‘రైతుల శాపం’ ఫలిస్తుందా?!

Farmers Protest For Minimum Price In New Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మనకు అన్నం పెడుతున్న రైతును మరచిపోతున్నాం. పస్తులుంటున్నా పట్టించుకోవడం లేదు. మన సంగీతంలో మన సాహిత్యంలో, మన సంస్కృతిలో, మన సంప్రదాయాల్లో, మమేకమై మన జీవన విధానంలో కలిసిపోయిన రైతును ఒకప్పుడు భుజానికి ఎత్తుకున్నాం. అతని గురించి కథలు, కథలుగా చెప్పుకున్నాం. కవితలు, కవితలుగా రాసుకున్నాం. అతని కష్టాల గురించి తెలిసి కన్నీళ్లు కార్చాం. అతని వెంట కలిసి నడిచాం. జమిందారి వ్యవస్థలో నలిగిపోతున్న రైతు తరఫున తుపాకీ పట్టి పోరాడాం. ఆ రైతు కోసం ప్రాణాలు కూడా అర్పించాం. జై జవాన్, జై కిసాన్‌ అని పాడుకున్నాం. ఆయన లేకుండా పాట లేదు. ఆయన లేకుండా పాడి లేదు, పొలమూ లేదు.

ఓ కాల్వ లేదు. ఓ చెరువు లేదు. మొత్తానికి పల్లే లేదు. 20వ శతాబ్దం ఆరంభంలోనే ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో, పలు దేశాల్లో రైతు కోసం  భూ సంస్కరణలు ప్రారంభమయ్యాయి. రష్యా విప్లవం రైతు ప్రపంచానికే కొత్త ఊపరి పోసింది. అది భారత దేశ హిందీ, ఉర్దూ రచయితలను కదిలించింది. ప్రముఖ హిందీ రచయిత మున్షీ ప్రేమ్‌చంద్‌ రాసిన ‘సద్గతి (మోక్షం), పూస్‌ కీ రాత్‌ (శీతల రాత్రి), దో బైలోన్‌ కీ కథ (రెండు ఎద్దుల కథ), సవ్వా సేర్‌ గెహూన్‌ (సవ్వసేరు గోధుమలు), కఫన్‌ (శవంపై కప్పే వస్త్రం)’ కథల్లో భూస్వాములు ఆగడాలు, పాలకుల నిర్లక్ష్యం, రైతుల అగచాట్లు కనిపిస్తాయి.

బ్రిటీష్‌ ఇండియాలో ముహమ్మద్‌ ఇక్బాల్‌ కవి రాసిన ‘పంజాబ్‌ కే దెహఖాన్‌ కే నామ్‌ (పంజాబ్‌ రైతుల కోసం) కవిత్వంలో’, ప్రముఖ పాకిస్థాన్‌ కవి ఫైజ్‌ అహ్మద్‌ ఫైజ్‌ రాసిన ‘ఇంతెసాబ్‌ (అంకితం)’ లో, ప్రముఖ హిందీ పాటల రచయిత సాహిర్‌ లుధియాన్వీ రాసిన ‘ముజే సోచ్‌నే దో (నన్ను ఆలోచించనివ్వండి)’పాటలో, మరో హిందీ రచయిత ఖైఫీ ఆజ్మీ రాసిన  ‘కిసాన్‌ (రైతు)’కథలో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఉర్దూ కవి మఖ్దూం మొయినుద్దీన్, జాహిర్‌ కశ్మీరీ రాసిన కవితల్లో రైతే కనిపిస్తాడు. ‘మజ్దూర్, ఉప్‌కార్, భరత్‌, మదర్‌ ఇండియా’ లాంటి హిందీ చిత్రాల్లో రైతుల జీవితాలనే ఆవిష్కరించారు. 

భారత్‌ ప్రధానంగా వ్యవసాయ దేశమవడం వల్ల పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ ప్రభుత్వం అధికారంలోకి రాగానే భూ సంస్కరణలు తీసుకొచ్చింది. అప్పుడే అభ్యుదయ రచయితల సంఘం ‘దెహఖాన్‌ (రైతు), మజ్దూర్‌ (కార్మికుడు)’ పుస్తకాల్లో రైతుల జీవన స్థితిగతులనే వర్ణించాయి. ఇలాంటి చారిత్రక, సాంస్కృతిక, సాహిత్య నేపథ్యంలో రుణాల భారం ఎక్కువై గిట్టుబాటు ధరల్లేక అలమటిస్తున్న నేటి రైతును పాలకులు పూర్తిగా విస్మరించారు. గత మూడేళ్లుగా దేశం నలుమూలల నుంచి లక్షకు పైగా రైతులు ఇటు ఢిల్లీకి, అటు ముంబైకి పలుసార్లు పాదయాత్రలు చేసిన వారికి శుష్క వాగ్దానాలే మిగిలాయి. మొన్న ఢిల్లీని ముట్టడించి కూడా నిరాశ నిస్పృహలకు గురైన రైతులు, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పాలకపక్షాలు ఓడిపోవాలని శాపనార్థాలు పెట్టారు. వారికి ఎక్కడా ఓట్లేసేది లేదంటూ ఒట్లు కూడా పెట్టుకున్నారు. ‘అన్నదాత సుఖీభవ!’ అనే పాలకుల కోసం వారు నిరీక్షిస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top