
సల్మాన్ ఖాన్ పై కేసులు
వివాదాలతో సహజీవనం చేస్తున్న బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు 'రేప్' వ్యాఖ్యలు తలనొప్పి తెచ్చిపెట్టాయి.
లక్నో: వివాదాలతో సహజీవనం చేస్తున్న బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు 'రేప్' వ్యాఖ్యలు తలనొప్పి తెచ్చిపెట్టాయి. 'సుల్తాన్' సినిమా షూటింగ్ చేసుకుని బయటకు వచ్చిన తర్వాత తన పరిస్థితి రేప్‌కు గురైన మహిళలా ఉందని సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. తన కొడుకు చేసిన వ్యాఖ్యలపై సల్మాన్ తండ్రి సలీంఖాన్ క్షమాపణ చెప్పినా అతడిపై విమర్శలు ఆగలేదు. ఉత్తరప్రదేశ్ లోని లక్నో, కార్పూర్ లో సల్మాన్ ఖాన్ పై కేసులు నమోదయ్యాయి.
మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన సల్మాన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ లక్నో చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కు సామాజిక కార్యకర్త రఫత్ జమాల్ ఫిర్యాదు చేశారు. ఇదే డిమాండ్ తో కాన్పూరులోని 3వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో మనోజ్ కుమార్ దీక్షిత్ ఫిర్యాదు దాఖలు చేశారు. దీనిపై స్పందించిన కోర్టు జులై 14న పిటిషనర్ వాంగూల్మం తీసుకోవాలని ఆదేశించింది.