శక్తి స్వరూపిణి

శక్తి స్వరూపిణి - Sakshi


సాక్షి ప్రతినిధి, చెన్నై: పురచ్చితలైవి(విప్లవ నాయకి)లోని తెగువ.. అమ్మలోని అనురాగం.. ఎన్ని కష్టాలెదురైనా వెనక్కి తగ్గని నైజం ఆమె సొంతం. రెండేళ్లకే తండ్రి చనిపోయినా.. తల్లి సినిమాల్లోకి వెళ్లడంతో చిన్నతనంలో మాతృప్రేమకు దూరమైనా.. ఆమె కుంగిపోలేదు. చదువుల్లో టాపర్ అయినా.. కుటుంబపోషణ కోసం నాటకాల బాటపట్టినా.. ఎక్కడా నిరుత్సాహపడలేదు. నిండుసభలో దుశ్శాసన పర్వాన్ని ఎదుర్కొన్నా.. ఆ తర్వాత రెండేళ్లకే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన ధీరోదాత్త. ఇలా ఒక్కసారి కాదు ఏకంగా ఆరుసార్లు ముఖ్యమంత్రిగా ప్రజామన్ననలు పొందిన రికార్డు జయలలితకే సాధ్యం.తరతరాలుగా వేళ్లూనుకుపోయి ఉన్న పురుషాధిక్య సమాజంలో.. అందులోనూ రాజకీయాల్లో నెగ్గుకు రావడమంటే మాటలు కాదు. ఇది దాదాపు అసాధ్యమే. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి అందరి చేత ‘జయ’హో అనిపించుకున్నారు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబంలో పుట్టినా జాతీయస్థాయి రాజకీయ పుంగవుల చేత జేజేలు కొట్టించుకున్నారు. ఒకనాడు ఇందిరాగాంధీ, మార్గరెట్ థాచర్‌లను ఉక్కు మహిళ అనే వారు. ఈ కోవలోనే జయలలితనూ దక్షిణాది ఉక్కు మహిళ అని పిలుచుకోవచ్చు. ఆటుపోట్లతో అమ్మ ఎదురీత

 ఎంజీఆర్ మరణంతో జయకు కష్టాలు ప్రారంభమయ్యాయి. విపక్షం డీఎంకేతో పాటు స్వపక్షం అన్నాడీఎంకే నుంచి కూడా ఆమె అవమానాలను ఎదుర్కొన్నారు. ఎంజీఆర్ మృతి చెందగానే పార్టీ రెండుగా చీలింది. ఒక వర్గానికి నాయకత్వం వహించిన ఎంజీఆర్ సతీమణి జానకీ రామచంద్రన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ ఆర్టికల్ 356 ప్రయోగించి జానకీ రామచంద్రన్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. అక్కడితో ఆమె శకం ముగిసింది. 1989లో ఎంజీఆర్ రాజకీయ వారసురాలిగా తన వర్గానికి నాయకత్వం వహించి ఎన్నికల బరిలోకి దిగిన జయ.. తేనీ జిల్లా బోడినాయకనూర్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఆమె పార్టీ కేవలం 27 సీట్లు మాత్రమే గెలవడంతో ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. తద్వారా తమిళనాడు తొలి మహిళా ప్రతిపక్ష నేతగా జయ చరిత్ర కెక్కారు. అదే ఏడాది జయ జీవితంలో మర్చిపోలేని చేదు సంఘటన చోటుచేసుకుంది.నిండు సభలో స్పీకర్ సాక్షిగా అధికారపక్షం డీఎంకే చేతిలో దాడికి, తీవ్ర పరాభవానికి గురయ్యారు. చినిగిన చీరతో అసెంబ్లీ నుంచి వెళ్లిపోతూ.. ‘ముఖ్యమంత్రి అయ్యే వరకు అసెంబ్లీలో అడుగుపెట్టను’ అని జయ శపథం చేశారు. కాగా, చట్టసభలో ఎదురైన పరాభవం ఆమెకు ప్రజల నుంచి అంతులేని సానుభూతి తెచ్చిపెట్టింది. అదే సమయంలో అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు ఏకమవ్వడంతో జయలలిత పార్టీ సామ్రాజ్ఞిగా ఎదిగారు. 1991 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆమె స్నేహహస్తం అందించారు. ఆ ఎన్నికల సమయంలోనే మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని ఎల్‌టీటీఈ తీవ్రవాదులు హతమార్చారు. కాగా, ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే, కాంగ్రెస్ కూటమి 234 అసెంబ్లీ స్థానాలకు గానూ 225 చోట్ల, 39 పార్లమెంటు స్థానాల్లో గెలుపొంది జయకేతనం ఎగరవేసింది. దీంతో 1991లో జయలలిత తొలిసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. శపధాన్ని రెండేళ్లు కూడా తిరగక ముందే నెరవేర్చి ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో జయ అడుగుపెట్టారు. అనంతరం 1996 ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోరుుంది. మళ్లీ 2001లో రెండోసారి జయ ముఖ్యమంత్రి అయ్యారు. ఆతర్వాత 2002లో మూడోసారి, 2011లో నాలుగోసారి, 2015లో ఐదోసారి, 2016లో ఆరోసారి ముఖ్యమంత్రిగా జయలలిత బాధ్యతలు చేపట్టారు. రికార్డుల్లో గురువును మించిన శిష్యురాలు

 రాజకీయాల్లో ఓనమాలు దిద్దించిన ఎంజీఆర్ సాధించిన రికార్డులను బద్దలుకొట్టడం ద్వారా గురువును మించిన శిష్యురాలు అనిపించుకున్నారు జయ. ఎంజీఆర్ మూడుసార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తే.. ఆయన శిష్యురాలు జయలలిత ఆరుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే గత పార్లమెంటు ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి 39 స్థానాల్లో 37 స్థానాలను గెలుచుకున్న రికార్డు కూడా జయకు మాత్రమే సొంతం. మిత్రపక్ష పార్టీలను కూడా రెండు ఆకుల గుర్తుపైనే పోటీ చేరుుంచి గెలిపించడం జయ నాయకత్వ పటిమకు నిదర్శనం. అధికార  పార్టీని ఐదేళ్ల తర్వాత ప్రతిపక్షంలో కూర్చోబెట్టడం తమిళనాడు ప్రజల సంప్రదాయం. దీనిని కూడా ఆనాడు ఎంజీఆర్ తుడిచిపెట్టగా, ఇటీవలి ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడం ద్వారా జయలలిత ఆ రికార్డును కూడా చెరిపివేశారు. ఎంజీఆర్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా, జయలలిత 8 సార్లు పోటీ చేసి 7సార్లు గెలిచారు. ముహూర్తమంటే మక్కువ

 జ్యోతిష, సంఖ్యాశాస్త్రాలపై నమ్మకం కలిగిన జయలలిత తాను నివసిస్తున్న పోయెస్‌గార్డెన్‌లోని భవనానికి తన తల్లి పేరు కలిసొచ్చేలా ‘వేద నిలయం’ అని పేరు పెట్టుకున్నారు. అలాగే తన పేరును jayalalithaa (చివరన ‘ఎ’ అక్షరం అదనంగా)గా మార్చుకున్నారు. ఇక మంచి ముహూర్తం లేనిదే జయ కాలు బయటపెట్టరు. దైవభక్తి మెండుగా ఉన్న జయలలిత చెన్నై నగరంలోని కొట్టూరుపురం వినాయకుని ఆలయానికి తరచూ వెళుతుంటారు. అలాగే తన నెలసరి వేతనంతో ఆలయాల్లో నిత్యాన్నదానాలతో పాటు చిన్న గున్న ఏనుగును కూడా బహూకరించేవారు.

 

  కోమలవల్లి... జయలలిత

 కర్నాటకలోని(నాటి మైసూరు రాష్ట్రం) మాండ్య జిల్లా మేల్కోటేలో తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబంలో జయరామన్, వేదవల్లి(సంధ్య) దంపతులకు 1948 ఫిబ్రవరి 24న జయలలిత జన్మించారు. కుటుంబ సంప్రదాయం ప్రకారం బిడ్డలకు రెండు పేర్లు పెట్టాల్సి ఉంది. ఒకటి పూర్వీకుల పేరు, మరొకటి వ్యక్తిగత పేరు. దీంతో అమ్మమ్మ కోమలవల్లి పేరుతో పాటు జయలలిత అని నామకరణం చేశారు. జయలలిత అనే పేరు వెనుక ఒక చిన్న చరిత్ర ఉంది. జయ చిన్నతనంలో ఆమె కుటుంబం మైసూరులో రెండు ఇళ్లలో అద్దెకు ఉంది. అందులో ఒకటి జయ విలాస్, మరొకటి లలిత విలాస్. ఈ రెండు పేర్లను కలిపి జయలలిత అని పెట్టారని చెబుతుంటారు. తండ్రి న్యాయవాద వత్తిని నిర్వహించినా ధనంపై ఆశతో పనిచేయకపోవడంతో స్థితిమంతులు కాలేకపోయారు. జయకు రెండేళ్ల ప్రాయంలోనే తండ్రి చనిపోయాడు. దీంతో తల్లి వేదవల్లి చంటిబిడ్డ జయను చంకన వేసుకుని బెంగళూరులోని తన పుట్టింటికి వచ్చేసింది.వేదవల్లి సోదరి అంబుజవల్లి ఎరుుర్‌హోస్టెస్‌గా పనిచేస్తూ డ్రామాలు, సినిమాల్లో నటించేందుకు మద్రాస్‌కు మకాం మార్చింది. దీంతో చిన్నారి జయను వదిలి తల్లి వేదవల్లి కూడా కుటుంబపోషణ నిమిత్తం 1952లో మద్రాస్‌కు వచ్చేశారు. ఆ తర్వాత వేదవల్లి సినిమా నటిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా మారి తన వెండితెర పేరును సంధ్యగా మార్చుకున్నారు. తల్లిని విడిచి ఉండలేని జయలలిత కూడా 1958లో మద్రాసుకు చేరారు. జయ విద్యాభ్యాసం బెంగళూరులోని బిషప్ కాటల్ గర్‌ల్స్ హైస్కూల్‌తో పాటు మద్రాస్‌లోని చర్చిపార్క్ స్కూల్, స్టెల్లా మేరీస్ కాలేజీలో కొనసాగింది. చదువులో జయ ఎప్పుడూ టాపర్‌గా ఉండేవారు. తమిళంతో పాటు తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ, ఇంగ్లిషు భాషల్లో అనర్గళంగా మాట్లాడగల దిట్టగా ఎదిగారు. అరుుతే, న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకోవాలనుకున్న జయ.. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా సినీపరిశ్రమలో అడుగుపెట్టాల్సి వచ్చింది. అనంతర కాలంలో తమిళ ప్రజలు దేవుడిగా కొలిచే వెండితెర వేల్పు ఎంజీ రామచంద్రన్‌తో ఆమెకు పరిచయ భాగ్యం కలిగింది.

 

 ఇష్టాఇష్టాలు

 జయలలిత పూర్తి శాకాహారి. తన జీవితాన్ని ప్రభావితం చేసిన వారిలో మొదటి వ్యక్తిగా తల్లి సంధ్య పేరును ప్రస్తావించే జయలలిత.. అనంతరం రాజకీయ గురువు ఎంజీఆర్, మదర్ సెలినా(తన స్కూల్ టీచర్)ను కూడా తప్పకుండా గుర్తు చేసుకుంటారు. న్యాయశాస్త్రాన్ని అమితంగా ఇష్టపడే జయలలిత మంచి పుస్తకాలను సేకరించి పోయెస్ గార్డెన్‌లోని తన ఇంట్లో పెద్ద గ్రంథాలయమే ఏర్పాటు చేసుకున్నారు. ఇక జయలలితకు ఇష్టమైన పుస్తకం ‘వైల్డ్ స్వాన్స్’. ఇదిలాఉండగా, జయ ఇంట్లోనే తమిళ, ఇంగ్లిష్ పాత చిత్రాలను కూడా చూసేవారు. రాష్ట్రంలోని ఐదు విశ్వవిద్యాలయాలు ఆమెను డాక్టరేట్‌తో సత్కరించడం విశేషం. ఇక, జయకు ప్రాణ స్నేహితురాలు(నెచ్చెలి) శశికళ అరుుతే బద్ద విరోధి డీఎంకే అధినేత ఎం.కరుణానిధి.

 

 ఎంజీఆర్ అడుగుజాడల్లో..

అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్(ఎంజీఆర్)ను రాజకీయ గురువుగా భావించిన జయలలిత ఆయన అడుగుజాడల్లో నడవడం ప్రారంభించారు. 1982లో ఆమెకు ఎంజీఆర్ పార్టీ సభ్యత్వం కల్పించారు. బహిరంగ సభల్లో జయను ‘పెన్నిన్ పెరుమై’(మహిళలకే గర్వకారణం) అంటూ ఎంజీఆర్ పరిచయం చేసేవారు. 1983లో పార్టీ ప్రచార కార్యదర్శిగా ఆమెను నియమించారు. ఈ బాధ్యతలను జయ సమర్థవంతంగా నిర్వర్తించి ఆయన మెప్పు పొందారు. దీంతో 1984లో ఆమెను రాజ్యసభకు ఎంపిక చేశారు. అదే ఏడాది ఎంజీఆర్‌కు గుండెపోటు రావడం, అదే సమయంలో సార్వత్రిక ఎన్నికలు ముంచుకు రావడంతో పార్టీ ప్రచార కార్యదర్శిగా జయ విస్తృతంగా పర్యటించి పార్టీకి మంచి ఫలితాలు రాబట్టారు. కాగా, మూడేళ్ల తర్వాత 1987లో ఎంజీఆర్ మృతి చెందారు. పురట్చితలైవర్ (విప్లవనాయకుడు) అంటూ ఎంజీఆర్‌ను ప్రేమగా పిలుచుకునే ప్రజలు.. ఆయన రాజకీయ భావజాలాన్ని అందిపుచ్చుకున్న జయలలితను పురట్చితలైవి (విప్లవనాయకి)గా పిలవనారంభించారు.

 

 అమ్మ.. చిన్నమ్మ సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రాజకీయ జీవితాన్ని ఎంతగా చెప్పుకున్నా.. ఆమె నెచ్చెలి శశికళను ప్రస్తావించకుంటే అది అసంపూర్తే. అన్నాడీఎంకే పార్టీ, ప్రభుత్వంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ‘ఈమె శశికళ మాత్రమే కాదు, జయలలిత నీడ’ అనేంతటి ప్రాధాన్యతను కల్పించుకుని టాక్ ఆఫ్ ది కంట్రీగా మారారు. శశికళ జయకు దగ్గరైన వేళ

 1983లో జయలలిత అన్నాడీఎంకే ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించినప్పుడు వీడియో కవరేజీ ఫొటో స్టూడియోను నడుపుతున్న శశికళను కలెక్టర్ చంద్రలేఖ జయకు పరిచయం చేశారు. వారిద్దరి పరిచయం స్నేహంగా మారింది. ఎంజీ రామచంద్రన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో, ఆయన మరణం తర్వాత జయలలితకు పార్టీలో వ్యతిరేకుల నుంచి ఒత్తిడి ప్రారంభమైంది. ఈ కష్టకాలంలో శశికళ జయకు అండగా నిలిచారు. ఆ తరువాత జయలలిత నివాసమైన పోయెస్‌గార్డెన్‌లోనే శశికళ నివసించడం ప్రారంభించారు. 1991లో తొలిసారిగా జయ ముఖ్యమంత్రి అయ్యారు. పోయెస్‌గార్డెన్‌లో శశికళ బంధువుల పెత్తనం పెరిగింది. శశికళ అన్న కుమారుడు సుధాకరన్‌ను జయ దత్తు తీసుకున్నారు.1996లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయ అరెస్టుకాగా, ఆమెతో పాటూ శశికళ కూడా అరెస్టయ్యారు. 2001 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చినా టాన్సీ కుంభకోణం వివాదాల్లో చిక్కుకుని ఉన్నందున జయ సీఎం కాలేక పోయారు. అపుడు పన్నీర్‌సెల్వంను తాత్కాలిక ముఖ్యమంత్రిగా పీఠంపై కూర్చోబెట్టింది శశికళనే. 2011లో జయ మళ్లీ అధికారంలోకి రాగా శశికళ కుటుంబ సభ్యుల అట్టహాసం మళ్లీ వేగం పుంజుకుంది. దీంతో జయలలిత ఆగ్రహం చెంది శశికళను పోయెస్‌గార్డెన్ నుంచి బైటకు పంపివేశారు. అరుుతే రెండోసారి కూడా శశికళ, జయలలితల మధ్య విభేదాలు ఎంతోకాలం నిలబడలేదు. శశికళ మళ్లీ పోయెస్‌గార్డెన్‌కు చేరుకున్నారు. ‘నన్ను చూసుకోవడం శశికళ వల్లనే సాధ్యం, ఆమె లేకుండా నేను ఒంటరిగా ఉండలేను’ అనే ఆప్యాయతను జయ ప్రదర్శించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top