నీటి పొదుపు

నీటి పొదుపు


- దీన్ దయాళ్ ఆస్పత్రిలో రెయిన్ హార్వెస్టింగ్ వ్యవస్థ ఏర్పాటు

- నీటి అవసరాలే కాదు, నీటి పన్ను నుండీ విముక్తి

- నగర ప్రజలకు అవగాహన కల్పించాలని ఆస్పత్రి వర్గాల సూచన


పింప్రి, న్యూస్‌లైన్ : భవిష్యత్తులో నీటి సమస్యను ఇలా అధిగమించవచ్చు. ఈ విషయాన్ని నగరంలోని ఓ ఆస్పత్రి ప్రయోగాత్మకంగా చేసి చూపించింది. సొంతంగా రెయిన్ హార్వెస్టింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఆదర్శంగా నిలుస్తోంది అదే పుణేలోని దీన్ దయాళ్ ఆస్పత్రి. ఆస్పత్రికి అవసరమైన నీటి అవసరాలను తీర్చుకునేందుకు మొట్టమొదటి సారిగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. ఆస్పత్రులల్లో నీటి వాడకం అధికంగా ఉండడం, అదేవిధంగా నీటి పన్నులు అదే మొత్తంలో ఉంటున్నాయి. దీని నుంచి కూడా చాలా వరకు విముక్తి కలుగుతోందని ఆస్పత్రి వైద్యుడు పరాగ్  అభిప్రాయపడ్డారు. హోటళ్లు, హౌసింగ్ సొసైటీలు ఈ పద్ధతిని ఉపయోగించుకుంటే చాలా వరకు నీటి సమస్యను తీరుతుందని ఆయన సూచించారు.

 

నీటి సమస్య నుండి బయటడేందుకు...

ఈ ఆస్పత్రిలో రెండేళ్ల క్రితం ప్రయోగాత్మకంగా రెయిన్ హార్వెస్టింగ్‌ను ప్రారంభించారు. నగరంలో కాంక్రీట్ రోడ్లు పెరిగిపోవడంతో వర్షపు నీరు  భూగర్భంలోకి ఇంకడం లేదు. భూగర్భ జలాల నీటి మట్టం అడుగంటిపోతోంది. ఆస్పత్రి వర్గాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకోవడం తప్పడం లేదు. ఈ సమస్య నుంచి బయట పడేందుకు రెయిన్ హార్వెస్టింగ్ మార్గాన్ని ఆస్పత్రి అనుసరిస్తోంది.



ఇప్పటి వరకు ఐదు లక్షల లీటర్ల వర్షపు నీటిని భూగర్భంలోకి పంపించిన్నట్లు ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్ అధికారి మంగేష్ గోడబోలే తెలిపారు. 6 అంతస్తుల ఆస్పత్రిలో ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, వంద నుంచి 120 పడకల వార్డుల ఉన్నాయి. ఆస్పత్రికి నీటి వాడకం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం నీటి సమస్యలేదని, ఏడాది మొత్తం నీటి అవసరాలు తీరుతున్నాయని మంగేష్ తెలిపారు.



‘వాడియా’ కాలేజీకి..: రెయిన్ హార్వెస్టింగ్ ద్వారా వాడియా కాలేజీకి ప్రతిరోజు నీటిని సరఫరా చేస్తున్నారు. ఐదు వేల మంది విద్యార్థులకు నీటి సమస్య తలెత్తకుండా కృషి చేస్తోంది. కాలేజీ ఆవరణలో నాలుగు అతి పెద్ద భవనాలకుఈ నీటిని వినియోగిస్తున్నారు. 2004 నుంచి నేటి వరకు ప్రణాళిక బద్ధంగా కాలేజీ పరిసరాలలో 17 ఎకరాలల్లో నిర్మించిన పలు భవనాలపై నుంచి వచ్చే వర్షపు నీటిని పైపుల ద్వారా ఒక చోటికి చే ర్చుతూ, తర్వాత ఆ నీటిని బావుల్లోకి పంపుతున్నారు.



2010లో నాలుగు బోర్‌లను వేయగా, ఆ బోర్‌లలోకి ఫిల్టర్ల ద్వారా ఈ నాలుగు బోర్ బావుల్లోకి నీటిని పంపుతున్నారు.  కాలేజీలో నీటి సమస్య తీరి, నీటి పన్నుల బెడద నుంచి విముక్తి అయ్యింది. ఈ రెయిన్ హార్వెస్టింగ్ కు ‘కోకా కోలా’, ‘ముంబై మెంబర్స్ ఆఫ్ బ్రదర్ హుడ్’ అనే స్వచ్ఛంద సంస్థ మద్దతు ఇవ్వడం ద్వారా అనుకున్నది సాధించామని కాలేజీ ఇంజినీరు, కాలేజీ వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ అభయ్ హాకే తెలిపారు.

 

ఇంటింటికి ప్రచారం..

కోత్‌రోడ్‌కు  చెందిన సామాజిక కార్యకర్త సుహాస్ నిమ్హణ్ ఇప్పటి వరకు నగరంలోని  268 హౌసింగ్ సొసైటీలకు వెళ్లి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ గురించి ప్రజలకు వివరించారు.  వర్షాలు ప్రతి ఏడాది కురుస్తాయనీ, ఆ వర్షపు నీటిని వృథాగా పోనిస్తున్నామని విచారం వ్యక్తం చేశారు. ఒక ఏడాది వర్షాలు రాకపోతే తాగు నీటికి ఎన్నో అవస్థలు పడుతారని తెలిపారు. జనాభా పెరుగుతోందని, నీటి వనరులు మాత్రం తగ్గుతున్నాయని తెలిపారు. గతంలో 10 నుంచి 15 అడుగుల లోతులో భూగర్భ జలాలు ఉండేవి. ఇప్పుడు 50 నుంచి 100 అడుగుల లోతు వరకు జాడ కనిపించడం లేదన్నారు.



పర్యావరణానికి హాని కలిగి మానవ మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతోందని, దీని ప్రభావం నుంచి బయటి పడాలంటే రెయిన్ హార్వెస్టింగ్‌ను కలిగి ఉండాలని ఆయన సూచించారు. గ్రామీణ ప్రాంతాలల్లో బావుల ద్వారా  భూగర్భ జలాలు పెరుగున్నాయి. వర్షపు నీటిని బోర్‌బావుల్లోకి ఫిల్టర్ చేసి పంపడం ద్వారా నగరాలలో కూడా భూగర్భ జలాల నీటి మట్టాలను పైకి తీసుకు రావచ్చని  అభిప్రాయపడ్డారు.   సుమారుగా 10 వేల ఖర్చు అవుతోందనీ సుహాస్ తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top