వలస కార్మికులకు అండగా హైకోర్టులు

High Courts Protect The Rights of Migrant Workers - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘వలస కార్మికులు ఎదుర్కొంటున్న దారుణ పరిస్థితులకు సంబంధించి గత నెల రోజులుగా మీడియాలో వస్తోన్న వార్తా కథనాలను చూస్తుంటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. ఇది మానవ విషాదం తప్పించి మరొకటికాదు. తట్టాబుట్టలను నెత్తినెట్టుకొని పిల్లలను వెంట బెట్టుకొని వందల కిలోమీటర్లు కాలినడకన బయల్దేరి, అక్కడక్కడా సామాజిక కార్యకర్తలు పెట్టే అన్న పానీయాలపై ఆధారపడి ముందుకు సాగుతున్న వలస కార్మికుల అగచాట్లను పత్రికలతోపాటు టీవీలో చూస్తుంటే ఎవరికైనా హృదయం ద్రవించక మానదు. ఇది అధికారులందరి నిర్లక్ష్యం. కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోని ఫలితం. తమ స్వస్థలాలకు బయల్దేరిన వలస కార్మికులు రోజుల తరబడి నడుస్తూ పోవడం, వారిలో కొందరు మార్గమధ్యంలో ప్రమాదాల కారణంగా మరణించడం దారుణం. వారిని ఆదుకునేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేతనైన చర్యలు తీసుకొని ఉండాల్సింది’ అని మద్రాస్‌ హైకోర్టు గత శుక్రవారం, అంటే మే 15వ తేదీన వ్యాఖ్యానించింది. వలస కార్మికులను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాల్సిందిగా కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 12 ప్రశ్నలను సంధించింది. మే 22వ తేదీ, శుక్రవారం నాటికి సమాధానం ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. అయితే ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి సమాధానాలు వచ్చాయో మీడియా దృష్టికి రాలేదు.

(అక్కడ నిషేధించారు.. మన దేశంలో ఎప్పుడు?)

దేశాభివృద్ధిలో కార్మికుల పాత్ర ఎంతో!
‘దేశాభివృద్ధిలో కార్మికుల పాత్ర ఎంతో ఉంది. ఒక్కసారి ఆ విషయాన్ని గుర్తు చేసుకొని నేడు రోడ్డున పడిన వలస కార్మికులను ఇళ్లను చేర్చాల్సిన బాధ్యతను తీసుకోవాలి. అందుకయ్యే ఖర్చులను ప్రభుత్వాలే భరించాలి. జీవనోపాధి కోల్పోయిన కార్మికులను ఆదుకునేందుకు అధికారులు ముందుకు రావాలి’ అని కర్ణాటక హైకోర్టు మే 12వ తేదీన ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. అదే రోజున గుజరాత్‌ హైకోర్టు తనంతట తానే వలస కార్మికుల సమస్యపై స్పందించి వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

సుప్రీంకోర్టు ఏమన్నదంటే ?
వలస కార్మికులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (పిల్‌) మార్చి 31వ తేదీన సుప్రీంకోర్టు విచారణకు వచ్చింది. ‘ప్రభుత్వాలు వలస కార్మికులందరికి వసతి ఏర్పాటు చేసి భోజన పెడుతున్నందున వలస కార్మికులెవరూ నేడు రోడ్డు మీద లేరు. నకిలీ వార్తలకు అనవసరంగా కార్మికులు భయపడుతున్నారు’ అని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కేంద్రం తరఫున వాదించారు. ఆయన వాదనతో సుప్రీం కోర్టు ఏకీభవించింది. పిల్‌ను కొట్టివేసింది. అప్పటికీ కార్మికుల వలసలు నేటి స్థాయిలో లేవు.

ఆ తర్వాత దాఖలయిన పలు పిటిషన్లను కూడా సుప్రీంకోర్టు, కేంద్రం వాదనతో ఏకీభవించి కొట్టి వేసింది. ఏప్రిల్‌ ఏడవ తేదీన మరో పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే స్పందిస్తూ, కార్మికులకు వసతి ఏర్పాటు చేసి ఉచితంగా తిండి పెడుతున్నప్పుడు వారికి డబ్బుల అవసరం ఎందుకంటూ న్యాయవాదిని ప్రశ్నించారు.  ఆ తర్వాత వలస కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందంటూ దాఖలైన మరికొన్ని పిటిషన్లను కూడా ఏప్రిల్‌ 21వ తేదీన సుప్రీంకోర్టు కొట్టివేసింది. వలస కార్మికుల పరిస్థితికి సంబంధించి సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం నుంచి కనీసం ‘స్టేటస్‌ రిపోర్ట్‌’ కోరకపోవడం ఆశ్చర్యం వేసిందని పిటిషనర్లు మీడియా ముందు వ్యాఖ్యానించారు. (ప్యాకేజీ ఒక క్రూయల్ జోక్‌ : సోనియా)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top