ఫేక్‌ న్యూస్‌కు చెక్‌ పెడుతున్నారు 

Facebook Tries To Stop Spreading Fake News - Sakshi

ప్రాంతీయ భాషల్లోనూ కంటెంట్‌ సమీక్షకులు

కేంబ్రిడ్జి ఎనలైటికా కేసులో గట్టిగా ఎదురు దెబ్బ తిన్న ఫేస్‌బుక్‌ అన్ని వైపుల నుంచి  ప్రక్షాళన కార్యక్రమాలు ప్రారంభించింది. భారత్‌లో కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనుండడంతో తప్పుడు రాజకీయ వార్తలు ప్రచారం జరగకుండా చర్యలు తీసుకుంది. ఇన్నాళ్లూ ఆంగ్లభాషలో ఉన్న పోస్టులనే పర్యవేక్షించిన ఫేస్‌బుక్‌ ఇప్పుడు జాతీయ భాష హిందీతో పాటుగా  ప్రాంతీయ భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, బెంగాలీ, గుజరాతీ తదితర భాషల్లో వచ్చిన పోస్టింగుల్ని పర్యవేక్షించడానికి కొంతమంది కంటెంట్‌ రివ్యూయర్లను నియమించింది. మత విద్వేషాలు రెచ్చగొట్టేవి, జాతి అంహకారాన్ని ప్రదర్శించేవి, నోటిదురుసుతనంతో రాసేరాతలపై ఈ రివ్యూయర్లు ఒక కన్నేసి ఉంచుతారు.

ఎన్నికల ఫీవర్‌ దేశవ్యాప్తంగా రాజుకోవడంతో మొదట వీళ్లంతా రాజకీయ వార్తల్ని సెన్సార్‌ చేయనున్నారు. పోస్టులు, వీడియోలు, ఫోటోల్లో ఏ మాత్రం అభ్యంతరకరంగా కనిపించిన అంశాలున్నా వెంటనే వాటిని తొలగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 40 భాషల్లో కంటెంట్‌ రివ్యూయర్లు ఉన్నారు. దీనికి సంబంధించి వివిధ దేశాల్లో 11 కార్యాలయాలను ఏర్పాటు చేసింది. మొత్తం 7,500 మంది సమీక్షకుల్ని ఇప్పటివరకు నియమించింది. ఈ చర్యలతో ఇకపై ఫేస్‌బుక్‌ ద్వారా ఓటర్లపై వల వేయడం రాజకీయ పార్టీలకు అంత సులభం కాదు. అంతేకాదు రాజకీయ పార్టీలు ఫేస్‌బుక్‌లో వాణిజ్యప్రకటల కోసం ఎంత ఖర్చు చేస్తున్నారా అన్న డేటా కూడా సేకరించనుంది. ఆప్‌ వంటి రాజకీయ ఫార్టీలు ఫేస్‌బుక్‌ చర్యల్ని స్వాగతిస్తున్నాయి. సోషల్‌ మీడియాలో నెలకొన్న విద్వేష పూరిత వాతావరణాన్ని కొంతైనా కట్టడి చేయగలిగితే మంచిదేనని కామెంట్లు చేస్తున్నాయి. 

-సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top