వడగాల్పులు ఎలా, ఎందుకు వస్తాయి?

How Generate Heat Waves - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గత మూడు దశాబ్దాలుగా ఎన్నడు లేనివిధంగా దేశవ్యాప్తంగా సుదీర్ఘంగా వీస్తున్న వడగాడ్పులకు 200 మందికిపైగా మరణించారు. రుతుపవనాలు ఆలస్యంగా రావడమే సుదీర్ఘ వడగాడ్పులకు కారణం. మత్యువాత పడిన వారిలో ఎక్కువ మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదవాళ్లే. వడగాడ్పులంటే కేవలం వేడి గాలులుగానే భావించరాదు. ఈ వేడి గాడ్పుల్లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడమే కాకుండా తేమ శాతం (ఉక్క) ఎంత ? సూర్యుడి నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వచ్చే రేడియేషన్‌ ప్రభావం ఎంత? అన్న అంశాల ఆధారంగా ప్రజలపై వడ గాడ్పుల ప్రభావం ఉంటుంది. తక్కువ ఉష్ణోగ్రత ఉండి, ఎక్కువ తేమ ఉన్న, ఎక్కువ ఉష్ణోగ్రత ఉండి, తక్కువ తేమ ఉన్నా వేడి ప్రభావం ఒకేలా ఉంటుంది. ఉదాహరణకు 43 శాతం ఉష్ణోగ్రత ఉండి, గాలిలో తేమ 40 శాతం ఉన్నా, ఉష్ణోగ్రత 33 శాతం ఉండి, తేమ 95 శాతం ఉంటే ప్రభావం ఒకే స్థాయిలో ఉంటుంది. 

సాధారణంగా గ్రామీణ ప్రాంతాలకన్న పట్టణ ప్రాంతాల్లో, ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రత ఎనిమిది డిగ్రీల సెల్సియస్‌ వరకు ఎక్కువగా ఉంటుందని నిపుణులు ఇదివరకే తేల్చి చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడానికి కారణం. పగటి ఉష్ణోగ్రతను గ్రహించిన కాంక్రీటు నిర్మాణాల నుంచి రాత్రి పూట ఉష్ణం బయటకు వెలువడడమే. గ్రామీణ ప్రాంతాల్లో చెట్లు చేమలు ఎక్కువగా ఉండడం, పట్టణ ప్రాంతాల్లో చెట్లు తక్కువగా ఉండి, కాంక్రీటు నిర్మాణాలు ఎక్కువగా ఉండడం ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడానికి కారణం. పట్టణంలో పేదలు నివసించే ప్రాంతంలో ఉష్ణోగ్రత మరీ ఎక్కువగా ఉంటుంది. వారిళ్లు చిన్నగా, దగ్గరదగ్గరగా ఉండడం, వెంటిలేటర్లు లేని రేకుల షెడ్లు అవడం అందుకు కారణం. బయట 41 డిగ్రీల సెల్సియస్‌ ఉంటే వారి రేకుల ఇళ్లలో 43 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉంటుంది. బయట ఉష్ణోగ్రత 38 డిగ్రీలకు పడిపోయినప్పటికీ పేదల ఇళ్లలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు ఉంటుందని ‘కౌన్సిల్‌ ఆన్‌ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ వాటర్‌’కు చెందిన నిపుణులు హెమ్‌ ధొలాకియా తెలిపారు. పేదల ఇళ్లు ఏ ప్రాంతంలో ఉన్నాయన్న అంశంపై కూడా వారి ఇళ్లలోని ఉష్ణోగ్రత ఆధారపడి ఉంటుంది. కొండ ప్రాంతంలో ఉంటే పగలు వేడి, రాత్రి చల్లగా, పట్టణం మధ్యలో ఉంటే మరో విధంగా ఉంటుంది. 

వడగాడ్పులు ఎప్పుడు వస్తాయి?
కొండ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత కనీసం 30 డిగ్రీల సెల్సియస్‌ దాటితే వడగాడ్పులు వీస్తాయి. అదే కోస్తా ప్రాంతంలో 37 డిగ్రీలు దాటితే, మైదాన ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌ దాటితే వడ గాల్పులు వీస్తాయి. దేశంలో గత 15 ఏళ్లుగా వడగాడ్పుల తీవ్రత పెరిగింది. అందుకు కారణం వాతావరణంలో వచ్చిన మార్పులు ఒకటైతే పట్టణ ప్రాంతాల్లో కాంక్రీటు నిర్మాణాలు భారీగా పెరిగి పోవడం మరో కారణం. ఓ ప్రాంతంలో వరుసగా రెండు రోజుల ఉష్ణోగ్రత 45 డిగ్రీలు కొనసాగితే ‘నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ’ మార్గదర్శకాల ప్రకారం నివారణ చర్యలు తీసుకోవాలి. అంటే రోడ్లను నీటితో తడపడం, చెట్లు ఎక్కువగా ఉన్న పార్కులను 24 గంటలపాటు తెరచి ఉంచడం, ప్రజలకు మజ్జిగ కేంద్రాలను ఏర్పాటు చేయడం, పేదలను వేసవి శిబిరాలకు తరలించడం లాంటి చర్యలు తీసుకోవాలి. 

అత్యధికంగా రాజస్థాన్‌లో 51 డిగ్రీలు
ఈసారి దేశంలోనే అత్యధికంగా రాజస్థాన్‌లోని చురు ప్రాంతంలో 51 డిగ్రీల ఉష్ణోగ్రత వరుసగా మూడు రోజులు కొనసాగింది. బీహార్, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా వడగాడ్పుల ప్రభావం తీవ్రంగా ఉండింది. ఒక్క బీహార్‌లోనే ఈసారి వడగాడ్పులకు 70 మందికి పైగా మరణించారు. ఈసారి దేశంలోని 65.39 శాతం మంది ప్రజలు 40 శాతానికిపైగా ఉష్ణోగ్రతలో సంచరించారని, వారిలో 37 శాతం మంది రోజుకు పది గంటలకుపైగా ఉష్ణోగ్రతకు గురయ్యారని శాటిలైట్‌ ఛాయాచిత్రాల ద్వారా  ‘డబ్లూఆర్‌ఐ ఇండియా సస్టేనబుల్‌ సిటీస్‌’కు చెందిన సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పీ. రాజ్‌ భగత్‌ తేల్చి చెప్పారు. ‘వాయు’ తుపాను కారణంగా ఈసారి రుతుపవనాల్లో జాప్యం జరిగిందని ఆయన తెలిపారు. 1992 నుంచి 2015 మధ్య వడ దెబ్బకు దేశంలో 22,562 మంది మరణించడంతో దేశంలోని ప్రతిన గరం ‘హీట్‌వేవ్‌ యాక్షన్‌ ప్లాన్‌’ను అమలు చేయాలని కేంద్ర వాతావరణ శాఖ ఆదేశించింది. అయితే నగరపాలికా సంస్థలు చలి వేంద్రాలు ఏర్పాటు చేయడం మినహా పెద్దగా నివారణ చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. 

క్లైమెట్‌ స్మార్ట్‌ నగరాలు అవశ్యం
నగరాల్లో ఉష్ణోగ్రతలు పెరగకుండా నివారించేందుకు ‘క్లైమెట్‌–స్మార్ట్‌ నగరాలు’ శరణ్యమని నిపుణులు తెలియజేస్తున్నారు. వీధుల్లో, ప్రభుత్వ స్థలాల్లో, పార్కుల్లో చెట్లు పెంచడం, నీటి నిల్వ కుంటలను ఏర్పాటు చేయడం, అందరికి అందుబాటులోకి ప్రభుత్వ నల్లాలు తీసుకరావడం, వేడి గాలులను తట్టుకునేలా ఇళ్ల నిర్మాణం, ఏర్‌ కూలర్లలో కనీస ఉష్ణోగ్రతను 18 నుంచి 24కు పెంచడం, వాహన కాలుష్యాన్ని నియంత్రించడం లాంటి చర్యలు ‘క్లైమెట్‌–స్మార్ట్‌ నగరాలు’ ప్రణాళికలో ఉంటాయి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top