మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కళంకితులే చక్రం తిప్పుతున్నారు. అన్ని పార్టీల్లోనూ ఇదే తంతు.
మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కళంకితులే చక్రం తిప్పుతున్నారు. అన్ని పార్టీల్లోనూ ఇదే తంతు. ఆ రాష్ట్రంలో ప్రతి నలుగురు ఎమ్మెల్యేలకు ఒకరిపై క్రిమినల్ కేసులున్నాయి. ప్రస్తుత శాసన సభలో 219 మంది ఎమ్మెల్యేలుండగా, ఏకంగా 55 మందిపై కేసులు నమోదు కావడం విస్తుగొలిపే విషయం. వీరిలో మంత్రులూ ఉన్నట్టు ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. రెండు శాసన సభ స్థానాలు ఖాలీగా ఉన్నాయి.
నేరచరిత ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల్లో అధికార బీజేపీకి చెందినవారు 28 మంది, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ వారు 21 మంది, బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన వారు ముగ్గురున్నారు. 2008 ఎన్నికల సందర్భంగా మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అఫడవిట్లో తమ వివరాలను అసంపూర్తిగా నింపారు. నవంబర్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నేరచరిత ఆరోపణలున్నవారికి టికెట్లు ఇవ్వరాదంటూ అన్ని రాజకీయ పార్టీలకు స్వచ్ఛంద సంస్థ విజ్ఞప్తి చేసింది.