మీర్‌కు బీఎస్‌ఎఫ్‌ను పంపించడం గమనార్హం. 2016లో బీఎస్‌ఎఫ్‌ను రాష్ట్రానికి పంపినా వారం రోజులే అక్కడ విధులు నిర్వహించాయని అధికారులు తెలిపారు. శ్రీనగర్‌లోని నాలుగు ప్రాంతాల్లో, బుద్గామ్‌ జిల్లాలోనూ సీఆర్పీఎఫ్‌ జవాన్లను ఉపసంహరించుకుని ఆ స్థానంలో బీఎస్‌ఎఫ్‌ను మోహరిస్తామని అధికారులు తెలిపారు. 

బంద్‌కు పిలుపునిచ్చిన జేఆర్‌ఎల్‌ 
అరెస్టులకు నిరసనగా వేర్పాటు వాద సంస్థలతో ఏర్పడిన ఉమ్మడి నాయకత్వ వేదిక(జేఆర్‌ఎల్‌) కశ్మీర్‌లో ఆదివారం బంద్‌కు పిలుపునిచ్చింది. తమ నేతలు, కార్యకర్తల అరెస్టులను జమాతే ఇస్లామీ కశ్మీర్‌ ఖండించింది.
  
పరిస్థితులు దిగజారుతాయి: పీడీపీ 
‘ప్రభుత్వం ఏకపక్షంగా చేపట్టిన భారీ అరెస్టులతో రాష్ట్రంలో పరిస్థితులు మరింతగా దిగజారే ప్రమాదముంది. ఏ చట్టాల ప్రకారం ఈ అరెస్టులను సమర్థించుకుంటారు? మీరు వ్యక్తులను నిర్బంధించగలరేమో కానీ వారి భావాలను మాత్రం కాదు’ అని పీడీపీ అధినేత్రి, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. రెచ్చగొట్టే బలవంతపు చర్యలతో పరిస్థితి మరింత దిగజారుతుందని హురియత్‌ కాన్ఫరెన్స్‌ అధినేత మిర్వాయిజ్‌ ఉమర్‌ ఫరూక్‌ వ్యాఖ్యానించారు.

యుద్ధ వాతావరణం
భారీ అరెస్టులు, భారీగా బలగాలను మోహరించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయింది. ప్రభుత్వ శాఖలు ప్రకటించిన చర్యలు ఉద్రిక్త పరిస్థితిని చెప్పకనే చెప్పాయి. తాజా పరిణామాలపై జనం చర్చించుకుంటున్నారు. పెట్రోల్‌ పంపులు, అత్యవసర సరకుల దుకాణాల వద్ద భారీగా జనం క్యూకట్టారు. కశ్మీర్‌లోని ప్రముఖ వాణిజ్య ప్రాంతం లాల్‌ చౌక్‌లో శనివారం ఆలస్యంగా దుకాణాలు తెరుచుకున్నాయి. శ్రీనగర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల సిబ్బందికి సోమవారం నుంచి ప్రారంభం కానున్న శీతాకాల సెలవులను యంత్రాంగం రద్దు చేసింది. వారిని యథావిధిగా విధులకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.

ఆదివారం కూడా రేషన్‌ దుకాణాలను తెరిచి ఉంచాలని పౌర సరఫరాల శాఖ ఆదేశాలిచ్చింది. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా యుద్ధ విమానాలు ఆకాశంలో చక్కర్లు కొట్టడంపై ప్రజల్లో యుద్ధ భయాన్ని రేకెత్తించింది. అయితే, ఇదంతా సర్వసాధారణమేనని వైమానికదళం స్పష్టం చేసింది. అధికారులు శ్రీనగర్‌లోని కొన్ని ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా 144వ సెక్షన్‌ కింద నిషేధాజ్ఞలు విధించారు. జమాతే ఇస్లామీ జమ్మూకశ్మీర్‌ను హిజ్బుల్‌ ముజాహిదీన్‌కు మాతృ సంస్థగా చెబుతుంటారు. అయితే, తమది సామాజిక, మత సంబంధ గ్రూపుగా చెబుతోంది. పాక్‌ను సమర్థించే ఈ సంస్థ వల్లే కశ్మీర్‌లో ఉగ్రవాదం పెచ్చరిల్లుతోందని కేంద్రం అనుమానిస్తోంది.

ఫేస్‌బుక్‌ చేతికి యూజర్ల వ్యక్తిగత డేటా
శాన్‌ఫ్రాన్సిస్కో:
ఆండ్రాయిడ్, ఐవోఎస్‌ ప్లాట్‌ఫామ్‌లకు చెందిన 11 ప్రముఖ యాప్స్‌ యూజర్ల అనుమతి తీసుకోకుండానే వారి వ్యక్తిగత వివరాలను ఫేస్‌బుక్‌కు పంపుతున్నాయని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. హోమ్‌ షాపింగ్‌తో పాటు రుతుక్రమం, అండం విడుదల, గర్భవతిగా ఎన్నో నెల వంటి గోప్యమైన సమాచారాన్ని ఈ యాప్స్‌ ఫేస్‌బుక్‌కు చేరవేస్తున్నాయని తెలిపింది. ఆయా వ్యక్తులు ఫేస్‌బుక్‌ను వాడకపోయినా సమాచారం మాత్రం ఫేస్‌బుక్‌కు చేరుతోందని తెలిపింది. తాము వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్న విషయాన్ని యూజర్లకు యాప్స్‌ స్పష్టంగా చెప్పడం లేదని పేర్కొంది. ఈ వ్యవహారాన్ని ఫేస్‌బుక్‌ అధికార ప్రతినిధి నిస్సా అన్‌క్లెసరియా సమర్థించుకున్నారు. మొబైల్‌ ప్రకటనల కోసం ఈ పద్ధతిని చాలాకాలంగా వాడుతున్నామని చెప్పారు. తాము ఏ సమాచారాన్ని సేకరిస్తున్నామో యూజర్లకు చెప్పాల్సిన బాధ్యత ఆయా యాప్స్‌పైనే ఉందన్నారు.  యాప్స్‌ నుంచి ఇప్పటివరకూ తాము అందుకున్న సున్నితమైన సమాచారాన్ని తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement