సినీ జయన్మాత

సినీ జయన్మాత - Sakshi


హీరోలు సీఎంలు కావడం ఓకే.కానీ, హీరోయిన్ సీఎం కావడం గ్రేట్ అచీవ్‌మెంట్. కఠినమైన బాల్యం... అనిష్టమైన సినీరంగం...జటిలమైన రాజకీయ చదరంగం... వీటి నుంచి తారాజువ్వలా  ఎగసింది జయలలిత.ఆకుపచ్చ బట్ట కట్టినా... కుమారుడి పెళ్లి కోసం ఆకాశమంత పందిరి వేసినా... ఆమె ఒక సెన్సేషన్! ఎందరికో ‘అమ్మ’...అఖిల తమిళనాడుకు ‘పురట్చి తలైవి’...జనాదరణలో మేటి సీఎం...జయలలిత... జై లలిత!

 

 ‘‘జీవితంలో నేను ఎదుర్కొన్న ఒడుదొడుకులు నాకో మంచి పాఠం నేర్పించాయి. జీవితంలో నువ్వు ఒకే ఒక్క వ్యక్తి మీద ఆధారపడాలి. ఆ వ్యక్తి ఎవరో కాదు... ‘నువ్వే’!’’ - ఇది జయలలిత స్వయంగా చెప్పిన సిద్ధాంతం. చెప్పడమే కాదు... చేతల్లోనూ ఆచరించిన సిద్ధాంతం. నిజంగానే ఆమె జీవితం మొత్తం తన మీద తానే ఆధారపడ్డారు. ఒంటరి పోరు చేశారు. మైసూరులోని మాండ్య జిల్లా, పాండవపుర తాలూకాలోని మేలుకోటేలో 68 ఏళ్ళ క్రితం జన్మించిన మామూలు అమ్మాయి స్వశక్తితో సినీ, రాజకీయ జీవితాల్లో శిఖరాలు అధిరోహించారు.



 తమిళ అయ్యంగార్ కుటుంబంలో 1948 ఫిబ్రవరి 24న జయరామ్, వేదవల్లి దంపతులకు జయలలిత జన్మించారు. స్వతహాగా అయ్యంగార్ కుటుంబాల్లో రెండు పేర్లు పెడతారు. ఒకటి పిల్లకు పెట్టే, నాయనమ్మ, తాతమ్మల పేరు. మరొకటి ఇంట్లో, స్కూల్లో పిలుచుకొనే పేరు. అలా జయలలితకు పెట్టిన అసలు పేరు - ‘కోమలవల్లి’. ఆ తర్వాత ‘జయలలిత’ అని నామకరణం చేశారు. జయలలిత తాత నరసింహన్ రంగాచారి మైసూరు సంస్థానంలో మైసూర్ మహరాజా జయరామ రాజేంద్రకు వైద్యుడిగా వ్యవహరించేవారు. అందుకే తన వారసుల పేర్లకు ముందు ‘జయ’ అని చేర్చేవారు. జయలలితకు ఒక అన్నయ్య. పేరు జయకుమార్.



రెండేళ్ల వయసులోనే ఆమె తండ్రి జయరామ్ చనిపోయారు. ఆ తర్వాత బెంగళూరులో ఉంటున్న పుట్టింటి వారి దగ్గరకు కూతురితో సహా చేరారు జయలలిత తల్లి వేదవల్లి.



 కుటుంబ బాధ్యతను మోయడం కోసం వేదవల్లి టైపు, షార్ట్ హ్యాండ్ నేర్చుకొని, గుమస్తాగా పని చేయడం మొదలుపెట్టారు. తర్వాత మద్రాసులో ఎయిర్‌హోస్టెస్‌గా, రంగస్థల నటిగా కొనసాగుతున్న తన సోదరి అంబుజవల్లి దగ్గరికి వేదవల్లి వెళ్లారు. దాంతో అమ్మకు దూరంగా అమ్మమ్మ-తాతల దగ్గర పెరిగారు జయలలిత. కూతురికి దూరంగా వేదవల్లి మద్రాసులో ఉంటూ, సంధ్యగా పేరు మార్చుకుని నాటకాల్లోకి, తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టారు. అటుపైన ఆర్థికంగా ఫర్వాలేదనిపించడంతో కుమార్తెను కూడా మద్రాసు తీసుకెళ్ళారు.

 

 స్టేట్ ఫస్ట్ స్టూడెంట్!

 మద్రాసులో ‘ది బెస్ట్’ అన్నదగ్గ వాటిలో ఒకటైన ‘చర్చి పార్క్ కాన్వెంట్’లో జయలలితను తల్లి చేర్చారు. చిన్నప్పటి నుంచి జయలలిత చాలా తెలివైన స్టూడెంట్. పదో తరగతిలో తమిళనాడులోనే ఎక్కువ పర్సంటేజ్ మార్కులు సాధించిన విద్యార్థినిగా అవార్డు కూడా సాధించారు. ఒకవైపు స్కూలు చదువులతో పాటు శాస్త్రీయ సంగీతం, పియానో వాద్యం, భరతనాట్యం, మణిపురి, కథక్ వంటి నృత్య రీతులు జయలలిత నేర్చుకున్నారు. సుప్రసిద్ధ భరత నాట్యాచారిణి కె.జె. సరస ఆమెకు గురువు. తొలిసారిగా నృత్య ప్రదర్శన (అరంగేట్రం) ఇచ్చిన సమయంలోనే జయలలిత డ్యాన్స్ చూసి, ప్రముఖ నటుడు శివాజీగణేశన్ ‘పెద్ద ఆర్టిస్ట్’ అవుతుందని ఆమె తల్లి సంధ్యతో అన్నారు. ఆ తర్వాత అదే నిజమైంది.



 వాస్తవానికి కూతురిని బాగా చదివించాలన్నది తల్లి సంధ్య ఆశయం. అందుకే, బాల నటిగా పలు అవకాశాలు వచ్చినప్పుడు, ‘అమ్మాయి చదువుకు ఆటంకం లేకుండా షూటింగ్స్ పెడితే ఓకే’ అని ఆమె కండిషన్ పెట్టారు. బాల నటిగా జయలలిత నటించిన తొలి కన్నడ చిత్రం ‘శ్రీశైల మహాత్మె’ (1961). అందులో చిన్నారి పార్వతీదేవిగా బాల జయలలిత కనిపిస్తారు. ఆ తర్వాత 1962లో హిందీ చిత్రం ‘మన్ మౌజీ’లో కృష్ణుడి వేషం వేశారు. ఆ తర్వాత అనేక ఇంగ్లిష్, తమిళ నాటికల్లో నటించారు. అది చూసి, మాజీ రాష్ట్రపతి వి.వి. గిరి కుమారుడు శంకరగిరి ఆ సమయంలోనే ‘ది ఎపిసిల్’ అనే ఇంగ్లిష్ మూవీలో నటింపజేశారు.

 

 లాయర్ కాబోయి... యాక్టర్

 ప్రముఖ దర్శక - నిర్మాత బీఆర్ పంతులు ‘కర్ణన్’ (తెలుగులో ‘కర్ణ’) చిత్రం విజయోత్సవంలో తల్లి చాటు బిడ్డ జయలలితను చూశారు. వెంటనే తాను నిర్మించనున్న కన్నడ చిత్రం ‘చిన్నద గొంబె’ (1964)లో కథానాయికగా పరిచయం చేస్తానన్నారు. పదో తరగతి పరీక్షలు రాసి సెలవుల్లో ఉండటంతో, కాలేజీ తెరిచే లోపు షూటింగ్ పూర్తి చేయాలని తల్లి సంధ్య షరతు పెట్టారు, అలా జయ తొలిసారిగా నాయిక పాత్ర పోషించారు. బాలనటిగా, కథానాయికగా జయ తొలి సినిమాలు కన్నడంవే కావడం విశేషం.  



 తండ్రి లాయర్ కావడంతో, ఆ ప్రభావంతో న్యాయశాస్త్రం చదవాలన్నది జయ ఆశయం. అయితే బతుకు బండిని లాగడం కష్టం కావడంతో, వరుసగా అవకాశాలు వస్తున్న కూతుర్ని సినిమాల్లో కొనసాగించాలని తల్లి అనుకోవడంతో జయ జీవితమే మారిపోయింది.

 

 ఇద్దరు సీ.ఎంలతో మూడో సీ.ఎం!


 తెలుగువాడైన ప్రముఖ తమిళ చిత్ర దర్శకుడు సి.వి. శ్రీధర్ దర్శకత్వంలో ‘వెన్నిరాడై’ (1965) చిత్రం ద్వారా తమిళ తెరకు కథానాయికగా పరిచయమయ్యారు జయలలిత. అందం, అభినయం మెండుగా ఉన్న తార అనిపించుకోవడంతో వరుసగా అవకాశాలు రావడంతో వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండాపోయింది. కె. ప్రత్యగాత్మ దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘మనుషులు- మమతలు’ (’65) ద్వారా తెలుగు తెరకు కథానాయికగా పరిచయం అయ్యారామె. తెలుగులో ‘చిక్కడు-దొరకడు’, ‘తిక్క శంకరయ్య’, ‘గండికోట రహస్యం’, ‘శ్రీకృష్ణ విజయం’, ‘దేవుడు చేసిన మనుషులు’ - ఇలా ఎన్టీఆర్ సరసన అత్యధికంగా 11 చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, దేవిక నటించిన ‘నిలువు దోపిడీ’లో కృష్ణకు కథానాయికగా చేశారు.



ఎన్టీఆర్‌తో ఆమె చేసిన చిత్రాల్లో అధిక భాగం హిట్లే. అలాగే తమిళంలో ‘ఆయిరత్తిల్ ఒరువన్’ మొదలుకొని ‘పట్టికాట్టు పొన్నయ్య’ వరకూ ఎంజీఆర్ సరసన 28 హిట్ చిత్రాల్లో నటించారు. ఇవన్నీ 1965 నుంచి 1973 మధ్య విడుదలైన చిత్రాలే. ఆ తరువాత అటు ఎం.జి.ఆర్ తమిళ రాష్ట్రానికీ, ఇటు ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రానికీ ముఖ్యమంత్రులయ్యారు. అలా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఎక్కువ సినిమాల్లో నటించిన జయలలిత ఆ తర్వాత తానూ ముఖ్యమంత్రి కావడం విశేషం.

 

 ఎనిమిదిసార్లు డబుల్ పోజ్!


 దాదాపు రెండు దశాబ్దాల కెరీర్‌లో మొత్తం ఎనిమిది చిత్రాల్లో జయలలిత ద్విపాత్రాభినయం చేశారు. లేడీ ఓరియంటెడ్ మూవీ ‘యార్ పెణ్’లో తొలిసారి రెండు పాత్రలు చేశారు. ఆ తర్వాత  ‘కందన్ కరుణై’ (’67), ‘నీ’, ‘అడిమై పెణ్’, ‘గంగా గౌరి’ వంటి చిత్రాల్లో రెండు పాత్రల్లో కనిపించారు.

 

 మేకప్ వేసుకున్నందుకు పనిష్‌మెంట్!


 నిజానికి అంతకు ముందు చాలా కాలం క్రితం ఓసారి జయలలిత ఎంతో ముచ్చటపడి ముఖానికి మేకప్ వేసుకుంది. అప్పటికే నటిగా మేకప్ వేసుకున్న సంధ్యకు కూతురు మేకప్ వేసుకోవడం ఏ మాత్రం ఇష్టం లేదు. దాంతో జయకు పెద్ద పనిష్‌మెంటే ఇచ్చారు. ‘మేకప్ వేసుకున్నా.. సినిమాల జోలికి వచ్చినా ఊరుకునేది లేదు’ అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అలాంటి తల్లే చివరకు తనను సినిమాల్లోకి తీసుకెళ్లాలనుకోవడం జయలలితను ఆశ్చర్యపరిచింది. స్వతహాగా మంచి స్టూడెంట్ కావడంతో అప్పటికే మద్రాసులో పేరున్న స్టెల్లా మేరీస్ కాలేజీలో సీటొచ్చినా, జయలలిత నిరాకరించక తప్పలేదు. అనిష్టంగానే తల్లి ప్రతిపాదనకు తలూపారు.

 

 లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో...


 ఏ హీరో సరసన నటిస్తే, ఆ హీరోకి సరిజోడీ అనిపించుకోవడం జయలలిత ప్రత్యేకత. ‘నడిగర్ తిలగం’ శివాజీగణేశన్ సరసన ఆమె 17 చిత్రాల్లో నటించారు. వాటిలో ‘దైవమగన్’ ఒకటి. ఆస్కార్ అవార్డ్స్‌కు ‘ఉత్తమ విదేశీ చిత్రం’ విభాగంలో ఇండియా నుంచి నామినేషన్ ఎంట్రీగా వెళ్లిన తొలి తమిళ చిత్రం ఇది. ఇంకా తమిళ నటుడు జయశంకర్, రవిచంద్రన్ తదితర హీరోల సరసన జయలలిత నటించారు. హిందీ నటుడు ధర్మేంద్ర సరసన ‘ఇజ్జత్’లో నటించారు. ఒకానొక దశలో సినిమా టైటిల్స్ జయలలిత క్యారెక్టర్ మీద పెట్టినా, హీరోలెవరూ అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం ఆమె సంపాదించుకున్న క్రేజ్‌కీ, ఇమేజ్‌కీ నిదర్శనం. ‘అడిమై పెణ్’ (బానిస అమ్మాయి అని అర్థం), ‘కణ్ణన్ ఎన్ కాదలన్’ (కణ్ణన్ నా ప్రేమికుడు), ‘ఎన్‌గిరిందో వందాళ్’ (ఎక్కణ్ణుంచో వచ్చింది) లాంటి చిత్రాలు అందుకు ఉదాహరణలు. ఒకవైపు హీరో ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించిన ఘనత జయలలితది. ఆ తరహా చిత్రాలు దాదాపు డజనుకు పైనే చేశారు.

 

 12 నెలలు... 11 సినిమాలు!

 సినిమా కెరీర్ మొత్తంలో జయ తమిళంలో దాదాపు 100 చిత్రాల్లో నటిస్తే, వాటిలో 80 సిల్వర్ జూబ్లీ హిట్స్ ఉన్నాయని తమిళ వర్గాలు చెబుతాయి. ఇక, తెలుగులోనూ సిల్వర్ జూబ్లీ హిట్స్ ఉన్నాయి. 1961 నుంచి కెరీర్ ఫుల్‌స్టాప్ పెట్టే సంవతర్సం 1980 వరకూ ఆమె కథానాయికగా చేసిన చిత్రాల్లో అధిక భాగం హిట్స్ ఉండడం విశేషం. చాలా పెద్ద మొత్తం పారితోషికం తీసుకున్న కథానాయిక కూడా కావడం మరో విశేషం. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీతో కలిపి ఆమె దాదాపు 140 సినిమాల్లో నటించారు. నటిగా ఎంత బిజీ బిజీగా సినిమాలు చేశారంటే... ఒక్క 1966లోనే ఆమె నటించిన 11 చిత్రాలు విడుదలయ్యాయి.



 బిరుదులు ఎన్నెన్నో... ఆ సమయంలోనే ఆమెకు ‘కవర్చి కన్ని’ అనే బిరుదు ఇవ్వడం జరిగింది. అంటే... ‘ఆకర్షణీయమైన యువతి’ అని అర్థం. ఆ తర్వాత 1969లో ‘కావేరి తంద కలై సెల్వి’ అనే ఇంకో బిరుదును సొంతం చేసుకున్నారు. అంటే.. ‘కావేరి ఇచ్చిన కళా తనయ’ అని అర్థం. అంతకు రెండేళ్లకు ముందు ‘కలై సెల్వి’ అనే బిరుదు అందుకున్నారు. అప్పటి నుంచి తెరపై ఆమె పేరుకు ముందు ‘కలై సెల్వి’ అని వేయడం ఆనవాయితీ అయింది.



 ఆఖరి చిత్రాలు... 1980లో వచ్చిన ‘నదియై తేడి వంద కడల్’ (నదిని వెతుక్కుంటూ వచ్చిన సముద్రం) తమిళంలో జయకు హీరోయిన్‌గా చివరి చిత్రం. ఆ ఏడాదే తెలుగులో ఆమె చేసిన చివరిఫిల్మ్ అక్కినేని ‘నాయకుడు- వినాయకుడు’.

 

 గాయని కూడా!

 స్కూల్ డేస్‌లోనే జయలలిత కర్ణాటక, పాశ్చాత్య సంగీతం నేర్చుకున్నారు. బాగా డ్యాన్స్ చేయడం మాత్రమే కాదు.. చక్కగా పాడగలరు కూడా. 1969లో నటించిన ‘అడిమై పెణ్’లో ‘అమ్మా ఎన్‌డ్రాల్ అన్బు..’ అనే పల్లవితో సాగే పాటను పాడారు. ‘అమ్మ అంటే ప్రేమ’ అని దానర్థం. నిజజీవితంలో కూడా తల్లి సంధ్యతో జయలలిత చాలా ప్రేమగా ఉండేవారు. ఆ చిత్రం తర్వాత కూడా ఏడెనిమిది చిత్రాల్లో జయలలిత పాడారు. సినిమాలకు సంబంధం లేని మూడు భక్తి ఆల్బమ్స్‌కు కూడా ఆమె పాడడం విశేషం.

 

 మీరు బాగుండాలి!

 1980లో సినిమాలకు దూరమై, రాజకీయాల్లోకి ప్రవేశించాక మళ్లీ సినిమాల గురించి జయలలిత ఆలోచించలేదు. అయితే, ఆ తర్వాత ఒకే ఒక్క సినిమాలో ఆమె నటించారు. అది - విసు దర్శకత్వంలో మణిరత్నం సోదరుడు జి. వెంకటేశ్ నిర్మించిన ‘నీంగ నల్లా ఇరుక్కనమ్’ (1992). అంటే ‘మీరు బాగుండాలి’ అని అర్థం. అందులో ఆమె తమిళనాడు ముఖ్యమంత్రిగానే నిజజీవిత పాత్రలో అతిథిగా కనిపిస్తారు. సామాజిక సమస్యలపై తీసిన ఈ చిత్రం తమిళనాడు ప్రభుత్వం తొలిసారిగా స్పాన్సర్ చేసిన సినిమా కూడా! దీనికి జాతీయ అవార్డూ వచ్చింది. చిత్ర నిర్మాణానికి ఏడాది ముందు జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. నటిగా జయలలిత తమిళనాడు ప్రభుత్వ ‘కలైమామణి’ సహా ఎన్నో అవార్డులందుకున్నారు. చలనచిత్ర చరిత్రలో ఆమెదో చెరగని ముద్ర. అమిత పుస్తకపఠనం, హుందాతనం కలగలసి, ‘జై’లలిత అనిపించుకున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top