నిర్మాణంలోని ఇంటిపై జీఎస్టీ తగ్గింపు

GST reduction on house in construction - Sakshi

  12 నుంచి ఐదు శాతానికి కోత

ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి 

‘అందుబాటు ధరలో ఇల్లు’ నిర్వచనం సవరణ

జీఎస్టీ మండలి నిర్ణయాలు

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి ఆదివారం స్థిరాస్తి రంగ వ్యాపారులతోపాటు ఇల్లు కొనాలనుకునే వినియోగదారులకు శుభవార్త చెప్పింది. నిర్మాణంలో ఉన్న ఇళ్లు, నిర్మాణం పూర్తయినప్పటికీ అందుకు సంబంధించిన (నిర్మాణం పూర్తయినట్లుగా) ధ్రువపత్రం ఇంకా రాని ఇళ్లు, అందుబాటు ధరల్లో వచ్చే ఇళ్ల (అఫోర్డబుల్‌ హౌసెస్‌) కొనుగోలుపై జీఎస్టీ రేటును తగ్గించింది. నిర్మాణంలో ఉన్న లేదా నిర్మాణం పూర్తయినా ఆ మేరకు ధ్రువపత్రం ఇంకా రాని ఇళ్ల కొనుగోలుపై 12 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. వ్యాపారులకు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) కూడా ఇస్తున్నారు. తాజాగా ఈ కేటగిరీ ఇళ్లపై పన్నును జీఎస్టీ మండలి 5 శాతానికి తగ్గించింది.

ఐటీసీని ఎత్తివేసింది. అలాగే అందుబాటు ధరల్లో లభించే ఇళ్ల కొనుగోలుపై ప్రస్తుతం 8 శాతంగా ఉన్న జీఎస్టీని 1 శాతానికి జీఎస్టీ మండలి తగ్గించింది. అందుబాటు ధరల ఇల్లు అంటే ఏంటనే నిర్వచనాన్ని కూడా సవరించింది. కొత్త పన్ను రేట్లు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి (ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి) అమలు కానున్నాయి. లాటరీలపై జీఎస్టీ రేటు విషయంలో నిర్ణయాన్ని తదుపరి సమావేశానికి మండలి వాయిదా వేసింది. ఢిల్లీలో జరిగిన 33వ జీఎస్టీ మండలి సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ మాట్లాడుతూ ఐటీసీ ప్రయోజనాన్ని బిల్డర్లు వినియోగదారులకు బదిలీ చేయడం లేదనే ఫిర్యాదుల నేపథ్యంలో ఐటీసీని తొలగించామని తెలిపారు. దీంతో ఈ రంగంలో మళ్లీ నగదు లావాదేవీలు పెరిగే అవకాశం ఉన్నందున, దాన్ని అరికట్టడం కోసం బిల్డర్లు తమ మొత్తం కొనుగోళ్లలో 80 శాతాన్ని జీఎస్టీ నమోదిత వ్యాపారుల వద్దే చేసేలా కొత్త నిబంధనలు తీసుకొచ్చామన్నారు. 

అందుబాటు ధరలో ఇల్లు అంటే ఇదే.. 
‘అందుబాటు ధర ఇల్లు’కి నిర్వచనాన్ని కూడా జీఎస్టీ మండలి ఆదివారం సవరించింది. ఇకపై రూ. 45 లక్షల విలువ కలిగి ఉండి, దేశంలోని ఆరు మెట్రో నగరాల్లో (హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై–ఎంఎంఆర్, కోల్‌కతా) అయితే 60 చదరపు మీటర్ల కార్పెట్‌ వైశాల్యం, మిగతా ఏ ప్రాంతంలోనైనా అయితే 90 చదరపు మీటర్ల కార్పెట్‌ వైశాల్యం ఉన్న ఇళ్లను ఇకపై అందుబాటు ధరల్లోని ఇళ్లుగా పరిగణించనున్నారు. ఈ లెక్కన నిర్మాణాలను బట్టి మెట్రో నగరాల్లో అయితే రెండు పడక గదులు, మిగతా ప్రాంతాల్లో అయితే మూడు పడక గదుల ఇళ్లు కూడా అందుబాటు ధరల ఇళ్ల పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని జైట్లీ చెప్పారు. ఇక కార్పెట్‌ వైశాల్యం అంటే ఇంటి నాలుగు గోడల మధ్యలో ఉండే ప్రాంతం. అందునా ఇంటి లోపల, గదుల విభజన కోసం నిర్మించిన గోడలు ఆక్రమించిన ప్రాంతం కూడా కార్పెట్‌ వైశాల్యం కిందకు రాదు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top