పెహ్లూ ఖాన్‌ కేసులో న్యాయం ఫెయిల్‌?

How The Law Failed the Victims of the Pehlu Khan Lynching Case! - Sakshi

సాక్షి,  న్యూఢిల్లీ : నాడు దేశవ్యాప్తంగా సంచలనం సష్టించిన పెహ్లూఖాన్‌ మూక హత్య కేసులో ఆరుగురు నిందితులు నిర్దోషులుగా విడుదలవడం అంతే సంచలనం సృష్టించింది. 2017, ఏప్రిల్‌ నెలలో రాజస్థాన్‌లో అల్వార్‌ ప్రాంతంలో పాలవ్యాపారి పెహ్లూ ఖాన్‌ (55)ను ఆవులను కబేళాకు తరలిస్తున్నాడనే అనుమానంపై బజరంగ్‌ దళ్, బీజేపీకి చెందిన కార్యకర్తలు దాడి చేసి చితకబాదారు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన పెహ్లూఖాన్‌ కొన్ని రోజుల తర్వాత మరణించారు. ఈ సంఘటనను పలువురు సెల్‌ఫోన్లలో రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా, అప్పుడది వైరల్‌ కూడా అయింది. పెహ్లూఖాన్‌ నుంచి పోలీసులు మరణ వాంగ్మూలం కూడా తీసుకున్నారు. అయినప్పటికీ ఈ కేసులో అరెస్టయిన ఆరుగురు నిందితులను అల్వార్‌ జిల్లా జడ్జీ బుధవారం నాడు విడుదల చేశారు. 

ఈ సంఘటన జరిగినప్పుడు కేంద్రంలోనే కాకుండా రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వమే ఉంది. ప్రభుత్వం ఒత్తిడికి లొంగిపోయిన రాష్ట్ర పోలీసులు కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించి ఉండవచ్చు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం ఏమి చేసినట్లు. మూక హత్యలను తీవ్రంగా పరిగణిస్తామని, ముఖ్యంగా గోవుల పేరిట జరుగుతున్న ఘోరాలను కఠిన నేరాలుగా పరిగణిస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అందులో భాగంగా మామూలు హత్యల్లా కాకుండా మూక హత్యలను తీవ్రంగా పరిగణిస్తామంటూ ఈ ఏడాది మొదట్లో రాజస్థాన్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓ బిల్లును కూడా తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టం మరీ రాక్షసంగా ఉందంటూ హిందూత్వ శక్తులు విమర్శించాయి కూడా. 

ఇలాంటి నేరాలను అరికట్టాలంటే కొత్త చట్టాలేవీ అవసరం లేదని, పోలీసులు చిత్త శుద్ధితో పనిచేస్తే ఉన్న చట్టాలు కూడా సరిపోతాయని ఇప్పుడనిపిస్తోంది. మూక దాడిని చిత్రీకరించిన సెల్‌ఫోన్లను పోలీసులు సక్రమంగా స్వాధీనం చేసుకోలేదు. పెహ్లూ ఖాన్‌ మరణవాంగ్మూలాన్ని కూడా పోలీసులు సరిగ్గా రికార్డు చేయలేక పోయారు. సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసిన వీడియోలను స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించడంలో కూడా పోలీసులు విఫలమయ్యారు. ఇదంతా పోలీసుల నిర్లక్ష్యమని భావించలేం. నేరస్థుల పట్ల పోలీసులు చూపించిన సానుకుల వైఖరి. అప్పటి ప్రభుత్వం పట్ల వారు ప్రదర్శించిన గురు భక్తి. ఇప్పుడు ఈ కేసును పైకోర్టులో అప్పీల్‌ చేస్తామని రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ ప్రకటించారు. తీర్పును పైకోర్టులో అప్పీల్‌ చేసినంత మాత్రాన న్యాయం జరుగుతుందని ఆశించలేం. పోలీసు విచారణలో ఎక్కడ పొరపాట్లు జరిగాయో గుర్తించి, మళ్లీ దర్యాప్తు జరిపేందుకు ప్రత్యేక బందాన్ని ఏర్పాటు చేయడం లాంటి చర్యలు తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. అదికూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నప్పుడే న్యాయం జరుగుతుంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top