సీఏఏ మద్దతు ర్యాలీలో సీఎం, మంత్రులు

Himanta Sarma Says Cut Off Is 2014 For Citizenship Amendment Act - Sakshi

గువాహటి: పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి 2014లోనే కటాఫ్‌ నిర్ణయించబడిందని అసోం మంత్రి హిమాంత బిస్వా శర్మ అన్నారు. 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ తప్పులను సరిదిద్దేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. సీఏఏను సమర్థిస్తూ బీజేపీ గువాహటిలో శుక్రవారం ర్యాలీ నిర్వహించింది. అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌ సహా పలువురు ముఖ్యనేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా హేమంత మాట్లాడుతూ... ‘ 1972 నుంచి ఎంతో మంది వలసదారులు అక్రమంగా రాష్ట్రంలో చొరబడ్డారు. అయితే 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత కనీసం ఒక్క చీమైనా సరే రాష్ట్రంలో అడుగుపెట్టలేకపోయింది.

అదే విధంగా బంగ్లాదేశ్‌లో ఒక్క హిందువు కూడా ప్రవేశించలేదని... ప్రధానమంత్రి షేక్‌ హసీనాకు ఆయన చెప్పారు. ఇప్పుడు సీఏఏ ద్వారా దాదాపు నాలుగు లక్షల మంది శరణార్థులు పౌరసత్వం కోసం అర్హత సాధించారు. ఇక్కడే ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్న వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. నిజానికి రాజీవ్‌ గాంధీ, పీవీ నరసింహారావు ప్రధానులుగా ఉన్న సమయంలో పౌరసత్వ చట్టానికి సవరణలు చేసినపుడు ఎవరూ ఆందోళనలు చేయలేదు. ఇప్పుడు సీఏఏ వల్ల లాభం కలుగుతుందన్నా నిరసనలు ఎందుకు చేస్తున్నారు’ అని ప్రశ్నించారు. (పౌరసత్వ చట్టం: ఎందుకీ ఆందోళనలు?)

కాగా ఈశాన్య రాష్ట్రం అసోంలో దశాబ్దాల తరబడి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యావకాశాలు వలస వచ్చిన విదేశీయులకు వెళ్తున్నాయని, స్థానికులైన తమకు రావడం లేదని 1950వ దశకం నుంచే ‘సన్స్‌ ఆఫ్‌ సాయిల్‌’గా పిలుచుకునే 34 శాతం జనాభా కలిగిన అస్సామీ భాష మాట్లాడే అస్సామీలు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో అఖిల అసోం విద్యార్థుల సంఘం 1979 నుంచి ఆందోళనను తమ చేతుల్లోకి తీసుకొని నడిపించింది. సమ్మెలు, దిగ్బంధనాలు, సహాయ నిరాకరణ వంటి వివిధ రీతుల్లో కొనసాగిన ఆందోళనలో విధ్వంసాలు, ప్రభుత్వ పతనాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రపతి పాలనలో కూడా పౌర జీవితం స్తంభించిపోయింది.

ఈ క్రమంలో ఆరేళ్ల తర్వాత 1985లో అప్పటి కేంద్రంలోని రాజీవ్‌ ప్రభుత్వం దిగివచ్చి అసోం ఆందోళనకారులతో ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం1951 నుంచి 1961 లోపు వచ్చిన బంగ్లాదేశీయులకు భారత పౌరసత్వం కల్పించాలి. 1971 తర్వాత వచ్చిన వారిని వెనక్కి పంపించాలి. 1961 నుంచి 1971 మధ్యన వలస వచ్చిన వారికి ఓటింగ్‌ హక్కు మినహా అన్ని పౌర హక్కులు ఉంటాయి. నాటి ఒప్పందంలో 90 శాతం అంశాలు కూడా ఇప్పటికి అమలు కాలేదని ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో 1985 అస్సాం ఒప్పందంలోని అంశాలను మార్గదర్శకంగా తీసుకొని పౌరులను గుర్తించాల్సిందిగా కోరుతూ బీజేపీ ప్రభుత్వం 2015లో ఓ ఉన్నతాధికార కమిటీని వేసింది. 

ఈ నేపథ్యంలో  నరేంద్ర మోదీ సర్కారు తీసువచ్చిన పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది. ఈ బిల్లుపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతకం చేయడంతో చట్టరూపం దాల్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడు పొరుగు దేశాలైన.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రిస్టియన్లకు భారత పౌరసత్వం కల్పించే వీలు కలుగుతుంది. అయితే ఈ చట్టం ముస్లిం వర్గ ప్రయోజనాలను కాలరాస్తోందని, భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ప్రతిపక్షాలు దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top