వాట్సాప్‌ అప్‌.. అప్‌..!

Interesting facts revealed in the study about Social media - Sakshi

అధ్యయనంలో వెల్లడైన ఆసక్తికర అంశాలు 

గ్రామాల్లోనూ వేగంగా విస్తరిస్తున్న వాడకం 

ఒక్క వాట్సాప్‌ సందేశం.. ఎన్ని సమస్యలు సృష్టిస్తోందో మనం చూస్తూనే ఉన్నాం..సమాచారం సులువుగా ఇచ్చిపుచ్చుకునేందుకు ఓ మార్గంగా మొదలైన ఈ టెక్‌ వేదిక... ఇప్పుడు అనేక వివాదాలకు కారణమవుతోంది. మరి... దేశంలో కోట్ల మంది వాడుతున్న వాట్సాప్‌ను ఎంత మంది నమ్ముతున్నారు? ఏయే వయసుల వారు ఎంత విస్తృతంగా దీన్ని వాడుతున్నారు? అసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం చేసింది లోక్‌నీతి –సీఎస్‌డీఎస్‌ సంస్థ. గతేడాది నుంచి ఇప్పటివరకూ రెండుసార్లు సర్వే చేసి వాట్సాప్‌ వాడకం తీరుతెన్నులను విశ్లేషించింది.
- గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వాట్సాప్‌ వాడే వారి సంఖ్య 10% వరకూ పెరిగింది. 
స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గడం, డేటా కోసం పెట్టే ఖర్చు తక్కువగా ఉండటం, సామాజిక మాధ్యమాలపై వెచ్చించే సమయం ఎక్కువ కావడం రోజువారీ వాట్సాప్‌ వినియోగం పెరిగేందుకు కారణాలు. 
ఇంటర్నెట్‌ సౌకర్యమున్న స్మార్ట్‌ఫోన్ల వినియోగం పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ వేగంగా విస్తరిస్తోంది. ఈ రకమైన మొబైళ్ల వాడకం 10 శాతం నుంచి 31 శాతానికి చేరుకుంది. ఈ సంఖ్య గ్రామీణ ప్రాంతాలకు వచ్చే సరికి 10 శాతం నుంచి 20 శాతానికి చేరింది. ఇక ప్రతిరోజూ వాట్సాప్‌ వినియోగించే వారు 22 శాతం నుంచి 38 శాతానికి పెరిగారు. 

వర్గాలవారీగా ... 
2017లో పేద ప్రజలు 8 శాతం వాట్సాప్‌ వినియోగిస్తే 2018లో వారి సంఖ్య 14 శాతం అయింది. అల్పాదాయ వర్గాలకు సంబంధించి ఈ సంఖ్య 6 శాతం నుంచి 24 శాతంగా ఉండగా మధ్యాదాయ వర్గాల్లో ఏడాది క్రితం 15 శాతం ఉన్న రోజువారీ వాట్సాప్‌ వినియోగదారుల సంఖ్య ఈ ఏడాదికి 34 శాతమైంది. ఎగువ మధ్యతరగతి వర్గంలో వాడకం గతేడాది 29 శాతం ఉండగా 2018లో 45 శాతానికి పెరిగినట్టు ఈ అధ్యయనంలో తేలింది. 
దేశంలో యువతరం ఎక్కువగా వాట్సాప్‌ వినియోగిస్తున్నట్టు సర్వే వెల్లడించింది. అధ్యయనంలో పాల్గొన్న 18 ఏళ్ల నుంచి 25 ఏళ్లలోపు వారిలో సగం మంది ప్రతిరోజూ వాట్సాప్‌ వినియోగిస్తున్నారు. వృద్ధుల్లో మాత్రం ఇది చాలా తక్కువగా ఉంది. 

ఏ వయసులో వాట్సాప్‌ వాడకం ఎలా... 
2017లో 18–25 ఏళ్లలోపు వారు 30% వాడితే 2018లో 49 శాతానికి పెరిగారు. 
26–35 ఏళ్ల వయసు వారు గతేడాది 21 శాతం మంది వాట్సాప్‌ వాడగా ఈ ఏడాది వారి సంఖ్య 35 శాతానికి పెరిగింది. 36–55 ఏళ్ల వయస్కులు గతేడాది 10% ఉండగా ఈ ఏడాది 17% పెరిగారు. 
56 ఏళ్లు పైబడిన వారిలో వాట్సాప్‌ వాడకందారులు గతేడాది 3% ఉండగా ఈ ఏడాది వారి సంఖ్య 7 శాతంగా నమోదైంది. 

ఏ సమాచారాన్ని విశ్వసిస్తున్నారు? 
వాట్సాప్‌లో వచ్చే సమాచారంకంటే వార్తాపత్రికల్లో వచ్చిన సమాచారాన్ని పూర్తిగా విశ్వసిస్తున్నవారు 55 శాతం మంది ఉండగా 39 శాతం మంది వార్తాపత్రికల్లో వచ్చే వాటిని నమ్మడం లేదన్నారు. 6 శాతం స్పందించలేదు. టీవీ వార్తలను పూర్తిగా నమ్ముతున్నట్లు 50 శాతం మంది పేర్కొనగా 40 శాతం మంది టీవీల్లో వార్తలను నమ్మట్లేదన్నారు. 10 మంది ఏ అభిప్రాయాన్నీ చెప్పలేదు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top